అక్కడ ధర్నా చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే! - రోజుకు రూ.1.21 లక్షలు!
ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ఇంత ఖరీదైందా? - దిల్లీలో ధర్నాలపై కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 13, 2026 at 4:28 PM IST
Delhi New Protest Sites History : ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అయితే, దేశ రాజధానిలో నిన్న మొన్నటి వరకు ఎన్నో ఉద్యమాలు, ధర్నాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన జంతర్‌మంతర్‌కు ఎండ్ కార్డు పడింది. దిల్లీ పోలీసులు తీసుకున్న నిర్ణయంతో ఇకపై దేశ రాజధానిలో ధర్నా చేయడం సామాన్యులకు భారంగా మారబోతోంది. జంతర్‌మంతర్‌ను రద్దు చేసిన దిల్లీ పోలీసులు కొత్తగా 3 ప్రదేశాలను ధర్నా చౌక్‌లుగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. కొత్త రూల్స్ ప్రకారం అక్కడ నిరసన తెలపాలంటే పర్మిషన్ మాత్రమే కాదు, లక్షల్లో ఫీజులు చెల్లిస్తేనే నిరసన వేదికలు దొరికే పరిస్థితి వచ్చింది. ఇంతకీ, దిల్లీ పోలీసులు తెచ్చిన ఆ మూడు కొత్త నిరసన గ్రౌండ్ల అసలు కథేంటి? ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఇంత ఖరీదైన వ్యవహారంగా ఎందుకు మారిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దేశ రాజధానిలో ఏదైనా సమస్యపై నిరసన తెలపాలంటే, దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఇప్పటి వరకు రూపాయి ఖర్చు లేకుండా ధర్నా చేసేవాళ్లు. కానీ, అక్టోబరు 12న దిల్లీ పోలీసులు దశాబ్దాలుగా ఉద్యమాలు, ధర్నాలకు వేదికగా నిలిచిన ఈ జంతర్ మంతర్‌ను నిరసనలు చేసే స్థలాల జాబితా నుంచి తొలగిస్తూ(డీ-నోటిఫై) ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా నిరసనకారుల కోసం దిల్లీలోని మరో 3 కొత్త ప్రదేశాలను అధికారిక ధర్నా చౌక్‌లుగా ఖరారు చేశారు.
జంతర్‌మంతర్‌కు బదులుగా హోంశాఖ కమిటీ తెచ్చిన మొదటి వేదిక రామ్‌లీలా మైదాన్. ఇక్కడ నిరసన చేయాలంటే, రోజుకు 50 వేల రూపాయల రెంట్, 55 వేల రూపాయల డిపాజిట్ కట్టాలి. ట్యాక్సులతో కలిపి మొత్తం లక్షా 21 వేల రూపాయలు చెల్లించాలి. పోనీ అదే గ్రౌండ్ ఫ్రీగా ఇచ్చే స్పేస్‌కు వెళ్దామంటే, అక్కడ కేవలం 150 మంది మాత్రమే పడతారు. దసరా, దీపావళి వల్ల డిసెంబర్ 29 వరకు అసలు గ్రౌండే ఖాళీ లేదు. కేవలం మూడు స్లాట్లే ఉన్నాయట.
మరి మిగిలిన రెండు గ్రౌండ్ల పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం. రెండో వేదిక వచ్చేసి ఉత్తర దిల్లీలోని బురారీ గ్రౌండ్. ఇది 50 ఎకరాల అతిపెద్ద మైదానం. కానీ ఈ వేదిక పార్లమెంటు, సెంట్రల్ సెక్రటేరియట్‌కు మైళ్ల దూరంలో ఉంటుంది. ఇక మూడోది వచ్చేసి తూర్పు దిల్లీ షహదరాలోని 'CBD గ్రౌండ్'. 12 ఎకరాల్లో ఉండే దీని చుట్టూ మాల్స్, ఫైవ్‌స్టార్ హోటళ్లు, రెసిడెన్షియల్ కాలనీలు ఉన్నాయి. ఇక్కడ ధర్నా చేయాలంటే అనేక పర్మిషన్లు అవసరమవుతాయి. అంతేకాకుండా ఇక్కడ నిరసనలు జరిగితే వ్యాపారాలు దెబ్బతింటాయని, శాంతిభద్రతల సమస్య వస్తుందని స్థానికులు లబోదిబోమంటున్నారు.
మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ప్రముఖ నేతలు శ్యామాప్రసాద్ ముఖర్జీ, జయప్రకాశ్ నారాయణ్ ఆందోళనల నుంచి దిల్లీ మాజీ CM కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం వరకు 'రామ్‌లీలా మైదాన్' భారత రాజకీయ చరిత్రకు సాక్షిగా నిలిచింది. కానీ, దిల్లీ మున్సిపాలిటీ పర్మిషన్లు, పోలీస్ NOCలు, భారీ ఫీజులతో నిరసనలను నియంత్రించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాలుగా సామాన్యుల గొంతుకగా మారిన జంతర్ మంతర్ ప్రస్తుతం నిరసన ప్రదేశంగా దాని అధికారిక హోదా కోల్పోవడంతో, ప్రజలు తమ గొంతును వినిపించేందుకు ఉన్న వేదికల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. నిరసన తెలపడం పౌరుల రాజ్యాంగ హక్కు, అది సంపన్నులకో లేదా పెద్ద పార్టీలకో మాత్రమే పరిమితం కాకూడదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
'స్టార్‌లింక్' ఊహిస్తున్నంత గొప్పదా? - ఇతర ఇంటర్నెట్ సేవలతో పోల్చితే తేడాలివీ!

