ETV Bharat / offbeat

ష్యూరిటీ లేకుండా "రూ.10 లక్షలు" - "పీఎం విద్యాలక్ష్మి" స్కీం గురించి తెలుసా?

ఉన్నత చదువులకు అండగా పీఎం విద్యాలక్ష్మి - దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపే రుణం మంజూరు!

PM Vidya Laxmi Scheme
PM Vidya Laxmi Scheme (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2026 at 4:04 PM IST

2 Min Read
Choose ETV Bharat

PM Vidya Laxmi Scheme Benefits : ఉన్నత విద్య అభ్యసించాలని తపన ఉన్నప్పటికీ, చాలా మంది యువత ఆర్థిక ఇబ్బందులు కారణంగా చదువుకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికే కేంద్రం "పీఎం విద్యాలక్ష్మి" పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక, ఉన్నత విద్య మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలు, ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్‌ (ఏబీఏ) సంయుక్తంగా విద్యాలక్ష్మి పోర్టల్‌ను రూపొందించాయి. 86 రకాల విద్యారుణాలు అందిస్తూ విద్యార్థుల కలలు సాకారం చేస్తున్నాయి. కొత్త విద్యా సంవత్సరం రాబోతుంది. ఇందులో భాగంగానే పలువురు విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్తుంటారు. వీరందరికి పీఎం విద్యాలక్ష్మి మేలు చేయనుంది.

పీఎం విద్యాలక్ష్మి పథకం కింద పది లక్షల రూపాయల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలిస్తారు. వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉన్న కుటుంబాల విద్యార్థులకు రూ.10 లక్షల వరకు రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. విద్యార్థులు తీసుకునే లోన్లకు కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీగా ఉండటంతో బ్యాంకులు ముందుకొస్తున్నాయి. కేవలం ట్యూషన్‌ ఫీజుకే కాకుండా, హాస్టల్, ల్యాబ్‌ ఫీజులు, పుస్తకాలు, పరీక్ష, విద్యాసామాగ్రికి ఉపయోగించుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు : ఇందుకోసం పీఎం విద్యాలక్ష్మి పోర్టల్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఈ పోర్టల్‌లో వివిధ బ్యాంకులకు సంబంధించిన రుణ పథకాలు పొందుపరిచారు. వాటిని పరిశీలించి తమకు నచ్చిన బ్యాంకుకు అప్లికేషన్​ పంపొచ్చు. ఖాతా క్రియేట్‌ చేసుకొని పేరు, మొబైల్ నంబర్​, ఈ-మెయిల్‌ ఐడీ, చిరునామా వివరాలు ఎంటర్ చేయాలి. మార్కులు జాబితా, చదివిన కోర్సుకు సంబంధించిన పత్రాలు, చదవాలనుకున్న కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ లెటర్​ జతచేసి విద్యా రుణం ఫాం ప్రక్రియ పూర్తి చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్​ స్థితిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ట్రాక్‌ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా బ్యాంకు సిబ్బంది రుణ మంజూరుపై స్పష్టతనిస్తారు.

ఎవరు అర్హులంటే : బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్, లా విద్యార్థులు ఇందుకు అర్హులు. వీరేకాక సాంకేతిక శాస్త్రీయ కోర్సులు బీఎస్సీ, ఎమ్మెస్సీ, పరిశోధనా కోర్సులు, ఇతర విద్యా విభాగాలైనా సీఏ, సీఎప్, ఎంఏతో పాటు ఇతర డిగ్రీలు చదివిన విద్యార్థులు అర్హులు. దేశంలోని అత్యుత్తమ 800 ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్​ పొంది ఉండాలి. గరిష్ఠంగా రూ.7.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఉంటుంది.

గడువేమీ లేదు : ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీ లేదు. రుణాన్ని మూడు విభాగాలుగా మంజూరు చేస్తారు. రూ.4 లక్షలలోపు, రూ.4 నుంచి రూ.7.5 లక్షలు, రూ.7.5 నుంచి రూ.10 లక్షల వరకు లోన్లు మంజూరవుతాయి. కోర్సుల ఫీజుకు అనుగుణంగా రుణాలు ఎంపిక చేసుకోవచ్చు. ఒక విద్యార్థికి ఒక్కసారి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.

పురుగు మందులపై వివిధ రంగుల గుర్తులు - అవి ఏం సూచిస్తాయంటే!

"జీవితంలో ఒక్కసారైనా చార్​ధామ్​ యాత్ర" - 'IRCTC' ఫ్లైట్ జర్నీ ప్లాన్ ఇదే!