"క్యాబేజీ, కోడిగుడ్డు ఫ్రై" - అప్పటికప్పుడు చేసుకునే అద్భుతమైన రెసిపీ!
క్యాబేజీ నచ్చని వారికి ఇలా చేసి పెట్టండి - కొద్దిగ కూడా మిగల్చరు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 25, 2026 at 10:57 AM IST
Cabbage Egg Recipe : టైం లేనపుడు, అప్పటికప్పుడు ఏదైనా రుచిగా తినాలనిపిస్తే కోడిగుడ్లు గుర్తొస్తుంటాయి. ఉల్లిపాయలు కట్ చేసుకుని గుడ్లు కొట్టి, ఉప్పు, కారం, మసాలాలు వేస్తే చాలు! ఘుమఘుమలాడే కర్రీ చిటికెలో రెడీ అవుతుంది. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా క్యాబేజీ ఇష్టపడని వాళ్లకు ఇలాంటి క్యాబేజీ, కోడిగుడ్డు పొరటు చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. చపాతీల్లోకి, వేడి వేడి అన్నంలోకి ఈ పొరటు అద్భుతంగా ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీ ఓ సారి ట్రై చేసి టేస్ట్ చెక్ చేయండి.
'జీడిపప్పు, కాకరకాయ కారం ఫ్రై' - ఇలా చేశారంటే పిల్లలూ ఇష్టంగా తింటారు!

కావల్సిన పదార్థాలు :
- క్యాబేజీ - 200 గ్రాములు
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - అర స్పూన్
- జీలకర్ర - అర స్పూన్
- ఉల్లిపాయ - 1
- పచ్చి మిర్చి - 3
- కరివేపాకు - 2 రెమ్మలు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - 2 స్పూన్లు
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
- గరం మసాలా - అర స్పూన్
- కొత్తిమీర - కొద్దిగా
- కసూరి మేతి - కొద్దిగా

తయారీ విధానం :
- ముందుగా క్యాబేజీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర శుభ్రం చేసుకుని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇపుడు స్టవ్ వెలిగించి వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి. నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు, కరివేపాకుతో పాటు ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కలపాలి.

- ఉల్లి తరుగు మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలపాలి. ఉల్లిపాయలు మెత్తబడి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యాబేజీ తురుము వేసుకుని సన్నటి మంటపై వేయించాలి. దాదాపు 10 నిమిషాల పాటు మూతపెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి.

- ఆ తర్వాత మూత తీసుకుని పసుపు, కారం, ధనియాల పొడి వేసుకుని కలపాలి. ఇపుడు ఓ గిన్నెలోకి కోడిగుడ్లు పగలగొట్టి తీసుకోవాలి. నేరుగా కడాయిలోనే కొట్టడం వల్ల కొన్నిసార్లు పెంకులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా ఓ గిన్నెలోకి తీసుకుని కర్రీలో వేసుకోవాలి.
- వెంటనే కలపకుండా మూతపెట్టుకుని 3 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత గరిటె తీసుకుని మృదువుగా కలపాలి. ఆ తర్వాత 3నిమిషాలు ఉడికించి కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర తరుగు, కసూరి మేతి వేసి కలిపితే చాలు! అంతే! క్యాబేజీ, కోడిగుడ్డు పొరటు రెడీ!
ఆంధ్రా, తమిళనాడు మిక్స్డ్ రెసిపీ - నోరూరించే "చంద్రముఖి చికెన్"
'గంజి' కదా అని వదిలేస్తున్నారా? - ఉపవాసం టైంలో ఇలా చేశారంటే ఆరోగ్య ప్రయోజనాలు!

