దీపావళి "బూరెలు" ఇలా చేయండి - చక్కగా పొంగుతాయి, సూపర్ టేస్ట్!
- రవ్వ, బెల్లంతో నోరూరించే 'బూరెలు' - పాకంతో పని లేకుండా అప్పటికప్పుడు రెడీ!

Published : October 17, 2025 at 10:36 AM IST
Diwali Boorelu Recipe : దీపావళి అంటేనే టపాసులతో పాటు మిఠాయిల పండగ. అలాగే, సకల సంపదలు కలిగించాలని వేడుకుంటూ లక్ష్మీదేవి పూజలు, కేదారేశ్వర, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది ఇంట్లోనే వివిధ రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేస్తుంటారు. అందులో భాగంగా ఎక్కువ మంది "బూరెలు" తయారు చేస్తుంటారు.
కానీ, కొంతమందికి ఎంత బాగా చేసినా గట్టిగా రావడమో, తీపి సరిపోకపోవడమో జరుగుతుంటుంది. అలాంటి వారికోసం దివాళీ వేళ చాలా సింపుల్‌గా చేసుకునే ఒక రెసిపీని తీసుకొచ్చాం. రవ్వ, బెల్లంతో ఈ పద్ధతిలో చేశారంటే బూరెలు చక్కగా పొంగుతూ సూపర్ సాఫ్ట్‌గా, భలే రుచిరకంగా వస్తాయి. వీటిని ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు. పండగల టైమ్‌లోనే కాకుండా ఈ బూరెలను ఈవెనింగ్ స్నాక్‌గా కూడా రెడీ చేసుకుని హ్యాపీగా తినేయొచ్చు. పాకంతో పని లేకుండా ఎవరైనా ఇవి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- బొంబాయి రవ్వ - రెండు కప్పులు
- కాచి చల్లార్చిన పాలు - ఒకటిన్నర కప్పులు
- బెల్లం తురుము - రెండు కప్పులు
- గోధుమపిండి - ఒక కప్పు
- యాలకుల పొడి - రెండు టీస్పూన్లు
- వంటసోడా - అరటీస్పూన్
- నూనె - వేయించడానికి సరిపడా
స్వీట్ షాప్‌కి వెళ్లకుండా - ఇంట్లోనే ఈజీగా చేసుకునే "స్వీట్"! - దీపావళికి పర్ఫెక్ట్!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ బూరెల తయారీ కోసం ముందుగా ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లో ఉప్మా రవ్వ తీసుకుని అందులో కాచి చల్లార్చుకున్న పాలను పోసి అవి రెండు చక్కగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- ఇలా కలిపే క్రమంలో ఒకవేళ పాలు సరిపోలేదనిపిస్తే మరికొద్దిగా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు.
- రవ్వ, పాలు మంచిగా కలిసేలా మిక్స్ చేసుకున్నాక బౌల్‌పై మూత ఉంచి పది నిమిషాల పాటు పక్కనుంచాలి. ఇలా ఉంచడం ద్వారా పాలలో రవ్వ అనేది కాస్త నాని కొద్దిగా గట్టిపడుతుంది.

- ఆ లోపు స్టవ్ మీద మరో పాన్ పెట్టుకుని అందులో బెల్లం తురుము, రెండు కప్పుల నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్‌లో గరిటెతో కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి.
- బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం సిరప్‌ను కాస్త చల్లారనివ్వాలి. అంతేకానీ, పాకం వచ్చే వరకు మరిగించుకోవాల్సిన అవసరం లేదు.
- అనంతరం మిక్సీ జార్ తీసుకుని అందులో పది నిమిషాల పాటు పక్కనుంచిన రవ్వ మిశ్రమం, గోధుమపిండి, యాలకుల పొడి వేసుకోవాలి.
- ఆపై అందులో చల్లారిన బెల్లం వాటర్‌ను వడకట్టి పోసుకుని అన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
దీపావళికి పాలకూర "మురుకులు" - నూనె పీల్చకుండానే Extra Crispy!

- పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ ఎక్కువ పలుచగా, చిక్కగా లేకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా కాచి చల్లార్చిన పాలు పోసుకుని కలుపుకోవాలి.
- ఆ విధంగా పిండి మిశ్రమాన్ని సిద్ధం చేసుకున్నాక దాన్ని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై అందులో వంటసోడా వేసుకుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటే పిండి రెడీ అవుతుంది.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో తగినంత నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలిపి పెట్టుకున్న పిండిని గుంత గరిటెతో ఒక్క గరిటెడు తీసుకుని ఒకే దగ్గర బూరెలా పోసుకోవాలి.
- అప్పుడు అది పొంగి పైకి వచ్చాక మరో గరిటె పిండిని పోసి బూరెలా వేసుకోవాలి.

- అలా పాన్‌లో వేయించడానికి తగినన్ని వేసుకున్నాక వెంటనే టర్న్ చేయకుండా కాసేపు కాలనివ్వాలి.
- వన్ సైడ్ కొద్దిగా కలర్ వచ్చాక చిల్లుల గరిటెతో మరో వైపునకు తిప్పేసుకుని వేయించుకోవాలి.
- రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ప్లేట్లోకి తీసుకుంటే చాలు. అంతే, సూపర్ సాఫ్ట్‌గా నోరూరించే "రవ్వ బూరెలు" అప్పటికప్పుడు రెడీ అవుతాయి!
- అవి చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి!
- ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, రవ్వ తీసుకున్న కప్పునే పాలు, బెల్లం, వాటర్, ఇతర ఇంగ్రీడియంట్స్ తీసుకోవడానికి వాడుకోవాలి. అప్పుడే బూరెలు పర్ఫెక్ట్ కొలతలతో సాఫ్ట్‌గా, మంచి టేస్టీగా వస్తాయి.
తక్కువ నూనెతో కరకరలాడే "సగ్గుబియ్యం వడలు" - ఆలూ ఉడికించకుండానే అప్పటికప్పుడు రెడీ!

