8800001915 నెంబర్‌కు Hi పెట్టండి - వాళ్లే చూసుకుంటారు!
- వస్తువులను MRP కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నారా? - - వాట్సాప్ ద్వారా ఈజీగా ఫిర్యాదు చేయండిలా - నెల తిరగకుండానే పరిష్కారం!

Published : February 19, 2026 at 1:58 PM IST
|Updated : March 5, 2026 at 11:03 AM IST
Consumer Commission on MRP: బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ సహా తదితర ప్రాంతాల్లో ఏదో ఒక టైమ్‌లో వాటర్ బాటిల్, ఫుడ్స్, దుస్తులు వంటివి కొంటుంటాం. అయితే అవి కొనేటప్పుడు వ్యాపారులు చెప్పే ధరలు వింటే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే కొన్ని ఫుడ్ స్టాల్స్ వాళ్లు MRP కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు. ఇదేమని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారు. దీంతో చేసేదేమి లేక తప్పనిసరి అయినప్పుడు కచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే, ఇకపై ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు వస్తువులు అమ్మితే వాట్సాప్‌లోనే ఈజీగా ఫిర్యాదు చేయవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

MRP అంటే ఏమిటి: MRP అంటే మాగ్జిమం రిటైల్ ప్రైస్. ఈ ధరను తయారీదారులు లేదా విక్రేతలు నిర్ణయిస్తారు. వీరు ఉత్పత్తి ఖర్చులు, మార్కెటింగ్, రవాణా, ప్రాఫిట్ మార్జిన్‌ను పరిగణనలోకి తీసుకుని MRPని నిర్ణయిస్తారు. MRPని సాధారణంగా ప్రొడక్ట్ లేబుల్ లేదా ప్యాకేజింగ్‌పై ప్రింట్ చేస్తారు. ఇందులోనే అన్ని ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేస్తారు.

ఫిర్యాదు ఎలా చేయాలి: ఎక్కువ ధరలకే వస్తువులు అమ్మినప్పుడు నేరుగా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఆఫీసుకు వెళ్లాల్సిన పని లేకుండా కేవలం వాట్సాప్ ద్వారానే కంప్లెయింట్ చేయొచ్చు. అందుకు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ 'వాట్సాప్ చాట్‌బాట్' సేవలను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, మరాఠీ సహా ఇతర భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది. MRP కన్నా ఎక్కువ ధరకు అమ్మితే వాట్సప్ నెంబర్ "88000 01915" ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

- మొదట మీ ఫోన్లో పైన చెప్పిన ఫోన్ నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
- వాట్సాప్ ఓపెన్ చేసి ఈ నెంబర్‌పై క్లిక్ చేసి Hi అని టైప్ చేసి సెండ్ చేయాలి.
- అనంతరం మీకు సూట్ అయ్యే భాషను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం పేరు, జెండర్ వివరాలు ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత అక్కడ ప్రాంప్ట్ ఆధారంగా వివరాలు ఎంటర్ చేసి సెండ్ చేయాలి.
- చివరగా జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్‌లైన్‌లో మీ కంప్లైంట్ నమోదవుతుంది.
- కేసు పూర్తి అయ్యి మీకు పరిష్కారం దొరికే వరకు అవసరమైన సలహాలు, సూచనలు వాట్సాప్ ద్వారా మీకు అందుతాయి.
"వినియోగదారులు ఎవరూ MRP కంటే ఎక్కువ చెల్లించవద్దు. ఒకవేళ ఎవరైనా అదనంగా వసూలు చేస్తే, వెంటనే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ 1915 లేదా 88000 01915 కి వాట్సాప్ చేయండి" - వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక X అకౌంట్
టోల్ ఫ్రీ నెంబర్: వాట్సాప్ సేవలతో పాటు టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసుకోవచ్చు. అందుకోసం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్యలో 1915 లేదా 1800-11-4000 కు కాల్ చేసి కంప్లెయింట్ చేయొచ్చు.

ఆన్లైన్ పోర్టల్: MRP కన్నా ఎక్కువ ధర వసూలు చేసిన వారిపై ఆన్‌లైన్‌లో National Consumer Helpline (NCH) పోర్టల్ ద్వారా సులభంగా ఫిర్యాదు చేయవచ్చు.
- ముందుగా ఫోన్లో NCH Portal ఓపెన్ చేయాలి.
- మీరు కొత్త యూజర్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అనంతరం ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి.
- లాగిన పూర్తైయ్యాక Register Grievanceపై క్లిక్ చేసి మీ ఫిర్యాదును ఎంటర్ చేయాలి. అనంతరం దానికి సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
- కేవలం ఈ పద్ధతుల ద్వారా మాత్రమే కాకుండా NCH యాప్, ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ఫిర్యాదు చేసిన తర్వాత పరిష్కారమైన కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ https:/consumerhelpline.gov.in/ వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. 'ఎన్‌సీహెచ్ సక్సెస్ స్టోరీస్' పేరుతో వెబ్‌సైట్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
హరిద్వార్ నుంచి స్వచ్ఛమైన గంగాజలం - పోస్టు ద్వారా మీ ఇంటికి!
తరచూ ఫ్లైట్ జర్నీ చేస్తుంటారా? - విమానం రద్దైతే మీకు లభించే ప్రయోజనాలేంటో తెలుసా!

