ETV Bharat / offbeat

ప్రాణం పోయాక 'బ్రేక్' వేస్తే ఏం లాభం! - డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే!

రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించుకోవాలా? - బ్రేక్ వేసే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్న నిపుణులు!

Driving Safety Tips
డ్రైవింగ్ (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 12, 2026 at 6:34 PM IST

4 Min Read
Choose ETV Bharat

Driving Safety Tips : వాహనం కండిషన్ ఎంత బాగున్నా, అది మాత్రమే రోడ్లపై భద్రతకు హామీ ఇవ్వలేదు. డ్రైవింగ్ చేసే వ్యక్తి అప్రమత్తంగా లేకపోతే ప్రమాదం తప్పదు. సాధారణంగా ప్రమాదం ఎదురైనప్పుడు ముందుగా గుర్తొచ్చేది బ్రేక్. అయితే, బ్రేక్ వేయగానే ప్రమాదం తప్పిపోతుందని అనుకోలేం. బ్రేక్ వేయడానికి ముందు జరిగే ప్రక్రియే ముఖ్యం అంటున్నారు రోడ్డు భద్రత నిపుణులు. ప్రధానంగా వాహనం నడిపే వ్యక్తి బ్రేక్ వేసే టైమ్​లో కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలంటున్నారు. అప్పుడే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. మరి, డ్రైవింగ్ టైమ్​లో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ఆ కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.

వాహనం నడిపే వ్యక్తి అప్రమత్తత, జరగబోయే ప్రమాదాన్ని గుర్తించడం, వేగంగా స్పందించడం వంటి అంశాలే కీలకమంటున్నారు నిపుణులు. ఇవే ప్రమాద సమయంలో వాహనం ఆగే దూరాన్ని నిర్ణయిస్తాయని చెబుతున్నారు. మద్యం మత్తులో ఉండటం, అలసట, నిద్రమత్తు, ఫోన్ వినియోగం, ఇతర దృష్టి మళ్లించే అంశాలు డ్రైవింగ్​ను ప్రమాదకరంగా మారుస్తున్నాయని, వీటితో వెహికల్ ముందుకు దూసుకెళ్లడమే కాకుండా ప్రమాద తీవ్రత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

పరిస్థితులు స్పందించే వేగాలు?

డ్రైవింగ్​లో అప్రమత్తంగా ఉంటే చాలా ప్రమాదాలను నివారించొచ్చు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్పందించకపోయినా, బ్రేక్ వేయక పోయినా విలువైన క్షణాలు గడిచిపోయి పెను ప్రమాదం జరుగుతుంది. ఒక వాహనం 60 కి.మీ. వేగంతో వెళ్తున్నప్పుడు వాహనచోదకుల పరిస్థితికి అనుగుణంగా వారు స్పందించే వేగం, బ్రేక్ వేసేందుకు పట్టే సమయం, వాహనం ఎంత దూరం దూసుకెళ్లి ఆగుతుందనేది ఆధారపడి ఉంటుందంటున్నారు రోడ్డు భద్రతా నిపుణులు.

అప్రమత్తంగా ఉంటే :

వాహన చోదకుడు ప్రమాదాన్ని గుర్తించి స్పందించేందుకు సుమారు 0.75 నుంచి 1 సెకను సమయం పడుతుంది. ఈలోగా వాహనం సుమారు 17 మీటర్ల దూరం వెళ్తుంది. బ్రేక్ నొక్కిన తర్వాత రహదారి పరిస్థితి, టైర్ల స్థితి, బ్రేక్​ల పనితీరు ఆధారంగా మరికొంత దూరం(సుమారు 35 నుంచి 45 మీటర్లు) వెళ్లాక వాహనం ఆగుతుంది.

అలసటగా ఉంటే :

జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి, బ్రేక్ వేయడానికి 1.5 నుంచి 2 సెకన్ల టైమ్ పట్టొచ్చు. ఈలోగా వాహనం సుమారు 70 నుంచి 90 మీటర్ల దూరం వెళ్తుంది.

మీ కళ్లెదుటే రోడ్డు ప్రమాదం జరిగిందా? - ఈ 8 అడుగులు వేసి చూడండి!

మద్యం మత్తులో నడిపితే :

ప్రమాదాన్ని గుర్తించి బ్రేక్ వేసేందుకు 2 నుంచి 2.5 సెకన్ల సమయం పడుతుంది. ఈలోగా వాహనం 90 నుంచి 120 మీటర్ల దూరానికి వెళ్తుంది.

