కోడిగుడ్డు ఉడికించి శనగపిండిలో దట్టిస్తే 'ఎగ్ బోండా' - ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఇలా చేయండి!
ఎగ్స్‌తో సింపుల్‌గా చేసుకునే స్నాక్ రెసిపీ - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 29, 2026 at 10:19 AM IST
Egg Bajji Making Process : రోడ్డు సైడ్ అమ్మే ఎగ్ బోండాలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటినే కొన్నిచోట్ల ఎగ్ బజ్జీలని కూడా పిలుస్తారు. ఇవి నోటికి కొత్త రుచినిస్తూ తిన్నాకొద్ది తినాలనిపిస్తుంది. అయితే ఇవి ఇంట్లో చేసినప్పుడు బండి మీద అమ్మే రుచి రావట్లేదని కొందరు మదనపడుతుంటారు. అలాంటి వారు ఓసారి ఈ స్టెప్స్ పాటిస్తూ ఇవి చేస్తే స్ట్రీట్ స్టైల్ రుచిలో పర్ఫెక్ట్గా వస్తాయి! ఇక పిల్లలైతే వీటిని ఒకటికి రెండు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాక మరోసారి చేయమని అడుగుతారు. మరి నోరూరించే ఈ టేస్టీ ఎగ్ బోండాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
"క్యాబేజీ, కోడిగుడ్డు ఫ్రై" - అప్పటికప్పుడు చేసుకునే అద్భుతమైన రెసిపీ!
కావాల్సిన పదార్థాలు :
- శనగపిండి - 2 కప్పులు
- పసుపు - అర టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- ఉడికించిన కోడిగుడ్లు - 8
- పచ్చిమిర్చి - 8
- కారం - 1 టీ స్పూన్
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- జీలకర్ర పొడి - అర టీ స్పూన్
- గరం మసాలా - అర టీ స్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- చాట్ మసాలా - 1 టీ స్పూన్
- వంటసోడా - 2 చిటికెడ్లు
- నూనె - సరిపడా
తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఎనిమిది ఉడికించిన కోడిగుడ్లను తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసి ఓ ప్లేట్లో వేయాలి. అలాగే ఎనిమిది పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును తరిగి ఉంచాలి.
- ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కప్పు శనగపిండి, తరిగి ఉంచిన కరివేపాకు, పచ్చిమిర్చి తురుము వేయాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ చాట్ మసాలా, ఒక టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసి మిక్స్ చేయాలి.
- ఆపై తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చేవరకు మిక్స్ చేయాలి. ఇందులోనే రెండు చిటికెడ్ల వంటసోడా వేసి కలిపి పక్కనుంచాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో వేయించడానికి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలను వేసి పిండిని బాగా పట్టించాలి.
- అనంతరం కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా ఎగ్ బోండాలను వేసి రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఎగ్ బోండాలను రెండు వైపులా టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి.
- అంతే స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండాలు తయారైనట్లే!
- ఈ ఎగ్ బోండాలపై పైన కాస్త కారం చల్లి, ఉల్లిపాయలతో కలిపి తింటే రుచి అద్దిరిపోతుంది!
- మీకు ఈ రెసిపీ నచ్చితే ఓసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి.
కరకరలాడే "నువ్వుల చెగోడీలు" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!
రాయలసీమ స్టైల్ "పచ్చిమిర్చి పప్పు" - ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ చేసుకుంటారు!

