ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? - నిమిషాల్లో రవ్వతో "బన్ దోశలు" చేసుకోండి!
- బ్రేక్‌ఫాస్ట్‌లోకి అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ - చట్నీ లేకుండానే హ్యాపీగా తినేయొచ్చు!

Published : October 30, 2025 at 9:30 AM IST
Bun Dosa Recipe in Telugu : మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏం చేసుకోవాలో తోయనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఒక సూపర్ రెసిపీ ఉంది. ఇందుకోసం పప్పు నానబెట్టి, మిక్సీ పట్టాల్సిన పనిలేదు. తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో నిమిషాల్లోనే ఇన్‌స్టంట్‌గా తయారయ్యే ఈ రెసిపీని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే, సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ "రవ్వ బన్ దోశలు".
ఇంట్లో టైమ్‌కు ఇడ్లీ, దోశ పిండి లేనప్పుడు ఇవి సూపర్ ఆప్షన్‌గా నిలుస్తాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే వీటిని పిల్లలైతే ఒకటికి రెండు ఇష్టంగా తింటారు. అలాగే, రెగ్యులర్ రెసిపీలతో పోల్చితే డిఫరెంట్ రుచిని ఆస్వాదిస్తారు. మరి, లేట్ చేయకుండా ఈ రుచికరమైన బన్ దోశలను ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటి? అన్నది ఇప్పుడు చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- ఒక కప్పు - బొంబాయి రవ్వ
- అర కప్పు - పెరుగు
- రుచికి తగినంత - ఉప్పు
తాలింపు కోసం :
- నూనె - ఒకటిన్నర చెంచాలు
- ఇంగువ - పావుచెంచా
- ఆవాలు - అరచెంచా
- పచ్చిమిర్చి - రెండు
- సన్నని అల్లం తరుగు - రెండు చెంచాలు
- సన్నని ఉల్లిపాయముక్కలు - పావు కప్పు
- కరివేపాకు - రెండు రెమ్మలు
- కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు
- బేకింగ్ సోడా - చిటికెడు
- ఆయిల్ - కొద్దిగా(దోశపై వేసుకోవడానికి)
కరకరలాడే "బ్రెడ్ వడలు" - ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు - టేస్ట్ కిర్రాక్ అంతే!

తయారీ విధానం :
- ఈ ఇన్స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో బొంబాయి రవ్వ, పెరుగు, రుచికి తగినంత ఉప్పు వేసి అన్నింటినీ బాగా కలిపి పావుగంటపాటు పక్కన పెట్టేయాలి.
- ఆలోపు రెసిపీలోకి అవసరమైన పరిమాణంలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరను సన్నగా తరుక్కుని రెడీగా ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో రెండు చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.
- అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ, కొత్తిమీర తరుగు వేసుకుని మంచి సువాసన వచ్చేంతవరకూ కలుపుతూ వేయించుకోవాలి.

- తాలింపు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని పావుగంట పాటు పక్కనుంచిన బొంబాయి రవ్వ, పెరుగు మిశ్రమంలో వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులో చివరిగా బేకింగ్‌సోడా కూడా జత చేసి మరోసారి మిశ్రమం మొత్తం చక్కగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- అయితే, ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా, పలచగా కాకుండా కొద్దిగా నీళ్లు పోసి మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలా రెడీ చేసుకుని పక్కనుంచాలి.
- అనంతరం స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. పెనం వేడయ్యాక కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి.
- తర్వాత దానిపై ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒకట్రెండు గరిటెలు తీసుకుని మందంగా ఉండే అట్టులా వేసుకోవాలి.
- అలా వేసుకున్నాక దానిపై మూత పెట్టి లో టూ మీడియం ఫ్లేమ్‌లో వన్ సైడ్ ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి.
- అది వన్ సైడ్ మంచిగా కాలిన తర్వాత రెండో వైపునకు తిరగేసి అటువైపు కూడా మంచిగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే చాలు. అంతే, బొంబాయి రవ్వతో సూపర్ టేస్టీగా ఉండే "బన్ దోశ" నిమిషాల్లోనే రెడీ అవుతుంది!
- వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో చట్నీ లేకుండానే హ్యాపీగా తినేయొచ్చు. ఒకవేళ కావాలనుకుంటే పల్లీ, టమాటా చట్నీతో తినవచ్చు.
- మరి, నచ్చితే మీరూ ఓసారి రవ్వతో ఉప్మా కూడా తాలింపుతో ఇలా బన్ దోశలు ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు!
చుక్క నూనె లేకుండా "దోశలు" - హెల్దీగా, టేస్టీగా!
మైదా లేకుండానే కరకరలాడే "పునుగులు" - చల్లని వేళ తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!

