ETV Bharat / offbeat

పెద్దపులి, చిరుతలను వేటాడితేనే కాదు - అడవుల్లో ఈ 'పనులు' చేసినా జైలు శిక్ష, జరిమానాలు!

ప్రకృతి అందాల వీక్షణకు అటవీ ప్రాంతాలకు వెళ్తున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు!

Forest Laws and Restrictions
Forest Laws and Restrictions (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 14, 2026 at 11:03 AM IST

3 Min Read
Choose ETV Bharat

Forest Laws and Restrictions : అడవి అంటే కేవలం వృక్షాలే కాదు. అది జీవవైవిధ్యానికి నిలయం. వన్యప్రాణులకు సురక్షిత ఆవాసం. సెలవులు వచ్చాయంటే చాలు, చాలా మంది ప్రకృతి అందాలు వీక్షించేందుకు అడవుల వైపు పయనమవుతుంటారు. జలపాతాల వద్ద సందడి చేస్తూ, పక్షుల కిలకిలరావాలు వింటూ మనసారా ఆనందాన్ని పొందుతారు. మనసుకు ఆహ్లాదాన్ని పంచే అటవీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ అమలులో ఉండే నిబంధనలూ తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావొచ్చంటున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక అటవీ ప్రాంతాల హోదాలు, అక్కడ అమల్లో ఉండే చట్టాలు, ఆంక్షలు, ఒకవేళ వాటిని అతిక్రమిస్తే విధించే శిక్షలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అడవి ప్రాధాన్యం, వన్యప్రాణుల ఉనికి, జీవవైవిధ్యం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా వాటికి కొన్ని ప్రత్యేక హోదాలు, నియమాలు ఆంక్షలు ఉంటాయి. వాటిని ఉల్లంఘించేలా చిన్న పొరపాటు చేసినా అటవీ చట్టాల ప్రకారం నేరంగా పరిగణించే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే, అటవీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిదంటున్నారు.

ప్రత్యేక అటవీ ప్రాంతాల హోదాలు :

రిజర్వ్ ఫారెస్ట్ : సాధారణ అటవీ హోదా. ఇక్కడ చెట్ల నరికివేత, వేట, ఆక్రమణ, మైనింగ్, భూ వినియోగ మార్పులకు కఠిన నియంత్రణ ఉంటుంది.

ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ : ఇవి ప్రభుత్వ నియంత్రణలో ఉండే అడవులు. స్థానిక ప్రజలకు కొన్ని సంప్రదాయ హక్కులు ఉండొచ్చు. చెట్ల నరికివేత, వేట, అటవీ ఉత్పత్తుల సేకరణపై ఈ అడవుల్లో నియంత్రణ ఉంటుంది.

జాతీయ ఉద్యానవనం : ఇవి దేశంలో అత్యంత రక్షిత అడవులు. మానవ జోక్యం తక్కువ ఉండేలా చట్టాలు ఉంటాయి. పశువుల మేత, చెట్ల నరికివేత, వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ ఈ అడవుల్లో నిషేధం.

ఎకో సెన్సిటివ్ జోన్ : అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాల చుట్టూ ప్రకటించే బఫర్ ప్రాంతం. కాలుష్య పరిశ్రమలు, భారీ నిర్మాణాలు, మైనింగ్ కార్యకలాపాలపై కఠిన నియంత్రణ ఉంటుంది.

అభయారణ్యం : వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ప్రకటించే ప్రాంతం. ఇక్కడ జంతువులకు హాని తలపెట్టడం నిషేధం. నిర్ణీత మార్గాల్లోనే సంచరించాలి. రాత్రి బస, డ్రోన్ వినియోగం, పెద్ద శబ్దాలపై ఆంక్షలుంటాయని గుర్తుంచుకోవాలి.

