దాబా స్టైల్ "పాలక్, చనా మసాలా కర్రీ" - చపాతీ, బగారారైస్ లోకి మంచి కాంబినేషన్!
పాలక్ చనా మసాలా కర్రీ ఇలా ట్రై చేయండి - మళ్లీ మళ్లీ కావాలంటారు!
palak_chana_masala (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 4, 2026 at 12:41 PM IST
Palak Chana Masala : శనగలు, పాలకూర మసాలా కర్రీ చపాతీ, బగారా రైస్‌లోకి చాలా బాగుంటుంది. ఇలాంటి కర్రీ ఎక్కువగా దాబాలు, హోటళ్లలో చపాతీ, రోటీ, పుల్కాల్లోకి ఇస్తుంటారు. ఎంతో ప్రొటీన్ ఉంటే మంచి శనగలు, విటమిన్లు కలిగిన పాలకూర కలిపి కర్రీ తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్దీగా ఉంటుంది.
"ఉడిపి స్టైల్ ఆలూ బిర్యానీ" - ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు!

కావల్సిన పదార్థాలు :
- శనగలు - పావు కేజీ
- ఎండు మిర్చి - 3
- బిర్యానీ ఆకులు - 2
- దాల్చిన చెక్క - 1 ఇంచు
- నల్ల యాలకులు - 2
- ఉప్పు - రుచికి సరిపడా
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- పాలకూర - 2 కట్టలు
- పసుపు - పావు స్పూన్
- కొత్తిమీర - చిన్న కట్ట
- పచ్చి మిర్చి - 6

- పెరుగు - 200 గ్రాములు
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - అర టీ స్పూన్
- యాలకులు - 3
- మిరియాలు - 1 స్పూన్
- బండ పువ్వు - కొద్దిగా
- లవంగాలు - 3
- జాపత్రి - 1
- ఉల్లిపాయలు - మీడియం సైజు 3

- అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు
- ధనియాల పొడి -1 టీస్పూన్
- కారం - 2 స్పూన్లు
- గరం మసాలా - అర స్పూన్
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
- ఇంగువ - అర స్పూన్
- వెల్లుల్లి - 6
- కసూరి మేతి - కొద్దిగా

తయారీ విధానం :
- ముందుగా శనగలు రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే కుక్కర్లో వేసుకుని దాల్చిన చెక్క, ఎండు మిర్చి, బగారా ఆకులు, పెద్ద యాలకులు వేసుకుని సరిపడా నీళ్లు పోసి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ ఇవ్వాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి ప్రెజర్ పోయాక నీళ్లు అందులోనే ఉంచి మూత తీసుకుని శనగలు మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అందులో వేసిన పదార్థాలను పక్కన పెట్టుకోవాలి.

- ఇపుడు మరో స్టవ్‌పై నీళ్లలో పసుపు వేసి మరిగించాలి. మరుగుతున్న టైంలో పాలకూర కాడలను ఉడికించుకోవాలి. ఆ తర్వాత చల్లని నీళ్లలో డిప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలకూర రంగు మారకుండా ఉంటుంది. ఉడికించిన పాలకూరను మిక్సీలో వేసుకుని కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు వేసుకుని పేస్ట్ చేసుకోవాలి.
- ఇపుడు కర్రీ కోసం కడాయిలో నూనె వేసుకోవాలి. జీలకర్ర, యాలకులు, లవంగాలు, మిరియాలు, జాపత్రి వేసుకుని ఉల్లిపాయ తరుగు వేసుకుని వేయించాలి.

- ఉల్లిపాయ తరుగు రంగు మారిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వాసనపోయాక ఉడికించిన శనగలు వేసుకుని వేయించాలి. ఆ తర్వాత పాలకూర పేస్ట్ వేసి బాగా కలిపి ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఐదారు నిమిషాల తర్వాత నూనె వేరయ్యాక శనగలు ఉడికించిన నీళ్లు పోసుకుని కలపాలి.
- ఇపుడు తాలింపు కడాయిలో నెయ్యి, ఇంగువ, వెల్లుల్లి, ఎండు మిర్చి, కరివేపాకు, కసూరిమేతి, కారం వేసి కలిపి వేగిన తర్వాత కర్రీలో కలపాలి. ఆ తర్వాత 10 నిమిషాలు సన్నటి మంటపై స్టవ్ పైనే ఉంచి ఆ తర్వాత దించేస్తే చాలు! అద్భుతంగా ఉంటుంది.
సండే స్పెషల్ "కాజు రైస్, ప్రాన్స్ కోకోనట్ పులావ్" - టమోటా కెచప్‌తో ఇలా ట్రై చేయండి!
మదురై మీనాక్షి టెంపుల్ స్పెషల్ "లడ్డూలు' - తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!

