కర్ణాటక స్పెషల్ "మసాలా చిత్రాన్నం" - ఈ పండగ వేళ ఇలా ట్రై చేయండి!
అన్నం, కర్రీ అవసరం లేదు - ఈజీగా, టేస్టీగా ఉండే సింపుల్ రెసిపీ ఇది!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 11, 2026 at 7:05 AM IST
|Updated : January 11, 2026 at 7:21 AM IST
MASALA CHITRANNAM : సంక్రాంతి పండుగ వచ్చేసింది. మగువలంతా పిండి వంటలు తయారు చేసే పనిలో బిజీగా ఉంటారు. ఈ బిజీ షెడ్యూల్లో అన్నం, కర్రీ వేర్వేరుగా కుక్ చేసే అవసరం లేకుండా ఈజీగా ఉండే ఇలాంటి రెసిపీ ట్రై చేశారంటే మీకు పని తగ్గిపోతుంది, పైగా టేస్టీగా ఉంటుంది కూడా. వేడిగా, పుల్ల పుల్లగా ఆస్వాదించవచ్చు. ఇది పులిహోర మాత్రం కాదు! సరిగ్గా అలాంటిదే కానీ, కర్ణాటక స్టైల్ చిత్రాన్నం. ఇక్కడ ఇచ్చిన పదార్థాలు వాడుతూ తయారు చేశారంటే అస్సలు మిగల్చరు.
"సేమియా ఉప్మా" పిల్లలు నచ్చట్లేదా? - ఓ సారిలా మార్చి చేశారంటే ఇష్టంగా తింటారు!

కావల్సిన పదార్థాలు :
- బియ్యం - అర కేజీ
- నూనె - 3 స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- దాల్చిన చెక్క - 1 ఇంచు
- ఆవాలు - అర స్పూన్
- లవంగాలు - 3
- కరివేపాకు - 1 రెమ్మ
- జీలకర్ర - అర స్పూన్
- పచ్చి కొబ్బరి - 1 టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి - 2
- అల్లం - కొద్దిగా
- కొత్తిమీర - కొద్దిగా
- వేరుశనగలు - 1 టేబుల్ స్పూన్
- జీడిపప్పు - 8
- శనగపప్పు - అర స్పూన్
- మినప్పప్పు - అర స్పూన్
- ఎండుమిర్చి - 2
- ఇంగువ - కొద్దిగా
- ఉల్లిపాయ - 1
- పసుపు - పావు స్పూన్
- నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం :
- ముందుగా బియ్యం శుభ్రం చేసుకుని కుక్కర్లోకి తీసుకోవాలి. ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకుని నూనె, ఉప్పు వేసుకుని కలపాలి. నీళ్లలో నూనె, ఉప్పు వేయడం వల్ల అన్నం పొడి పొడిగా ఉడుకుతుంది.

- ఇపుడు మిక్సీలో ఆవాలు, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చి కొబ్బరి , పచ్చిమిర్చి, అల్లం, కొత్తమీర వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్ చేసుకుని తీసుకోవాలి.
- స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసి వేరుశనగలు, జీడిపప్పు వేయించాలి. ఆ తర్వాత అందులోనే ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకుని మిర్చి నల్ల బడే వరకు వేయించాలి. తాలింపు గింజలు ఎర్రగా వేయించగానే జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి.

- ఇపుడు సన్నగా, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు వేసుకుని వేయించిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన మసాలా ముద్ద వేసుకుని తడి పోయే వరకు సన్నటి మంటపై అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలి.

- ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని కలిపి ముందుగా ఉడికించుకుని చల్లార్చుకున్న అన్నం వేసుకోవాలి. పైన కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి మంట హై ఫ్లేమ్‌లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. అంతే! చిత్రాన్నం రెడీ. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండితే చాలు! ఒక్కొక్క ముద్ద తింటుంటే కమ్మగా ఉంటుంది.
రాగిపిండితో కరకరలాడే "గవ్వలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!
నోట్లో వేసుకోగానే కరిగిపోయే "అరిసెలు" - ఈ సంక్రాంతికి ఇంట్లోనే తియ్యని వేడుక చేసుకోండి! !