ఫోన్​లో మాట్లాడుతుంటే :

ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు ప్రమాదంపై స్పందించడానికి ఏకంగా 2.5 నుంచి 3.5 సెకన్ల సమయం పడుతుంది. ఈలోగా ఆ వాహనం 120 నుంచి 160 మీటర్ల దూరం దూసుకెళ్తుంది.

ఆహారం దృష్టిని మళ్లిస్తుంది :

కొందరు కడుపు నిండా భోజనం చేసి వెంటనే కారు స్టీరింగ్ పట్టేస్తుంటారు. మరికొందరు వెహికల్ నడుపుతూ ఆహారం తీసుకోవడం, కూల్​డ్రింక్ తాగడం చేస్తుంటారు. ఇలా చేయడం వాహనచోదకుడి దృష్టిని రోడ్డుపై నుంచి మళ్లిస్తుందంటున్నారు నిపుణులు. ఇలాంటి పరిస్థితుల్లో స్పందించే సమయం 1.5 నుంచి 2.5 సెకన్లకు పెరగొచ్చు. వాహనం 70-110 మీటర్ల తర్వాత ఆగొచ్చు.

అనారోగ్యం మందుల ప్రభావం :

ఆరోగ్యం సరిగా లేకపోయినా, కొన్ని రకాల మందులు వేసుకున్న తర్వాత డ్రైవింగ్ చేసినా అప్రమత్తత తగ్గుతుంది. ఇలాంటప్పుడు స్పందించే టైమ్ 2, 3 సెకన్లకు పెరుగుతుంది. వాహనం ఆగే దూరం 90 నుంచి 140 మీటర్ల వరకు ఉండొచ్చంటున్నారు.

నిద్ర వస్తే.. ప్రమాదమే!

దూర ప్రయాణాల్లో అలసటను తేలికగా తీసుకోవద్దు. కొన్ని క్షణాల పాటు తెలియకుండానే వచ్చే 'మైక్రో స్లీప్' అత్యంత ప్రమాదకరమంటున్నారు నిపుణులు. ఉదాహరణకు వాహనం గంటకు 80 కి. మీ. వేగంతో వెళ్తున్నప్పుడు డ్రైవర్​కు కేవలం మూడు సెకన్లు 'కునుకు' వస్తే, వెహికల్ సుమారు 67 మీటర్లకు పైగా దూరం ఎలాంటి నియంత్రణ లేకుండా ముందుకెళ్తుంది. ఆ టైమ్​లో ఎదురుగా వెహికల్ వచ్చినా, మూలములుపు ఉన్నా, డివైడర్​కు తగిలినా ఊహించని ప్రమాదం సంభవించే ఛాన్స్ ఉంటుంది. అందుకే అలసటగా ఉన్నప్పుడు 'ఇంకొంచెం దూరమే కదా' అని అనుకోకుండా తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. రోడ్డు పక్కన కాసేపు ఆగిన తర్వాత స్టీరింగ్ పట్టుకోవాలంటున్నారు.

అలసటగా ఉంటే నడపొద్దు :

'రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం జాతీయ రహదారులపైనే జరుగుతుంటాయి. వాహనం నడిపే వ్యక్తి అప్రమత్తంగా ఉన్నప్పటికీ, ఒక్క క్షణం దృష్టి మళ్లినా ప్రాణాంతకం కావొచ్చు. సకాలంలో స్పందించకుంటే ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది. ప్రయాణ సమయంలో నిద్రమత్తు, అలసటగా ఉంటే విశ్రాంతి తీసుకోవడం బెటర్​. వాహనాన్ని రోడ్డు పక్కన కొంతసేపు నిలిపి ఉంచి, ఆ తర్వాతే ప్రయాణం కొనసాగించాలి. 60 కి.మీ. వేగంతో ప్రయాణం సాధారణంగా అనిపించొచ్చు. కానీ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు.'- డాక్టర్ కె.ఇలంబర్తి, తెలంగాణ రవాణా కమిషనర్

స్పీడ్ బ్రేకర్లలో జెల్ టెక్నాలజీ! - వాహనం స్లోగా వెళ్తే కుదుపులుండవు!

"లెర్నింగ్ లైెసెన్స్" ఇంటి దగ్గరే! - ఆన్​లైన్​లో పరీక్ష పాసైతే చాలు!