ఆఫీస్ హడావుడిలో వంట కష్టాలా? - ఈ 'వెజిటబుల్ ఫ్లేక్స్'తో నిమిషాల్లో నచ్చిన డిష్ రెడీ!
బిజీ లైఫ్‌కు స్మార్ట్ సొల్యూషన్ ఈ 'వెజిటబుల్ ఫ్లేక్స్' - టైమ్ తక్కువ, టేస్ట్ ఎక్కువ!

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 11, 2026 at 1:04 PM IST
Dried Vegetable Flakes : సూప్, సలాడ్, పులావ్, స్నాక్స్ ఇలా డిష్ ఏదైనా సరే, అందులో రకరకాల కూరగాయల ముక్కలు ఉంటేనే రుచి, ఆరోగ్యం. కానీ, నేటి బిజీ లైఫ్ స్టైల్లో కూరగాయలు కోయడానికి సమయం, ఓపిక చాలడం లేదు. అలాంటి వారికోసమే వంటగదిలోకి సరికొత్తగా అడుగుపెట్టాయి 'డీహైడ్రేటెడ్ వెజిటబుల్ ఫ్లేక్స్'. ఇవి కిచెన్‌లో ఉన్నాయంటే నిమిషాల్లోనే నచ్చిన వంటకాన్ని రెడీ చేసుకొని హ్యాపీగా ఆరగించేయొచ్చు. మరి, కోసే శ్రమ లేకుండా, ఆరోగ్యాన్ని అందించే ఈ వెజిటబుల్ ఫ్లేక్స్ ప్రత్యేకతలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పిల్లల వెరైటీ ఇష్టాల కోసం కూరగాయ ముక్కలు తరిగే తల్లులు, సలాడ్‌లో క్రంచీ ఆకుకూరల కోసం చూసే ఫుడీస్, ముద్ద అవ్వకుండా కొత్తిమీర పొడి చేయాలనుకునే వంటల మాంత్రికుల అవసరాలను గమనించే ఆహార నిపుణులు ఇప్పుడు సరికొత్తగా డీహైడ్రేటెడ్ వెజిటబుల్ ఫ్లేక్స్‌ను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో కట్ చేసిన కూరగాయల ముక్కలు అమ్ముతున్నారు. వాటితోనో లేదా ఒకప్పుడు మన అమ్మమ్మలు తయారుచేసిన ఒరుగులతోనో పోలిస్తే ఈ డీహైడ్రేటెడ్ వెజిటబుల్ ఫ్లేక్స్‌తో ఉపయోగాలు ఎక్కువే అంటున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు చూద్దాం.
ఒరుగులు ప్రిపేర్ చేసేటప్పుడు ఉప్పు, పసుపు వంటివి ఉపయోగిస్తారు. పైగా ఎండలో ఎండబెట్టడంతో వాటి రంగు, రుచి కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. వాటితో పోలిస్తే ఈ ఫ్లేక్స్ తయారీ పూర్తిగా భిన్నమనే చెప్పుకోవాలి. ఈ ఫ్లేక్స్ తయారీ కోసం ముందుగా కూరగాయల్ని నీట్‌గా కడిగి, తడి మొత్తం పోయేలా తుడుస్తారు లేదా కాసేపు ఎండలో ఉంచుతారు. ఆపై చెక్కు తీసి, ఒకే సైజులో పలుకుల్లా కోసి లేదా చిప్స్ మాదిరి కట్‌చేసి డీహైడ్రేటర్ మెషీన్లలో ఎండబెడతారు. దాంతో అవి పెద్దగా పోషకాలు కోల్పోవని చెబుతున్నారు నిపుణులు. వాటి సహజ రంగు, రుచి కూడా అలాగే ఉండటమే కాక, సంవత్సరం నుంచి రెండేళ్లవరకూ నిస్సందేహంగా ఉపయోగించుకోవచ్చంటున్నారు. ఇవన్నీ గమనించే ప్రస్తుతం ఫ్లేక్స్‌కు విపరీతంగా డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు.
టెంప్టింగ్ రెసిపీ 'చికెన్ రసం' - అమలాపురం నుంచి అమెరికా దాకా 5 స్టార్ రేటింగ్ ఇస్తున్న నెటిజన్లు!

ఎలా వాడుకోవచ్చంటే?
కూరగాయలు అనగానే టమాటా, ఆలుగడ్డ, వంకాయ, బెండకాయ, క్యాప్సికం, పాలకూర, క్యారెట్, బీట్‌రూట్, క్యాబేజీ, కొత్తిమీర, బీన్స్, కాలీఫ్లవర్, ఉల్లిపాయ ఇలా ఎన్నో రకాలైనవి ఉంటాయి. వాటన్నింటితోనూ తయారీదారులు ఈ ఫ్లేక్స్‌ను సిద్ధం చేస్తూ కిచెన్‌లో గంటలతరబడి కష్టపడే శ్రమను తగ్గిస్తున్నారు. కొద్దిసేపు వీటిని వేడినీటిలో వేస్తే చాలు తాజా కూరగాయముక్కల్లా మారిపోతాయి. ఇక వేడివేడి సూప్ లేదా జావలో వేసుకునేందుకు పలుకుల్లా ఉండే ఈ ఫ్లేక్స్, ఉప్మా, ఊతప్పం ప్రిపరేషన్‌కు మంచి జోడీ అవుతాయని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు, ఇన్స్టంట్ నూడుల్స్, పాస్తా, ఫ్రైడ్‌రైస్, బిర్యానీలు చేస్తున్నప్పుడు వాటికి సరిపోయేలా సన్నగా, పొడుగ్గా కోసినవి దొరుకుతాయి.
ఇంకా పిజ్జా, శాండ్‌విచ్‌ల టాపింగ్‌కోసం, స్ప్రింగ్‌రోల్, మంచూరియా, పకోడీ, కట్‌లెట్, వెజ్‌ఫింగర్స్ అన్నింట్లోకీ వాడుకునేలా ఈ వెజిటబుల్ ఫ్లేక్స్ ఉంటాయి. అంతెందుకు, ఈ ఫ్లేక్స్‌ను దోరగా వేయించి, ఉప్పుతోపాటు కాస్త మసాలా చల్లామా వాటినే స్నాక్స్‌గా తినేయొచ్చంటున్నారు. ఇంకా చెప్పాలంటే, ఈ వెజిటబుల్ ఫ్లేక్స్ ఒక్కో కూరగాయకు విడివిడిగానే కాక, అన్నీ కలిపిన మిక్స్‌డ్ వెరైటీలోనూ లభిస్తున్నాయి. కాబట్టి, కూరగాయల ఎంపికలో పిల్లల ఇష్టాయిష్టాలు, ఇంటి అవసరాలు, ఉన్న టైమ్ ఇలా అన్నింటిని గమనించుకుని ఈ ఫ్లేక్స్‌లో మీకేం కావాలో చూసి, కొని తెచ్చుకోవచ్చని చెబుతున్నారు.

