ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద "MNL, VAC, ATC" అక్షరాలు గమనించారా? - వాటి అర్థమేంటో తెలుసా?
ట్రాఫిక్ లైట్స్ గురించి మాత్రమే కాదు - వాటిపై కనిపించే ఈ పదాల అర్థాలు తెలుసుకోవాల్సిందే!

Published : February 24, 2026 at 5:22 PM IST
Traffic Signals Codes Meaning : పట్టణాలు, నగరాల్లో రోజురోజుకు జనాభాతో పాటు వాహనాల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో నిత్యం రహదారులపై ప్రయాణించే వాహనాలు లక్షల్లో ఉంటుంటాయి. ఈ క్రమంలోనే ప్రయాణం సాఫీగా సాగేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లు, ఎక్కువ ట్రాఫిక్‌కు అవకాశం ఉండే రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేస్తుంటారు. ఈ సిగ్నళ్లు కేవలం ట్రాఫిక్ నియంత్రణకు మాత్రమే కాకుండా రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి చాలా బాగా దోహదపడతాయి. ఇకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాల నియంత్రణ కోసం రెడ్, గ్రీన్, యెల్లో కలర్ లైట్లు వెలగడాన్ని మనం చూస్తుంటాం.
ట్రాఫిక్ రూల్స్ ప్రకారం రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, యెల్లో సిగ్నల్ పడితే సిద్ధంగా ఉండాలి, గ్రీన్ సిగ్నల్ పడితే వాహానాలు ముందుకెళ్లాలి. ట్రాఫిక్ లైట్లకు సంబంధించిన ఈ రూల్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద లైట్స్ కాకుండా వాటి పైభాగంలో చిన్న డిస్ప్లేలో "VAC, MNL, ATC" అనే అక్షరాలు కనిపిస్తుంటాయి. అందరూ వీటిని ఎప్పుడో ఒకప్పుడు గమనించే ఉంటారు. అయితే, చాలా మందికి ఈ అక్షరాల గురించి అవగాహన ఉండదు. కానీ, మీకు తెలుసా? ఈ అక్షరాలను బట్టి సిగ్నల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చంటున్నారు ట్రాఫిక్ అధికారులు. ఇంతకీ, ఈ ట్రాఫిక్ టెక్నికల్ షార్ట్ కోడ్స్‌కు అర్థాలేంటి? ట్రాఫిక్ నియంత్రణకు ఇవి ఎలా దోహదపడతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
MNL :
ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కనిపించే MNL కోడ్‌ను "మ్యాన్యువల్" అనే అర్థంలో ఉపయోగిస్తారు. పేరులో సూచించినట్లుగానే MNL ఉండే సిగ్నళ్లను ట్రాఫిక్ పోలీసులు నేరుగా ఆపరేట్ చేస్తారు. అంటే, ఆ మార్గంలో రద్దీని బట్టి ట్రాఫిక్ పోలీసులు ఆ సిగ్నల్ లైట్ల సమయాన్ని మార్చడం చేస్తుంటారు. అసాధారణ పరిస్థితుల్లో తక్షణమే ట్రాఫిక్ క్లియర్ చేయడానికి, నిర్దిష్ట మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ సిగ్నల్స్ చాలా బాగా తోడ్పడుతుంటాయి. ఉదాహరణకు పండగల టైమ్‌లో ఏర్పడే భారీ ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలు జరిగినప్పుడు, వీఐపీల రాకపోకలు లేదా నిరసన ప్రదర్శలు వంటి సందర్భాల్లో మ్యాన్యువల్ మోడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అత్యంత కీలకంగా ఉంటుంటాయి. అయితే, ఈ సిగ్నల్స్ ఆపరేటింగ్కి నిరంతర మానవ పర్యవేక్షణ ఉండాలి.
VAC :
వీఏసీ అనగా "వెహికల్ ఆక్చువేటెడ్ కంట్రోల్". VAC అనే ఆంగ్ల అక్షరాలు కనిపించే సిగ్నల్ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుందని అర్థం. ఈ అధునాతన ట్రాఫిక్ నియంత్రణ సిగ్నల్ అనేది జంక్షన్ దగ్గర ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయో సాంకేతికత ద్వారా గుర్తించి అందుకు అనుగుణంగా రెడ్, గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటుంది. ఉదాహరణకు ఒక జంక్షన్ వద్ద ఒక సైడ్ ఎక్కువ వాహనాలు, మరో సైడ్ తక్కువ వాహనాలు ప్రయాణిస్తున్నాయనుకుందాం. అప్పుడు ఆ సిగ్నల్ వద్ద VAC సిస్టమ్ ఉన్నట్లయితే రాకపోకలకు అనుగుణంగా గ్రీన్ సిగ్నల్ ఎక్కువ సమయం, రెడ్ సిగ్నల్ కొద్దిసేపు మాత్రమే ఆన్‌లో ఉంటుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.
బస్సులో లగేజీ మర్చిపోయారా? - ఈ "నంబర్"కు ఫోన్ చేస్తే తిరిగి పొందవచ్చు!
ATC :
ఏటీసీ అనగా "అడాఫ్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్" అని అర్థం. ఇది VAC కంటే అధునాతన వ్యవస్థ. ATC ట్రాఫిక్ సిస్టమ్ కలిగిన సిగ్నల్స్ కేవలం ఒక సిగ్నల్ వద్ద ట్రాఫిక్ రద్దీని గుర్తించడమే కాకుండా, సెన్సార్ల ద్వారా నిర్ణీత ప్రాంతంలోని వేరే సిగ్నల్స్‌తో కూడా అనుసంధానమైన ఉంటాయి. అంటే, ఒక నిర్దేశిత మార్గంలో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య, ఏ వైపు ఎక్కువ వస్తున్నాయో ఐడెంటిఫై చేసి, దానికి అనుగుణంగా సమీపంలో ఉన్న ఇతర సిగ్నల్స్‌ను కంట్రోల్ చేస్తూ రెడ్, గ్రీన్ సిగ్నళ్లను ఇస్తుంది.
హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ATC ట్రాఫిక్ సిస్టమ్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఇవి ట్రాఫిక్ జామ్‌లను సమర్థవంతంగా తగ్గించి ఆయా మార్గాల్లో వాహనాల కదలికను సులభతరం చేస్తుంది. ముఖ్యంగా ప్రయాణ సమయాన్ని తగ్గించి రహదారుల సామర్థ్యాన్ని పెంచడంలో ATC ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ చాలా బాగా దోహదపడుతాయని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు.
బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం! - పెట్రోల్ కొట్టించకపోయినా వీటిని వాడుకోవచ్చు!
రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రిలో చేర్చితే రూ.25 వేల బహుమతి - ఈ ప్రభుత్వ స్కీమ్ తెలుసా?