టైగర్ రిజర్వ్ : పెద్దపులుల సంరక్షణకు ఏర్పాటుచేసిన ప్రత్యేక ప్రాంతం. సాధారణంగా కోర్ జోన్​లోకి ప్రజలను అనుమతించరు. అటవీ అధికారులు అనుమతితో వెళ్లాలి. బఫర్ జోన్​లో తక్కువ పర్యాటకం, గ్రామాల జీవనోపాధికి పరిమిత సడలింపులు ఉంటాయి.

బయోస్పియర్ రిజర్వ్ : జీవవైవిధ్యం, స్థానిక జీవన విధాన సమతుల్యతను కాపాడేందుకు ఏర్పాటుచేసే విస్తృత ప్రాంతం. పర్యావరణ విద్య, పరిశోధన, స్థిరమైన అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు.

కన్జర్వేషన్ రిజర్వ్ : స్థానిక ప్రజల భాగస్వామ్యంతో జీవవైవిధ్యాన్ని కాపాడే ప్రాంతాలు.

'గొంతు విప్పకుండానే కిలోమీటర్ల దూరం ముచ్చటిస్తాయి' - వీటికి మేధాశక్తి ఎక్కువే!

అడవులు, ప్రత్యేక ఆకర్షణలు :

కవ్వాల్ టైగర్ రిజర్వ్ : ఇది మధ్య భారత పులుల కారిడార్​లో కీలక ప్రాంతం.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ : ఈ ప్రాంతం పెద్దపులులు, చిరుతలు, చెంచు గిరిజన సంస్కృతికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

శ్రీ వేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం : శేషాచలం కొండలు, ఎర్రచందనం చెట్లు.

కోరింగ వన్యప్రాణి అభయారణ్యం : దేశంలోనే రెండో అతిపెద్ద(సుందర్బన్ తర్వాత) మడ అడవుల ప్రాంతం. ఇది ఉప్పునీటి మొసళ్లు కనిపించే అరుదైన ప్రాంతం.

ఏపీలో : శ్రీశైలం - నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్, పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రం, గుండ్ల బ్రహ్మేశ్వర, లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యాలు.

తెలంగాణలో : ఏటూరునాగారం, కిన్నెరసాని, పోచారం, ప్రాణహిత, శివ్వారం, మంజీరా అభయారణ్యాలు, కాసు బ్రహ్మానందరెడ్డి, మహవీర్ హరిణ వనస్థలి, మృగవని జాతీయ ఉద్యానవనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు.

శిక్షలు ఎలా ఉంటాయంటే?

  • అటవీ సంరక్షణ చట్టాల ప్రకారం, పెద్దపులి, చిరుత, ఏనుగు వంటి అత్యంత రక్షిత జంతువుల్ని వేటాడితే కఠిన జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
  • అక్రమంగా కలప రవాణా చేస్తే వాహనం స్వాధీనం, జరిమానా, జైలు శిక్ష ఉంటుంది.
  • అడవిలో మంటలు పెట్టినా, వంట చేసుకుని నిప్పు ఆర్పకపోయినా క్రిమినల్ కేసు నమోదు చేస్తారు.
  • అలాగే, ప్లాస్టిక్ పదార్థాలు, చెత్త వేసినా జరిమానా వేస్తారు.
  • అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే పరికరం స్వాధీనం, చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
  • అనుమతి ఉన్నచోట తప్ప వాహనం నుంచి కిందికి దిగొద్దు. రోడ్డుపై వాహనం ఎక్కువసేపు ఆపొద్దు. జంతువుల దారిని అడ్డుకోవద్దని నిబంధనలు తెలియజేస్తున్నాయి.

'ఎవరెస్ట్​'కి మించిన పర్వతాలు - ఎక్కడున్నాయి? ఎలా గుర్తించారంటే!

మొక్కలు పెంచేందుకు స్థలం లేదా? - ఈ "గ్రీనరీ ఐడియాస్"తో మనసుకు పచ్చని పసందు!