ద్రాక్షపండ్లతో "క్యాండీలు" - ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది!
ద్రాక్షపండ్లతో సింపుల్‌గా చేసుకునే రెసిపీ - ఓసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 28, 2026 at 12:18 PM IST
Candy Grapes Recipe in Telugu : ద్రాక్షపండ్లను అందరూ ఇష్టపడతారు. వీటిని నేరుగా తింటారు. లేదంటే వీటితో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. అందుకే ఇవాళ మీకోసం ఓ కొత్త వంటకాన్ని పరిచయం చేస్తున్నాం. అదే ద్రాక్షపండ్లతో క్యాండీలు. దీనిని చాలా తక్కువ పదార్థాలతో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈ పద్ధతిని పాటిస్తూ ఈజీగా చేసుకోవచ్చు. వీటిని ఒక్కసారి చేసుకుని స్టోర్ చేసుకుంటే రెండు నెలలు హ్యాపీగా తినొచ్చు! మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
సమ్మర్లో ఒంటికి చలువ చేసే " బార్లీ పాయసం" - రుచి చూస్తే వదలరంతే!

కావాల్సిన పదార్థాలు :
- ద్రాక్షపండ్లు - 2 కిలోలు
- పంచదార పొడి - 4 స్పూన్లు
- పంచదార - 600 గ్రాములు
- ఉప్పు - 2 చిటికెడ్లు
- నిమ్మరసం - 4 టేబుల్ స్పూన్లు
- మిరియాల పొడి - 1 స్పూన్
- యాలకుల పొడి - 1 స్పూన్

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా రెండు కిలోల ద్రాక్షపండ్లను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. పండ్లు మరీ పెద్దగా ఉంటే సగానికి కట్ చేసుకోవాలి
- ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ద్రాక్షపండ్ల ముక్కలు, 600 గ్రాముల పంచదార వేసి కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయానికి పండ్లలో నీరు ఊరుతుంది.

- అనంతరం స్టవ్ ఆన్ చేసి పాన్‌లో నానబెట్టిన ద్రాక్షపండ్ల మిశ్రమం, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. పాకం చిక్కగా అయ్యాక రెండు చిటికెడ్ల ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్ల నిమ్మరసం యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అనంతరం ద్రాక్ష పండ్లను ప్లేట్లో వేసి మూడు రోజులు ఎండబెట్టాలి. ఇవి పూర్తిగా ఎండాక ఆపై నాలుగు స్పూన్ల పంచదార పొడి చల్లాలి. ఇలా చేయడం వల్ల ఒకదానికొకటి అతుక్కోవు.

- అంతే ద్రాక్షపండ్లతో నోరూరించే క్యాండీలు మీ ముందుంటాయి!
- ఈ క్యాండీలను గ్లాస్ జార్లో వేసి బయట పెడితే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి! ఫ్రిడ్జ్‌లో పెడితే రెండు నెలల పాటు తాగా ఉంటాయి!

- మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఓసారి ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు, పెద్దలూ భలే ఇష్టంగా తింటారు.
- మీరు ఈ రెసిపీని ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే ద్రాక్షపండ్లతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
చిట్కాలు :
- పంచదారకు బదులు బెల్లాన్ని వాడొచ్చు. బెల్లం అయితే మరో 20 గ్రాములు అదనంగా తీసుకోవాలి.
- ఈ క్యాండీలను మీరు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ ఫుడ్ కలర్‌ను ఉపయోగించి చేసుకోవచ్చు. అసలు ఫుడ్ కలరే వద్దనుకుంటే నేరుగా చేసేయోచ్చు.
నోరూరించే "చాకోబార్ ఐస్‌క్రీమ్" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!
అమ్మమ్మల కాలం నాటి "గోంగూర కోడిగుడ్డు కూర" - నోటికి కొత్త రుచినిస్తుంది!

