గోమూత్రంతో నడిచే "గడియారం"! - ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా?
గడియారం తిరగాలంటే 'బ్యాటరీ' అవసరం లేదు! - శ్రీ గోపాల కృష్ణ గోశాల ప్రతినిధుల సరికొత్త ఆవిష్కరణ!

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 30, 2026 at 12:16 PM IST
Clock Works with Cow Urine : మార్నింగ్ నిద్ర లేవడం మొదలు రాత్రి పడుకునే వరకూ మన రోజువారీ పనులన్నీ సమయాన్ని అనుసరించే సాగుతుంటాయి. అంతలా గడియారం మన జీవితాల్లో భాగమైపోయింది. అయితే, సాధారణంగా గడియారం పనిచేయాలంటే బ్యాటరీ, విద్యుత్తు, సౌర విద్యుత్తు వంటివి అవసరమవుతాయి. కానీ, మీకు తెలుసా? గోడ గడియారం తిరగాలంటే అవే ఉండాల్సిన అవసరం లేదు. గోమూత్రంతో కూడా "గడియారం" పనిచేస్తుంది! వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మరి, అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

నార్మల్‌గా పని చేసే గోడ గడియారానికి భిన్నమైన ఆవిష్కరణతో ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట గోశాల నిర్వాహకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇటీవల వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో "గోమూత్రంతో పనిచేసే గోడ గడియారాన్ని" ప్రదర్శించారు. సాధారణ వాల్ క్లాక్స్‌కు భిన్నంగా గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు.

ప్రపంచంలోని గడియారాలన్నీ ఒకే "టైమ్" ఎలా చూపిస్తాయి? - ఆసక్తికర చరిత్ర మీకు తెలుసా?
ఈ గడియారం ఎలా పనిచేస్తుందంటే?
ఇందుకోసం ముందుగా ఒక గోడ గడియారం తీసుకోవాలి. తర్వాత ఈ గడియారం తిరగడానికి రెండు ప్లాస్టిక్ డబ్బాలను తీసుకుని, ఒక్కో డబ్బాలో లీటరు గోమూత్రం పోయాలి. అనంతరం ఆ డబ్బాల్లో ఒక కాపర్, ఒక జింక్ కడ్డీ చొప్పున రెండు డబ్బాల్లో వేర్వేరుగా పెట్టాలి. నెక్ట్స్ ఒక డబ్బాలోని కాపర్ కడ్డీని మరో డబ్బాలోని జింక్ కడ్డీని తీగతో కలపాలి. అనంతరం ఒక డబ్బాలో విడిగా ఉన్న జింక్ కడ్డీ నుంచి ఒక తీగ లాగి ముందుగా పక్కన పెట్టుకున్న గడియారంలోని ఒక టెర్మినల్‌కు కనెక్షన్ ఇవ్వాలి. అలాగే, మరో డబ్బాలోని కాపర్ కడ్డీ నుంచి తీగ లాగి గడియారంలోని ఇంకో టెర్మినల్‌కు కలిపితే చాలట. దాంతో గడియారం పనిచేస్తుందని వివరిస్తున్నారు గోశాల ప్రతినిధులు పరిమి వెంకట రాఘవులు, గద్దే వెంకట రత్నాజీ. డబ్బాలను ఒకసారి గోమూత్రంతో నింపితే గడియారం 14 రోజులు పని చేస్తుందని చెబుతున్నారు.

"దేశీయ గోవుల మూత్రంతోనే ఈ గడియారం పనిచేస్తుంది. గోవుల వీపుపై ఉన్న మోపరంలో సూర్య కేతునాడి ఉంటుంది. సూర్య కిరణాలు మోపరాన్ని తాకగానే సూర్య కేతునాడి ద్వారా సూర్యరశ్మి గోవు శరీరంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం గోమూత్రంలో కలవడం వల్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. దాంతో గోమూత్రం ఎలక్ట్రోలైట్‌గా మారి గడియారాన్ని తిరిగేలా చేస్తుంది."- పరిమి వెంకట రాఘవులు, గద్దే వెంకట రత్నాజీ, గోశాల ప్రతినిధులు.

కొత్త ఆవిష్కరణతో ఖర్చు ఆదా!
ఒకప్పుడు అంటే ఇంట్లో పెద్ద పెద్ద గోడ గడియారాలు ఉండేవి. ప్రస్తుతం కాలంతో పాటు గడియారాల రూపం, వాటి అవసరం పూర్తిగా మారిపోయింది. నేటి టెక్నాలజీ యుగంలో వాచ్ సమయాన్ని చూపించే వస్తువుగా మాత్రమే కాకుండా అది ఒక వ్యక్తి అభిరుచి, వ్యక్తిత్వం, జీవనశైలి, ఫ్యాషన్ భావనలను ప్రతిబింబించే లైఫ్ స్టైల్ ప్రొడక్టుగా మారిపోయింది.

ముఖ్యంగా ఈతరం యువతీయువకులు స్మార్ట్ వాచీలను ఎక్కువగా వాడేస్తున్నారు. టెక్నాలజీ పరంగా ఎన్ని రకాల వాచీలు వచ్చినా గోడ గడియారానికి ఉండే క్రేజ్ మాత్రం వేరు. ఇదే క్రమంలో గోడ గడియారం డిజైన్లోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే, ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ అది నడవాలంటే బ్యాటరీ, విద్యుత్, సౌర విద్యుత్ కావాల్సి ఉంటుంది. కానీ, ఏలూరు జిల్లా నాచుగుంట శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు ఆవిష్కరించిన ఈ గడియారానికి అవేమి అవసరం లేదు. సహజంగా దొరికే గోమూత్రంతో కూడా గడియారాన్ని నడిపించొచ్చంటున్నారు! దాంతో బ్యాటరీ, విద్యుత్ ఖర్చులు కొంతమేర ఆదా చేసుకోవచ్చు!

"హరిహర కోట ట్రెక్కింగ్" - నిటారు మెట్లపై సాహసయాత్రకు సిద్ధమా?!

