సరికొత్త పద్ధతిలో "పెరుగు వడలు" - ఒక్కసారి తింటే రుచి మరచిపోరంతే!
మధ్యప్రదేశ్ స్పెషల్ సూపర్ టేస్టీ 'దహీ వడ' - ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

Published : November 17, 2025 at 12:51 PM IST
Madhya Pradesh Style Dahi Vada : మనందరం బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ, దోశ, వడ, బోండా, పూరీ, ఉప్మా వంటివి తరచుగా ప్రిపేర్ చేసుకుంటుంటాం. అయితే, ఎప్పుడూ ఒకే రకం టిఫెన్ తినాలంటే బోరింగ్‌గా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే పిల్లల నుంచి పెద్దల వరకు అప్పుడప్పుడు వెరైటీ రుచులను కోరుతుంటారు. అలాంటి వారికోసమే ఒక వెరైటీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, మధ్యప్రదేశ్ స్పెషల్ నోరూరించే "దహీ వడ". నార్మల్‌గా అందరూ చేసుకునే పెరుగు వడలతో పోల్చితే వీటి తయారీ విధానం కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రిపరేషన్ మాత్రమే కాకుండా టేస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలైతే వీటిని ఒకటికి రెండు చాలా ఇష్టంగా తింటారు. మరి, మధ్యప్రదేశ్ వారి ఈ స్పెషల్ టిఫెన్‌కు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- మినప్పప్పు - ఒక కప్పు
- పెరుగు - రెండున్నర కప్పులు
- దానిమ్మ గింజలు - రెండు స్పూన్లు
- సన్న కారప్పూస - గుప్పెడు
- కారం - ఒక చెంచా
- పంచదార - మూడు స్పూన్లు
- వేయించిన జీలకర్ర - ఒక స్పూన్
- ధనియాలపొడి - ఒక స్పూన్
- కొత్తిమీర తరుగు - చారెడు
- ఉప్పు - టేస్ట్‌కి సరిపడా
- నూనె - వేయించడానికి సరిపడా
- పుదీనా చట్నీ - ఒకటిన్నర స్పూన్లు
- పండుమిర్చి చట్నీ - ఒకటిన్నర స్పూన్లు
మైదా బోండాలు వద్దు, కరకరలాడే ఉల్లి బోండాలు చేసుకోండి - సూపర్ టేస్ట్!
తయారీ విధానం :
- మధ్యప్రదేశ్ స్పెషల్ దహీ వడ తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో మినప్పప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి.
- తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి.
- మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి వీటిని రెడీ చేసుకునే వారు పడుకునే ముందు మినప్పప్పును నానబెట్టుకుంటే సరిపోతుంది.
- మినప్పప్పు మంచిగా నానిన తర్వాత వాటర్ వడకట్టి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఆపై అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కనుంచాలి.

- అనంతరం స్టవ్ మీద కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ వేడయ్యాక మంటను తగ్గించి ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ వడల్లా వత్తుకుని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి.
- పాన్‌లో వేయించడానికి సరిపడా వేసుకుని మీడియం ఫ్లేమ్‌లో బంగారు రంగులోకి మారే వరకూ వేయించుకోవాలి. అలా పిండి మొత్తాన్ని వడల్లా చేసుకోవాలి.

- తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని అందులో ప్రిపేర్ చేసుకున్న వడలన్నీ వేసి కొంతసేపు నాననివ్వాలి.
- ఆలోపు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి పెరుగును తీసుకుని తరకలు లేకుండా గిలకొట్టి పక్కనుంచాలి.
- వాటర్‌లో నానబెట్టిన వడలు మెత్తబడ్డాక బయటకు తీసి అదనపు నీరు పోయేలా చేతితో లైట్‌గా ప్రెస్ చేసి మిక్సింగ్ బౌల్లో ఉన్న పెరుగులో వేయాలి.
- తర్వాత అందులో పుదీనా, పండుమిర్చి చట్నీలు, దానిమ్మ గింజలు, సన్న కారప్పూస, పంచదార, కారం, వేయించిన జీలకర్ర, ధనియాల పొడి, సన్నని కొత్తిమీర తరుగు వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలపాలి.

- అనంతరం వడలను కొద్దిసేపు పెరుగు మిశ్రమాన్ని పీల్చుకునేలా నానబెట్టి ఆపై సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, మధ్యప్రదేశ్ స్పెషల్ నోరూరించే "దహీ వడ" అప్పటికప్పుడు రెడీ అవుతుంది!
- మరి, నచ్చితే మీరూ రెగ్యులర్ టిఫెన్స్కు బదులుగా ఓసారి దీన్ని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
పిల్లల మనసు నింపే "స్నాక్" - బ్రెడ్‌తో నిమిషాల్లోనే రెడీ!
పచ్చిబొప్పాయితో పసందైన 'పచ్చడి' - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!

