స్వీట్ షాప్‌కి వెళ్లకుండా - ఇంట్లోనే ఈజీగా చేసుకునే "స్వీట్"! - దీపావళికి పర్ఫెక్ట్!
-బొంబాయి రవ్వ, కొబ్బరి తురుముతో సూపర్ స్వీట్ - స్టఫింగ్తో భలే రుచిగా ఉంటాయి!

Published : October 16, 2025 at 1:46 PM IST
Easy Diwali Sweet Recipe : దీపావళి దగ్గర్లోనే ఉంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండగగా, విజయానికి ప్రతీకగా దివాళీని సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సందర్భంగా టపాసులు కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడుపుతుంటాం. ఈ క్రమంలోనే చాలా మంది ఇంట్లోనే రకరకాల స్వీట్ రెసిపీలు ట్రై చేస్తుంటారు. అయితే, ఈ దివాళీకి ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ తీపి వంటకాలు కాకుండా వెరైటీగా, కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? మీకోసమే ఒక సూపర్ రెసిపీ వెయిట్ చేస్తోంది. అదే, నోరూరించే "రవ్వ కాకరాలు". పేరు వినడానికి కొత్తగా ఉన్నా ఇవి పూర్ణాల మాదిరిగానే లోపల కొబ్బరి స్టఫింగ్తో భలే రుచిగా ఉంటాయి. పాకంతో పని లేకుండా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే ఒకటికి రెండు ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఈ వెరైటీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- అరకప్పు - తాజా కొబ్బరి తురుము
- అరచెంచా - యాలకులపొడి
- పావుకప్పు - బెల్లం తురుము
- వేయించడానికి సరిపడా - నూనె
- అరకప్పు - బొంబాయి రవ్వ
- మూడు చెంచాలు - చక్కెర
- ఒక చెంచా - నెయ్యి
- చిటికెడు - ఉప్పు
పండక్కి పెద్ద కష్టపడకుండా - సేమియాతో అప్పటికప్పుడు చేసుకునే కమ్మని "స్వీట్"!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ తయారీ కోసం ముందుగా కావాల్సిన పరిమాణంలో తాజా పచ్చికొబ్బరి తురుమును సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద ఒక గిన్నెలో కప్పు నీళ్లు తీసుకుని అందులో ఉప్పు, పంచదార, నెయ్యి వేసుకుని ఒకసారి కలిపి మరిగించుకోవాలి.
- ఆ మిశ్రమం వేడెక్కి వాటర్ మరుగుతున్నప్పుడు అందులో రవ్వని ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా పోసుకుంటూ ఉండకట్టకుండా గరిటెతో తిప్పుకోవాలి.
- రవ్వ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక కొద్దిసేపు మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి.
- రవ్వ మంచిగా ఉడికిందనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను దింపి చల్లారనివ్వాలి.

- అది చల్లారేలోపు మరో గిన్నెలో బెల్లం తురుము తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసి కలిపితే బెల్లం కరిగిపోతుంది.
- అప్పుడు అందులో ముందుగా రెడీ చేసుకున్న తాజా పచ్చికొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి ఒకసారి కలపాలి.
- తర్వాత ఆ గిన్నెను స్టవ్ మీద ఉంచి పదినిమిషాల పాటు ఉడకనివ్వాలి. అలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను దింపి కొబ్బరి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
- ఆలోపు చల్లారిన రవ్వ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. ఆపై వాటిని ఒక్కొక్కటిగా తీసుకుని చేతితోనే వెడల్పుగా పూరీల్లా ఒత్తుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రవ్వ ఉండలన్నింటిని రెడీ చేసుకుని పక్కనుంచాలి.
- తర్వాత చల్లారిన కొబ్బరి మిశ్రమాన్ని కూడా చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి.
తక్కువ నూనెతో కరకరలాడే "సగ్గుబియ్యం వడలు" - ఆలూ ఉడికించకుండానే అప్పటికప్పుడు రెడీ!

- అనంతరం ముందుగా రెడీ చేసుకున్న ఒక్కో చిన్న సైజ్ రవ్వ పూరీని తీసుకుని అందులో ఒక్కో కొబ్బరి ఉండను ఉంచి చుట్టూ చేతితో చక్కగా మూసేయాలి.
- అలా మూసేసిన తర్వాత గుండ్రంగా ఉండకుండా కాస్త చేతితో ఒత్తితే చూడ్డానికి కచోరిల్లా వస్తాయి. ఇలా అన్నింటిని రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద కడాయిలో వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ కాగిన తర్వాత రెడీ చేసుకున్న వాటిని పాన్‌లో వేయించడానికి సరిపడా వేసుకుని మీడియం ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి.

- అవి మంచిగా వేగిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుని ఒక నిమిషం పాటు ఉంచి ఆపై సర్వ్ చేసుకోండి. అంతే, కొబ్బరి స్టఫింగ్తో నోరూరించే టేస్టీ "రవ్వ కాకరాలు" రెడీ అవుతాయి!
- మరి, నచ్చితే అందరూ కలిసే దీపావళి వేళ ఇంటి వాతావరణాన్ని మరింత ఆనంద దాయకం చేసుకోవడానికి ఇంట్లోనే ఈ వెరైటీ మిఠాయిని ట్రై చేసి చేసి చూడండి. ఇంటిల్లిపాదీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
బూందీ గరిటె లేకుండా "మోతీచూర్ లడ్డూలు" - దీపావళికి చేసుకోండి, ఇట్టే నచ్చేస్తాయి!

