టిఫెన్స్లోకి కిర్రాక్ "కొబ్బరి కొత్తిమీర చట్నీ" - తక్కువ పదార్థాలతో నిమిషాల్లోనే రెడీ!
అప్పటికప్పుడు చేసుకునే కమ్మని "చట్నీ" - టిఫెన్ ఏదైనా రుచి మాత్రం అదుర్స్!

Published : January 10, 2026 at 12:11 PM IST
Coconut Coriander Chutney Recipe : మనందరం బ్రేక్‌ఫాస్ట్‌లోకి డైలీ దోశ, ఇడ్లీ, వడ, బోండా, ఉప్మా అంటూ ఏదో ఒక రకం రెసిపీని ప్రిపేర్ చేసుకుంటుంటాం. ఇలా ఏ టిఫెన్ ప్రిపేర్ చేసుకున్నా అందులోకి మంచి రుచికరమైన చట్నీ లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. అయితే, నార్మల్‌గా అందరూ పల్లీ, కొబ్బరి, టమాటా, పుట్నాల చట్నీ వంటివి రెగ్యులర్‌గా తయారు చేసుకుంటుంటారు. అలాగని రోజూ అవే తినాలన్నా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇకపోతే కొన్నిసార్లు చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఒక సూపర్ చట్నీ రెసిపీని మీకోసం తీసుకొచ్చాం.
అదే, నోరూరించే "కొబ్బరి కొత్తిమీర చట్నీ". ఇది నార్మల్‌గా చేసుకునే కొబ్బరి చట్నీతో పోల్చితే కొత్తిమీర కాంబోలో కిర్రాక్ టేస్టీగా ఉంటుంది. ఏ టిఫెన్ చేసుకున్నా అందులోకి మంచి కాంబినేషన్‌గా నిలుస్తుంది. పిల్లలైతే ఈ చట్నీతో చాలా ఇష్టంగా తింటారు. అలాగే, ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది! బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ రుచికరమైన చట్నీని తయారు చేసుకోవచ్చు. మరి, లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ చట్నీని ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- ఒక కప్పు - సన్నని పచ్చికొబ్బరి ముక్కలు
- అర కప్పు - పుట్నాల పప్పు
- అంగుళం ముక్క - అల్లం
- నాలుగైదు - పచ్చిమిర్చి
- రుచికి తగినంత - ఉప్పు
- కొద్దిగా - చింతపండు
- రెండు పిడికెళ్లు - కొత్తిమీర
పుల్ల పుల్లగా నోరూరించే "ఉసిరికాయ పోహా" - ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతుంది!

తయారీ విధానం :
- ఈ నోరూరించే ఇన్స్టంట్ చట్నీ తయారీకి ముందుగా ఒక కప్పు పరిమాణంలో సన్నని పచ్చికొబ్బరి ముక్కలను సిద్ధం చేసుకుని పక్కనుంచాలి.
- అదేవిధంగా, కావాల్సిన పరిమాణంలో తాజా కొత్తిమీరను తీసుకుని కాడల భాగం కొద్దిగా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సన్నని పచ్చికొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, అల్లం ముక్క, రుచికి తగినన్ని పచ్చిమిరపరకాయలను ముక్కలుగా తుంచి వేసుకోవాలి.

- అలాగే, నాలుగు రెబ్బలంత చింతపండు, రుచికి తగినంత ఉప్పు, కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి వాటర్ వేయకుండా అన్నింటినీ బాగా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- అనంతరం గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని అందులోకి తాలింపును రెడీ చేసుకోవాలి.
పోపు కోసం :
- ఆయిల్ - రెండు టేబుల్‌స్పూన్లు
- ఆవాలు - ఒక టీస్పూన్
- మినప్పప్పు - ఒక టీస్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- ఇంగువ - అర టీస్పూన్
- ఎండుమిర్చి - రెండు

- తాలింపు కోసం స్టవ్ మీద చిన్న కడాయిలో నూనె వేసి వేడయ్యాక మినప్పప్పు, ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి.
- అవి లైట్‌గా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలను వేసుకుని పోపును బాగా ఫ్రై చేయాలి.
- పోపు మంచిగా వేగిందనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు.
- అంతే, నిమిషాల్లోనే అద్భుతమైన రుచితో వావ్ అనిపించే "కొబ్బరి కొత్తిమీర చట్నీ" రెడీ అవుతుంది!
- మరి, నచ్చితే మీరూ రెగ్యులర్‌గా చేసుకునే పల్లీ, టమాటా చట్నీలకు బదులుగా ఓసారి కొత్తిమీర కాంబినేషన్లో ఇలా "కొబ్బరి చట్నీని" ట్రై చేయండి.
పాలకూరతో కమ్మని "మసాలా వడలు" - ఈవెనింగ్ స్నాక్స్‌గా బెస్ట్ ఆప్షన్ - టేస్ట్ వేరే లెవల్!
పల్లీలను ఇలా వేయించి "చట్నీ" చేయండి - టేస్ట్ అదుర్స్, వారం రోజులు నిల్వ!

