ఇరాన్ టు ఇండియా - "ఫలూదా" జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే?
ఫలూదా అంటే ఇష్టమా? - అయితే మరి మీకు ఈ విషయాలు తెలుసా?

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 24, 2026 at 11:17 AM IST
Falooda History in Telugu : వేసవిలో మెజార్టీ పీపుల్ ఇష్టంగా తినేవాటిలో ఫలూదా ఒకటి. ఇది చూడటానికి కలర్ఫుల్గా కనిపిస్తూ తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. ఇక రుచి గురించి చెప్పడానికి మాటలే చాలవు. దీనిని ఐదారు రకాల పదార్థాలతో కలిపి చేస్తారు. ఇందులో కూడా ఎన్నో ఫ్లేవర్లు ఉన్నాయి. అయితే దీన్ని ప్రిపేర్ చేయాలంటే కాస్త టైమ్ పడతుంది. మరి అసలు ఈ ఫలూదా మన దేశానికీ ఎలా వచ్చింది? దీన్ని అసలు ఎందుకు తినాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఫలూదా అనేది బాదం పాలు లేదా చిక్కని పాలు, మొక్కజొన్నపిండితో చేసిన సన్నని సేమియా, రోజ్‌సిరప్, సబ్జాగింజలు, ఐస్‌క్రీం అన్నింటినీ ఒకదానిపైన మరొకటి పద్ధతిగా పేర్చి ఇచ్చే తియ్యని, చల్లని డిజర్ట్ జార్. డ్రైఫ్రూట్స్ పలుకులు, కోవా, గుల్కంద్, పండ్లముక్కలను పైన గార్నిష్ కోసం ఉపయోగిస్తారు. అందుకే పిల్లల నుంచి పెద్దలవరకూ దీని టేస్ట్‌కు ఫిదా అవుతారు. అలాంటి ఫలూదా ఇప్పుడు నచ్చిన విధంగా దొరికేస్తూ ఇంకాస్త ఊరిస్తోంది. అబ్బ చెబుతుంటూనే నోరూరుతోంది కదూ!
Falooda Benefits in Telugu : నిజానికి ఫలూదాను మొదటిసారి ఇరాన్(ఒకప్పటి పర్షియా)లో కేవలం సన్నని సేమియా, రోజ్‌వాటర్, పంచదార కలిపి తయారుచేసేవారు. అనంతరం దీన్ని చల్లబరిచి ఫలూదే పేరుతో పర్వదినాల సమయాల్లో, పెళ్లిళ్లలో వడ్డించేవారట. ఇక ముఖ్యంగా సమ్మర్లో, రంజాన్ సమయంలో శరీరానికి శక్తిని అందించే పదార్థంగా దీన్ని తీసుకునేవారు. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో అక్కడి నుంచి వచ్చిన వ్యాపారులు మన దేశానికీ ఈ రుచిని పరిచయం చేశారు. కాలక్రమేణా ఇందులో చిక్కని పాలు, ఐస్‌క్రీం, సబ్జాగింజలు వంటివి యాడ్ చేసి ఫలూదాకు కొత్త టేస్ట్‌ను తీసుకొచ్చారు పాకశాస్త్ర నిపుణులు.
ఫలూదా టేస్ట్ సూపర్‌గా ఉన్నా దీనిని తయారుచేయాలంటే కాస్త సమయం పడుతుంది. పాలను కాస్త చిక్కగా అయ్యేలా మరిగించాలి. ఆ తర్వాత సేమియాను ఉడికించాలి. అలాగే రోజ్‌సిరప్, ఇతర పదార్థాలూ తెచ్చుకోవాలి. సబ్జా గింజల్ని నానబెట్టాలి ఇలా ప్రతిదీ పనే. ఇదంతా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అందుకే వివిధ కంపెనీలు సింపుల్‌గా, ఇన్‌స్టంట్‌గా చేసుకునే విధంగా ఫలూదా పౌడర్‌లూ, జ్యూస్‌లను అందుబాటులోకి తెచ్చాయి.
ఈ క్రమంలోనే బటర్‌స్కాచ్, చాక్లెట్, రోజ్, కేసర్పిస్తా, మామిడి, స్ట్రాబెర్రీ అంటూ వివిధ రకాల ఫ్లేవర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ పొడులను పాలల్లో కలిపి కాస్త చిక్కగా అయ్యేలా చేసుకుంటే చాలు. ఇందులోనే సేమియా కూడా ఉంటుంది కాబట్టి నానబెట్టుకున్న సబ్జాగింజల్నీ కాస్త, ఐస్‌క్రీం వేస్తే ఫలూదా రెడీ అయినట్లే. ఈ మాత్రం శ్రమ కూడా పడలేనివారికోసం ఫలూదా పానీయం మెచ్చే రుచుల్లో లభిస్తోంది. అంతేనా కొందరు దీన్ని ఐస్‌క్రీం రూపంలోనూ తీసుకొస్తే మరికొందరు ఫలూదా బౌల్, మట్కా ఫలూదా అంటూ ఇంకొన్ని ప్రయోగాలు చేస్తూ ఆహార ప్రియులకు దీనిపైన ఉన్న ఇష్టాన్ని మరింత పెంచేస్తున్నారు.
శక్తిని అందిస్తుంది : వేసవిలో ఫలూదాను తింటే శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అంతేకాక ఎండ, అతివేడి ప్రభావాన్ని తగ్గించి, వడదెబ్బ నుంచి కాపాడుతుంది. ఇందులో వేసే సబ్జాగింజల్లో పీచు ఎక్కువ కాబట్టి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రధానంగా నానబెట్టిన సబ్జాగింజల్ని కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండినట్లుగా అనిపించి త్వరగా ఆకలీ వేయదు. డ్రైఫ్రూట్స్, పండ్లముక్కలు, పాలు వంటివన్నీ వేయడం వల్ల క్యాల్షియం, ఐరన్, ప్రొటీన్ తదితర పోషకాలూ శరీరానికి అందుతాయి. అలాగే రోజ్‌సిరప్‌లో ఉండే ఫ్లవనాయిడ్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అదండీ విషయం. ఇక మీరు కూడా ఫలూదా రుచిని ఆస్వాదించడంతోనే ఆగిపోకుండా పోషకాలనూ అందుకుంటూ ఆనదించండి.
ఉక్కపోతతో అల్లాడుతున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే మీ "ఇల్లు" కూల్ కూల్‌గా!
పశువులు పెంపకందారులకు రూ.3లక్షల రుణం - "పశు కిసాన్ క్రెడిట్ కార్డు"పై 7శాతం వడ్డీ!

