"టైర్లు" ఎరుపు, తెలుపు రంగుల్లో ఎందుకుండవు? - కేవలం "నలుపు" రంగులోనే ఉండడానికి సీక్రెట్ ఇదే!
వాహనం టైర్లు బ్లాక్ కలర్లో ఉండడానికి కారణమిదే అంటున్న నిపుణులు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 4, 2026 at 11:50 AM IST
Why Tyres Have Black Colour : మనం కార్లు, బైకులు, బస్సులు, ఇతర వాహనాలను గమనించినట్లయితే అవి వివిధ రంగుల్లో కనిపిస్తుంటాయి. రకరకాల కంపెనీల్లో ఇవి తయారవుతుంటాయి. అయితే, వెహికల్ కలర్, కంపెనీ ఏదైనప్పటికీ వాటికి ఉండే టైర్లు మాత్రం బ్లాక్ కలర్లోనే కనిపిస్తుంటాయి. అది ఎంత ఖరీదైన వాహనం అయినప్పటికీ దానికి ఉండే టైర్లు మాత్రం నల్ల రంగులోనే ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రెడ్, గ్రీన్ లేదా వైట్ వంటి ఇతర కలర్స్‌లో ఎందుకు ఉండవు? టైర్లు కేవలం బ్లాక్ కలర్లోనే ఎందుకు ఉంటాయి? అనే సందేహాలు మనలో చాలా మందికి ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటాయి. మరి, వాహనం టైర్లు నలుపు రంగులోనే ఉండడం వెనుక దాగి ఉన్న ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచం రంగులమయం. మనం ఉపయోగించే అనేక వస్తువులు వివిధ రంగుల్లో లభిస్తాయి. కానీ, వాహనాల టైర్ల విషయంలో మాత్రం నలుపు తప్ప మరోదాన్ని ఊహించుకోలేం. అలా ఉండడం కేవలం డిజైన్ కోసమో లేక యాదృచ్ఛికమో కాదు. దీని వెనుక ఒక ముఖ్యమైన సైంటిఫిక్ రీజన్ దాగి ఉందంటున్నారు నిపుణులు.
టైర్ల నలుపు రంగుకు అసలు కారణమిదే!
నార్మల్‌గా టైర్లు రబ్బరుతో తయారవుతాయి. అయితే, స్వచ్ఛమైన సహజ రబ్బరు లేత గోధుమ లేదా పాల రంగులో ఉంటుంది. దీన్ని అలాగే నేరుగా రోడ్డుపై వాడితే త్వరగా అరిగిపోవడం, వేడికి కరిగిపోవడం లేదా సులువుగా పాడైపోవడం జరుగుతుంది. అందుకే, ఈ సమస్యను అధిగమించడానికి రబ్బర్ మిశ్రమంలో కార్బన్ బ్లాక్‌ను కలుపుతారు. అలా కలిపే కార్బన్ బ్లాక్ అనేది టైర్లకు నలుపు రంగును ఇస్తుందని చెబుతున్నారు నిపుణులు.
మీరు "స్పీడ్" లవరా? - మీటర్ కాదు! వాహనం టైర్‌పై ఈ అక్షరాన్ని చెక్ చేయండి!
"కార్బన్ బ్లాక్"నే ఎందుకు కలుపుతారంటే?
టైర్లకు బ్లాక్ కలర్‌ను ఇచ్చే ఈ కార్బన్ బ్లాక్‌ను ఒక శక్తిమంతమైన ఫిల్లింగ్ మెటీరియల్‌గా చెప్పుకోవచ్చు. ఇది రబ్బరుతో కలిసి బలమైన బంధాన్ని ఏర్పరచడంలో కీలకంగా పని చేస్తుంది. ఫలితంగా టైర్ మన్నిక పెరిగి ఎక్కువ రోజులు అరిగిపోకుండా ఉండడానికి దోహదపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
మనం వెహికల్ నడుపుతున్నప్పుడు టైర్లు రోడ్డుతో రాపిడి(Friction) చెందడం వల్ల వేడెక్కుతుంటాయి. అప్పుడు టైర్లలో ఉండే కార్బన్ బ్లాక్ ఆ వేడిని సమర్థంగా గ్రహించి హీట్ అవ్వకుండా కాపాడుతుంది. అంటే, రాపిడి వల్ల వచ్చే వేడిని కార్బన్ బ్లాక్ టైర్ ఉపరితలం అంతటా పంపిణీ చేస్తుంది. దీని వల్ల ఒకే చోట వేడి పోగుపడి ఉండదు. దాంతో టైర్ పేలకుండా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కార్బన్ బ్లాక్ అనేది టైర్ లైఫ్‌టైమ్, బలాన్ని పెంచడంలో క్రీయాశీలకంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అందుకే, భారీ వాహనాలు, రేసింగ్ కార్లలో ఉపయోగించే టైర్లలో ఈ కార్బన్ కాంపౌండ్ కాస్త ఎక్కువగానే ఉండేలా తయారు చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు.
పగుళ్లు రాకుండా కాపాడడంలో
టైర్లలో ఉండే కార్బన్ బ్లాక్ చేసే మరో ముఖ్యమైన పని ఉంది. అదేంటంటే, సూర్యుని నుంచి రక్షణ ఇవ్వడంలోనూ ఇది పని చేస్తుంది. ఎందుకంటే, కార్బన్ బ్లాక్ కలపని రబ్బర్‌ను ఎండలోని అతినీలలోహిత (UV) కిరణాలు దెబ్బతీసి పగుళ్లు వచ్చేలా చేస్తాయి. అదే, కార్బన్ బ్లాక్ కలిపినట్లయితే అది రబ్బర్ మెటీరియల్‌ను యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. అంటే, కార్బన్ బ్లాక్ అనేది ఒక అద్భుతమైన యూవీ స్టెబిలైజర్‌గా పనిచేసి టైర్లకు పగుళ్లు రాకుండా కాపాడుతుందని చెబుతున్నారు నిపుణులు.
టైర్లలో పరిమితికి పెంచి గాలి నింపుతున్నారా - అయితే జాగ్రత్త!
మీ కారు కోసం కొత్త టైర్లు కొంటున్నారా? ఈ టిప్స్ పక్కాగా పాటించండి!

