దమ్ బిర్యానీ కాదు "దమ్ పులిహోర" ట్రై చేయండి - ఈజీ ప్రాసెస్, రుచి అద్భుతంగా ఉంటుంది!
-ఎటువంటి కష్టం లేకుండా - చాలా ఈజీగా పులిహోర తయారు చేసుకోవచ్చు!

Published : January 9, 2026 at 5:58 PM IST
Dum Pulihora Recipe: కమ్మగా, పుల్లగా నోరూరించే పులిహోరకు ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంటుంది. పూజలు, వ్రతాలు, శుభకార్యాలు ఇలా అకేషన్ ఏదైనా చాలా మంది దీనిని చేస్తుంటారు. ఇక పులిహోరలో కూడా నిమ్మకాయ, చింతపండు, మామిడికాయతో రకరకాలుగా చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ఎప్పుడో ఓసారి తినే ఉంటారు. మరి మీరు ఎప్పుడైనా దమ్ పులిహోర తిన్నారా? లేకుంటే ఓసారి ట్రై చేయండి. దమ్ బిర్యానీ స్టైల్లో చేసుకునే ఈ రెసిపి నార్మల్ పులిహోరతో పోలిస్తే చాలా బాగుంటుంది. పైగా మామూలు దానిని చేసుకుంటున్నట్టు రకరకాల గిన్నెలు అవసరం లేదు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా కమ్మని దమ్ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- బియ్యం - 2 కప్పులు
- చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజ్
- నూనె - 4 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - అర టీస్పూన్
- మెంతులు - పావు టీస్పూన్
- పల్లీలు - పావు కప్పు
- శనగపప్పు - 1 టేబుల్‌స్పూన్
- మినప్పప్పు - 1 టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 4
- పచ్చిమిర్చి - 3
- కరివేపాకు - 3 రెమ్మలు
- పసుపు - 1 టీస్పూన్
- ఇంగువ - పావు టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- బెల్లం - 1 టీస్పూన్
తయారీ విధానం:
- ఓ గిన్నెలోకి బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి.
- మరో గిన్నెలోకి చింతపండు తీసుకుని ఓ కప్పు నీళ్లు పోసి నానబెట్టాలి. చింతపండు నానినాక గుజ్జు తీసి పక్కన పెట్టాలి.
- స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి, అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి.
- కాగిన నూనెలో ఆవాలు, మెంతులు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసి లో ఫ్లేమ్‌లో కలుపుతూ వేయించాలి.
- పల్లీలు సగం మేర వేగినాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి.

- తాలింపు గింజలు పర్ఫెక్ట్గా వేగినాక తీసి పెట్టుకున్న కప్పు చింతపండు గుజ్జు, మరో మూడు కప్పుల నీరు పోసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, బెల్లం తురుము వేసి కలిపి మరిగించుకోవాలి.
- వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకుని కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి.

- బియ్యం ఉడుకుపట్టినాక రైస్‌పై అరటి ఆకు ఉంచి మూత పెట్టాలి. అనంతరం మూతపై ఏదైనా బరువు ఉన్న గిన్నె లేదా వస్తువు పెట్టి సిమ్‌లో పావుగంట సేపు ఉడికించాలి.
- పావు గంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ ఐదు నిమిషాల అయినాక మూత తీసి ఓసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రుచికరమైన దమ్ పులిహోర రెడీ. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.

చిట్కాలు:
- నార్మల్ పులిహోరతో పోలిస్తే ఈ దమ్ పులిహోర కాస్త మెత్తగా ఉంటుంది. కాబట్టి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీరు పోసుకోవాలి. అంటే చింతపండు గుజ్జు ఒక కప్పు, మూడు కప్పుల నీరు కలిపి మొత్తంగా నాలుగు కప్పులు తీసుకోవాలి.
- రైస్ ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో నీళ్లు, చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఇక్కడ చింతపండు గుజ్జు అనేది చిక్కగా ఉండేలా చూసుకోవాలి.
- పల్లీలు, శనగపప్పు వంటి తాలింపు గింజలు చక్కగా వేగితే పులిహోర రుచి బాగుంటుంది.
పక్కా కొలతలతో స్వీట్ షాప్ స్టైల్ "బూందీ లడ్డూలు" - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!

