నోరూరించే "దొండకాయ టమాట పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అద్భుతమే! - టేస్ట్ వేరే లెవల్!
-దొండకాయ, టమాటలతో కిర్రాక్ "పచ్చడి" - రుచి సూపర్ టేస్టీగా ఉంటుంది!

Published : January 10, 2026 at 2:57 PM IST
Dondakaya Tomato Pachadi: బెండకాయతో పోలిస్తే దొండకాయను తినడానికి అంతగా ఇంట్రస్ట్ చూపించరు. ఇక పిల్లలతై వద్దని మారం చేస్తుంటారు. అలాంటి వారు కూడా ఇష్టంగా తినేలా మీ కోసం అద్భుతమైన రెసిపీ తీసుకొచ్చాం. అదే దొండకాయ పచ్చడి. అది కూడా టమాటాలు వేసి చేసుకునే ఈ పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది. అన్నంలోకి, టిఫెన్స్లోకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. తయారు చేసుకోవడం కూడా సులువే. ఫస్ట్ టైమ్ చేసేవాళ్లు కూడా పర్ఫెక్ట్ టేస్ట్‌తో ప్రిపేర్ చేస్తారు. మరి లేట్ చేయకుండా కమ్మని దొండకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- దొండకాయలు - పావు కేజీ
- పచ్చిమిర్చి - 10
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- టమాటాలు - 3
- పసుపు - అర టీస్పూన్
- చింతపండు - కొద్దిగా
- నువ్వులు - 2 టీస్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు - 6
- జీలకర్ర - అర టీస్పూన్
- కొబ్బరి ముక్కలు - 4 టేబుల్‌స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం:
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- మినప్పప్పు - 1 టీస్పూన్
- ఆవాలు - అర టీస్పూన్
- జీలకర్ర - అర టీస్పూన్
- ఎండుమిర్చి - 3
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ - చిటికెడు
తయారీ విధానం:
- దొండకాయలను జిగురు లేకుండా శుభ్రంగా కడిగి పొడుగ్గా, సన్నగా కట్ చేసుకోవాలి.
- అదే విధంగా పచ్చిమిర్చిపై తొడిమలు తీసేసి తుంపలుగా చేసుకోవాలి. టమాటాలను కూడా మీడియం సైజ్‌లో ముక్కలుగా చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో పచ్చిమిర్చి తుంపలు వేసి లో ఫ్లేమ్‌లో వేయించాలి.

- పచ్చిమిర్చి తుంపలు లైట్‌గా వేగాక కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసి కలుపుతూ ఫ్రై చేయాలి.
- దొండకాయ ముక్కలు సగం మేర వేగినాక కట్ చేసిన టమాటా ముక్కలు, పసుపు, చింతపండు వేసి ఓసారి కలిపి మెత్తగా ఉడికించాలి.
- టమాటా, దొండకాయ ముక్కలు మెత్తగా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

- ఈ మిశ్రమం చల్లారినాక నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు లేకుండా మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి.

- తాలింపు గింజలు వేగినాక ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి క్రిస్పీగా వేయించి గ్రైండ్ చేసిన పచ్చడిని యాడ్ చేసుకోవాలి.
- పచ్చడి మొత్తం తాలింపులో కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ టమాటా పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- దొండకాయలను పొడుగ్గా మాత్రమే కాకుండా మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది.
- పచ్చిమిర్చిని మీరు తినే కారానికి సరిపడా వేసుకోవాలి. కానీ పచ్చడి కాస్త ఘాటుగా ఉంటేనే రుచి బాగుంటుంది.
- నువ్వులను నేరుగా కాకుండా కాస్త దోరగా వేయించుకుని వేసుకుంటే పచ్చడి రుచి మరింత బాగుంటుంది.
- కొబ్బరి ముక్కలు లేకపోతే దాని ప్లేస్‌లో వేయించిన పల్లీలు యాడ్ చేసుకోవచ్చు.
అరటిపండ్లతో "గుంత పొంగనాలు" - పది నిమిషాల్లో రెడీ - బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్‌గా రెడీ!
తెలంగాణ స్పెషల్ "సకినాలు" - పిండి ఇలా కలిపి చేస్తే కరకరలాడుతూ అద్దిరిపోతాయి!

