కూల్ వెదర్లో హాట్‌హాట్ " దాల్ సూప్" - కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు - టేస్ట్ సూపర్!
-కందిపప్పు, పెసరపప్పుతో రొటీన్ వంటలు చేస్తున్నారా? - ఇలా సూప్ చేసుకోండి, కిర్రాక్‌గా ఉంటుంది!

Published : December 23, 2025 at 3:15 PM IST
Dal Soup in Cooker: చల్లటి క్లైమెట్‌లో వేడివేడి సూప్ తాగుతుంటే ఆ కిక్కే వేరు. అందుకే చలికాలం వచ్చిందంటే మెజార్టీ పీపుల్ రకరకాల సూప్‌లు తాగుతుంటారు. అందులో టమాటా, క్యారెట్, చికెన్ సూప్‌లు ముందుంటాయి. అయితే ఇవన్నీ ఎప్పుడో ఓసారి తాగే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా మూడు పప్పులతో కలిసిన సూప్ తాగారా? లేదంటే ఓసారి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. చాలా సింపుల్‌గా అది కూడా కుక్కర్లో చేసుకోవచ్చు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తుంటారు. మరి లేట్ చేయకుండా కమ్మని దాల్ సూప్ ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- కందిపప్పు - 2 టేబుల్‌స్పూన్లు
- ఎర్ర కందిపప్పు - 2 టేబుల్‌స్పూన్లు
- పెసరపప్పు - 2 టేబుల్‌స్పూన్లు
- నెయ్యి - 3 టేబుల్‌స్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు - 3
- అల్లం ముక్క - చిన్నది
- పచ్చిమిర్చి - 2
- ఉల్లిపాయ - 1
- టమాటా - 1
- గుమ్మడి కాయ ముక్కలు - 1 కప్పు
- క్యారెట్ - 1
- పసుపు - పావు టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- మిరియాల పొడి - 1 టీస్పూన్
- జీలకర్ర పొడి - 1 టీస్పూన్
- కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ - 1 టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:
- ఓ గిన్నెలోకి కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు వేసి రెండుమూడు సార్లు శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఈలోపు వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాను సన్నగా కట్ చేసుకోవాలి. అదే విధంగా క్యారెట్, గుమ్మడికాయపై పొట్టు తీసేసి ముక్కలుగా చేసి పక్కనుంచాలి.
- స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ఉంచి నెయ్యి వేసి కరిగించాలి. కరిగిన నెయ్యిలో వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి ఓ 5 నిమిషాల పాటు లో టూ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి.

- ఆనియన్స్ వేగాక టమాటా, గుమ్మడి ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కలుపుతూ వేయించాలి.
- కూరగాయ ముక్కలు వేగి పచ్చివాసన పోయినాక నానబెట్టిన పప్పులను నీళ్లు లేకుండా వేసుకుని కలుపుకోవాలి.
- అనంతరం అందులోకి పసుపు, ఉప్పు వేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు కప్పుల నీరు పోసి కలిపి మూత పెట్టి విజిల్ ఉంచి మీడియం ఫ్లేమ్‌లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.

- కుక్కర్ ఆవిరి పోయినాక మూత తీసి పప్పు మిశ్రమాన్ని ఓసారి కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి.
- పప్పు మిశ్రమం చల్లారినాక మిక్సీజార్‌లోకి కొద్దికొద్దిగా వేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి సూప్ చిక్కదనానికి సరిపడేలా వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.

- అనంతరం మిరియాల పొడి, జీలకర్ర పొడి, కశ్మీరి రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలిపి సిమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికించాలి.
- చివరగా కొత్తిమీర తరుగు వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దాల్ సూప్ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- ఈ సూప్ కోసం పైన చెప్పిన కూరగాయలు మాత్రమే కాకుండా బీన్స్, బఠాణీ వంటివి కూడా వేసుకుని చేసుకోవచ్చు.
- సూప్‌ను మరీ పల్చగా, మరీ చిక్కగా కాకుండా నార్మల్‌గా కన్సిస్టెన్సీ వచ్చేలా వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఇంటిల్లిపాదీ మెచ్చే "వంకాయ బజ్జీలు" - తక్కువ నూనెతో అప్పటికప్పుడు రెడీ!
అన్నం మిగిలిందా? - ఇలా "మసాలా వడలు" చేయండి! - అద్దిరిపోయే టేస్ట్!

