చికెన్ స్టఫింగ్తో "మిర్చి బజ్జీలు" - కిర్రాక్ టేస్ట్‌తో అద్దిరిపోతాయి!
-చికెన్‌తో రెగ్యులర్ కర్రీలే వండుకుంటున్నారా? - ఇలా ఓసారి స్నాక్ ప్రిపేర్ చేయండి, అద్భుతమే!

Published : February 25, 2026 at 12:36 PM IST
Chicken Mirchi Bajji: ఈవెనింగ్ టైమ్ స్నాక్స్‌లో బజ్జీలు తప్పకుండా ఉంటాయి. మెజార్టీ పీపుల్ వీటిని ఇష్టంగా తింటుంటారు. అయితే బజ్జీలు అంటే నార్మల్‌గా చేసుకునే ప్రాసెస్ మాత్రమే అందరికీ తెలిసినది. కానీ మీకు తెలుసా? చికెన్ స్టఫింగ్తో కూడా అద్దిరిపోయే బజ్జీలు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పైన కరకరలాడుతూ లోపల జ్యూసీ చికెన్‌తో నాలుకకు సరికొత్త రుచి తెలుస్తుంది. తయారు చేసుకోవడం కూడా ఈజీనే. అటు బజ్జీ లవర్స్‌కు, ఇటు నాన్‌వెజ్ లవర్స్‌కు ఈ స్నాక్ కిర్రాక్ అని చెప్పొచ్చు. మరి లేట్ చేయకుండా నోరూరించే చికెన్ బజ్జీలు ఎలా చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
చికెన్ ఉడికించడానికి:
- బోన్‌లెస్ చికెన్ - 200 గ్రాములు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- పసుపు - పావు టీస్పూన్
- కారం -1 టీస్పూన్
- ఉప్పు - 1 టీస్పూన్
- మిరియాల పొడి - పావు టీస్పూన్

స్టఫింగ్ కోసం:
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- ఉల్లిపాయ - 1
- మిర్చి - 2
- అల్లం- చిన్న ముక్క
- వెల్లుల్లి రెబ్బలు - 3
- టమాటాలు - 2
- కారం - 1 టీస్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- జీలకర్ర పొడి - 1 టీస్పూన్
- గరం మసాలా - అర టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర - కొద్దిగా
బజ్జీల పిండి కోసం:
- బజ్జీ మిరపకాయలు - కొన్ని
- శనగపిండి - 2 కప్పులు
- ఉప్పు - కొద్దిగా
- కారం - 1 టీస్పూన్
- వాము - అర టీస్పూన్

తయారీ విధానం:
- చికెన్ బాయిల్ చేసుకోవాలి. కుక్కర్ గిన్నెలో శుభ్రంగా కడిగిన చికెన్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి వేసి 1 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి విజిల్ సెట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- కుక్కర్ ఆవిరి పోయినాక మూత తీసి ఉడికిన చికెన్ ముక్కలను ఓ గిన్నెలోకి తీసుకోవాలి. చికెన్ కాస్త చల్లారినాక చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చికెన్ ఉడికించిన మిగిలిన నీటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.

- స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లిపై పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బల తురుము వేసి కలుపుతూ వేయించాలి.
- ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి మారినాక టమాటా ముక్కలు వేసి ఉడికించాలి.
- టమాటాలు మెత్తగా ఉడికినాక కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలిపి ఫ్రై చేయాలి.

- మసాలాలు మగ్గినాక ఉడికించిన చికెన్ తరుగు వేసి కలిపి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేయాలి.
- అనంతరం అందులోకి చికెన్ ఉడికించిన నీటిని వేసుకుని మరో రెండు నిమిషాలు కుక్ చేసి చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఇప్పుడు బజ్జీ మిరపకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. అనంతరం ఓ మిర్చి తీసుకుని మధ్యకు ఘాటు పెట్టి అందులోని గింజలు తీసేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన వాటిని చేయాలి.
- ఇప్పుడు గింజలు తీసేసిన మిరపకాయల్లోకి చికెన్‌ను స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిలో పెట్టి పక్కన ఉంచాలి.

- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఈలోపు వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి శనగపిండి, ఉప్పు, కారం, వాము వేసి కలిపి కొద్దికొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి.
- బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టఫ్ చేసిన ఓ మిరపకాయను పిండిలో ముంచి అంతా పట్టేలా కోట్ చేసినాక తీసి కాగుతున్న నూనెలో వేసుకోవాలి.
- ఈ విధంగా కడాయికి సరిపడా బజ్జీలను పిండిలో ముంచి వేసుకోవాలి. అనంతరం మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన వాటిని ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చికెన్ మిర్చి బజ్జీలు రెడీ.

బండి మీద అమ్మే రుచితో కరకరలాడే "పకోడీ" - పిండి కలపడంలోనే అసలు సీక్రెట్!
జొన్నలు, మినప్పప్పు కాంబోలో "వడలు" - చాలా టేస్టీగా ఉంటాయి - తయారీ ఈజీ!

