ఎర్రకారంతో అద్దిరిపోయే "అలసందల దోశలు" - పిండి పులియబెట్టకుండానే అప్పటికప్పుడు రెడీ!
రెగ్యులర్ దోశలను మించిన టేస్ట్ - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా!

Published : January 9, 2026 at 7:30 PM IST
Crispy Dosa Recipe with Bobbarlu : ఆరోగ్యానికి మేలు చేసే పప్పుధాన్యాల్లో 'బొబ్బర్లు' ఒకటి. వీటినే 'అలసందలు' అని కూడా పిలుస్తుంటారు. అయితే, నార్మల్‌గా బొబ్బర్లతో అందరూ వడలు, గుగ్గిళ్లు, రకరకాల స్నాక్ రెసిపీలు చేసుకుంటుంటారు. అవి మాత్రమే కాకుండా బొబ్బర్లతో మీరు ట్రై చేయాల్సిన మరో సూపర్ రెసిపీ ఉంది. అదే, క్రిస్పీ అండ్ టేస్టీ "దోశలు". అలసందలతో చేసుకునే ఈ దోశలు రొటీన్‌గా చేసుకునే వాటితో పోల్చితే భలే రుచికరంగా ఉంటాయి. పైగా వీటి తయారీకి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. పిండిని పులియబెట్టకుండానే తక్కువ టైమ్‌లో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, లేట్ చేయకుండా అలసందలతో అద్దిరిపోయే ఈ దోశలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- బొబ్బర్లు - రెండు కప్పులు
- బియ్యం - ఒక కప్పు
- ఉప్పు - రుచికి తగినంత
- సన్నని ఉల్లిపాయ తరుగు - కొద్దిగా
- సన్నని కొత్తిమీర తరుగు - కొంచెం
- నూనె - కొద్దిగా(దోశపై వేసుకోవడానికి)
పొట్టు మినప్పప్పుతో "వడలు" - అమ్మమ్మల పద్ధతిలో నూనె పీల్చకుండా, భలే రుచిగా!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో బొబ్బర్లు/అలసందలు, బియ్యం తీసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి.
- అలసందల్లో ఎర్రవి, తెల్లవి అనే రెండు రకాలు ఉంటాయి. వీటిలో ఈ రెసిపీ కోసం మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు.
- తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు నానబెట్టుకోవాలి.
- మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈ దోశలు చేసుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రి బొబ్బర్లను కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది.
- నెక్ట్స్ డే మార్నింగ్ బాగా నానిన అలసందలను మరోసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి.

- తర్వాత అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం గ్రైండ్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మరికొద్దిగా నీళ్లు పోసుకుని, రుచికి తగినంత ఉప్పు వేసుకుని దోశకు కావాల్సినవిధంగా పిండిని కలుపుకోవాలి.
- ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ మరీ పలుచగా, గట్టిగా ఉండకుండా మీడియంగా దోశకు కావాల్సిన విధంగా ఉండేలా చూసుకోవాలి.
- ఇప్పుడు దోశపై వేసుకోవడానికి ఎర్ర కారాన్ని తయారు చేసుకోవాలి.
శనగపిండి లేకుండానే కరకరలాడే "జంతికలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

ఎర్ర కారం కోసం :
- ఉల్లిపాయలు - నాలుగు
- వెల్లుల్లి రెబ్బలు - 15
- జీలకర్ర - ఒక టీస్పూన్
- కారం - రెండు టీస్పూన్లు
- ఉప్పు - రుచికి తగినంత
- చింతపండు - కొద్దిగా

- ఇందుకోసం మిక్సీ జార్ తీసుకుని అందులో మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి.
- అలాగే, కొద్దిగా చింతపండు వేసుకుని వాటర్ వేయకుండా మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకుంటే ఎర్ర కారం రెడీ అవుతుంది.
- అనంతరం దోశ తయారీకి స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. పెనం హీట్ అయ్యాక ఒక టీస్పూన్ నూనె వేసి టిష్యూ లేదా క్లాత్‌తో అంతా స్ప్రెడ్ చేయాలి.
- తర్వాత స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి కలిపి పెట్టుకున్న పిండిని ఒకట్రెండు గరిటెలు వేసుకుని పల్చని దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి.

- దోశ కాస్త కాలిన తర్వాత దానిపై ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎర్ర కారాన్ని కొద్దిగా వేసుకుని గరిటెతో దోశ మొత్తం అనుకోవాలి.
- ఆపై దాని మీద కొద్దిగా సన్నని ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఆ తర్వాత చుట్టూ కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకుని మీడియం ఫ్లేమ్‌లో ఎర్రగా కాలనివ్వాలి.
- దోశ బాగా కాలిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసి అర నిమిషం పాటు కాలనివ్వాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలు.
- అంతే, ఎర్రకారంతో క్రిస్పీ అండ్ టేస్టీగా నోరూరించే "అలసందల దోశలు" అప్పటికప్పుడు తయారవుతాయి!
- మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ వెరైటీ దోశలు ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒకటికి రెండు చాలా ఇష్టంగా తింటారు!
మినప్పప్పుతో "మైసూర్ బోండాలు" - టిఫెన్ సెంటర్ మాదిరి రుచిగా ఉంటాయి!

