నోటికి ఏం తినబుద్ధి కావట్లేదా? - ఇలా "క్యారెట్ రసం" చేసుకోండి! - రుచి అద్భుతం!
వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోయే 'క్యారెట్ రసం' - సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండిలా!

Published : January 10, 2026 at 4:16 PM IST
Carrot Rasam Recipe in Telugu : ఈ సీజన్లో చాలా మంది వేడి వేడి అన్నంలో రసం, చారు వంటి వాటితో తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటివి చేసినప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు. ఈ క్రమంలోనే నార్మల్‌గా ఎక్కువ మంది టమాటా రసం, మిరియాల రసం, అల్లం రసం వంటివి చేసుకుంటుంటారు. అవి మాత్రమే కాకుండా మీరు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే మరో అద్భుతమైన రసం రెసిపీ ఉంది. అదే, నోరూరించే "క్యారెట్ రసం".
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్, ఉల్లిపాయ పేస్ట్ కలయికలో తయారయ్యే ఈ రసం సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే, దీని తయారీకి ఎక్కువ పదార్థాలూ అవసరం లేదు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే అప్పటికప్పుడు చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. క్యారెట్లను నేరుగా తినడానికి ఇష్టపడని పిల్లలకూ ఇలా రసం చేసి పెడితే భలే ఇష్టంగా తింటారు. మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ రసం ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
ఉల్లిపాయ మిర్చి పేస్ట్ కోసం :
- రెండు - ఉల్లిపాయలు
- మూడ్నాలుగు - పచ్చిమిర్చి
- ఐదు - వెల్లుల్లి రెబ్బలు
- రెండు - ఎండుమిర్చి
- రెండు రెబ్బలు - కరివేపాకు
- కొద్దిగా - జీలకర్ర
- కొన్ని - పుదీనా ఆకులు
- రుచికి తగినంత - ఉప్పు, కారం
రసం తయారీ కోసం :
- క్యారెట్లు - మూడు
- మినప్పప్పు - ఒక చెంచా
- జీలకర్ర - చిటికెడు
- కరివేపాకు - కొద్దిగా
- పసుపు - చిటికెడు
- చింతపండు - నిమ్మకాయంత
- ఉప్పు, కారం - టేస్ట్‌కి సరిపడా
టిఫెన్స్లోకి కిర్రాక్ "కొబ్బరి కొత్తిమీర చట్నీ" - తక్కువ పదార్థాలతో నిమిషాల్లోనే రెడీ!

తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ రసం రెసిపీ కోసం ముందుగా మీరు తినే పులుపును బట్టి ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు తీసుకుని శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసి కాసేపు నానబెట్టాలి.
- చింతపండు నానేలోపు తాజా క్యారెట్లను తీసుకుని శుభ్రంగా కడిగి గ్రేటర్‌తో సన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి.
- అలాగే, ఉల్లిపాయలను పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
- అనంతరం రెసిపీలోకి అవసరమైన ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్‌ని సిద్ధం చేసుకోవాలి.

- ఇందుకోసం మిక్సీ జార్ తీసుకుని దానిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కరివేపాకు, కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా ఉప్పు, కారం వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసాన్ని మీరు తినే పులుపును బట్టి తగినన్ని నీళ్లు పోసి పల్చగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం రసం తయారీకి స్టవ్ మీద కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
- అవి దోరగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సన్నని క్యారెట్ తురుమును వేసి సన్నని మంట మీద కాసేపు వేయించాలి.
- క్యారెట్ తురుము పచ్చివాసన పోయి ఆయిల్లో కాస్త మగ్గిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ మిర్చి పేస్ట్ మిశ్రమాన్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి.
- తర్వాత పసుపు వేసి కలిపి ఉల్లిపాయ మిశ్రమంలోని పచ్చివాసన పోయేలా కొద్దిసేపు కలుపుతూ వేయించుకోవాలి.

- క్యారెట్-ఉల్లిపాయ మిశ్రమం మంచిగా మగ్గిన తర్వాత అందులో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం, రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకుని కలిపి మరిగించుకోవాలి.
- రసం మిశ్రమం బాగా మరిగి సెగలు కక్కుతున్నప్పుడు చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు.
- అంతే, సూపర్ టేస్టీగా ఉండే "క్యారెట్ రసం" అప్పటికప్పుడు తయారవుతుంది!
- మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ పద్ధతిలో క్యారెట్ రసం చేసుకుని చూడండి. ఇంటిల్లిపాదీ ఆహా ఏమి రుచి అంటూ భలే ఇష్టంగా తింటారు.
ఘుమఘుమలాడే "టమాటా రసం" - ఈ పొడితో ఒక్కసారి చేసుకుంటే టేస్ట్ అస్సలు మర్చిపోలేరు!
తెలంగాణ స్టైల్ "టమాటా పప్పు" - వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఆహాఁ!

