భోగి స్పెషల్: కమ్మని "స్వీట్ పులగం" - పల్లీలు, నువ్వులు వేసి చేస్తే సూపర్ టేస్ట్!
-భోగి రోజు బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే కమ్మని "పులగం" - తక్కువ పదార్థాలతో అద్భుతమైన రుచి!

Published : January 13, 2026 at 11:47 AM IST
Bhogi Special Pulagam Recipe: తెలుగు లోగిళ్లు ఎంతో ఇష్టంగా ఎదురు చూసే సంక్రాంతి రానే వచ్చింది. ఈ మూడు రోజుల పండుగలో మొదటిది భోగి. భోగభాగ్యాలను ప్రసాదించే ఈ పర్వదినం నాడు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు భోగి మంటలు వేసుకుంటుంటారు. ఇక సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా భోగి రోజు ఓ ప్రత్యేకమైన నైవేద్యాన్ని కూడా తయారు చేస్తారు. అదే పులగం. పల్లీలు, బెల్లం, బియ్యం కాంబినేషన్లో తయారు చేసే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా సులువే. మొదటి సారు చేసే వారు అయినా సరే మంచి రుచితో అద్భుతంగా చేస్తారు. మరి లేట్ చేయకుండా కమ్మని పులగం ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- బియ్యం - 1 కప్పు
- పల్లీలు - 2 టేబుల్‌స్పూన్లు
- నువ్వులు - 2 టేబుల్‌స్పూన్లు
- పాలు - 3 కప్పులు
- బెల్లం - 2 కప్పులు
- యాలకుల పొడి - అర టీస్పూన్
- నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం:
- ఓ గిన్నెలోకి కప్పు బియ్యం తీసుకుని రెండుమూడు సార్లు వాటర్‌తో శుభ్రంగా కడగాలి. అనంతరం సరిపడా నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి.
- ఈలోపు స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టి పల్లీలు వేసి లో ఫ్లేమ్‌లో వేయించాలి. పల్లీలు మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఓ ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

- అదే కడాయిలోకి నువ్వులు వేసి వేయించాలి. సెపరేట్‌గా స్టవ్ ఆన్ చేయాల్సిన పనిలేదు. కడాయి వేడికి నువ్వులు ఫ్రై అవుతాయి.
- నువ్వులు పర్ఫెక్ట్గా వేగాక వీటినీ తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. అదే విధంగా కావాల్సిన పరిమాణంలో బెల్లాన్ని సన్నగా తురుముకుని పక్కన ఉంచాలి.

- మిక్సీజార్‌లోకి వేయించిన పల్లీలు, నువ్వులు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి అందులో నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు లేకుండా వేయాలి.
- అనంతరం బియ్యంలోకి మూడు కప్పుల పాలు, కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మెత్తగా ఉడికించాలి.

- అన్నం మెత్తగా అయ్యి దగ్గరపడుతున్నప్పుడు బెల్లం తురుము వేసుకోవాలి. ఓ రెండు నిమిషాల తర్వాత బెల్లాన్ని కరిగించుకుంటూ ఉడికించాలి.
- బెల్లం పూర్తిగా కరిగి దగ్గరపడినాక గ్రైండ్ చేసిన పల్లీలు నువ్వుల పొడి, యాలకుల పొడి వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని ఓ రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- చివరగా నెయ్యి వేసి అంతా కలిసేలా కలిపి సర్వ్ చేసుకుంటే టేస్టీ పులగం రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- పల్లీలు, నువ్వులను కేవలం లో ఫ్లేమ్‌లో మాత్రమే దోరగా వేయించాలి. ఇవి మరీ ఎక్కువగా వేగి మాడితే పులగం రుచి మారుతుంది.
- అన్నాన్ని వీలైనంత మెత్తగా ఉడికించాలి. అప్పుడే పులగం మంచి రుచికరంగా వస్తుంది.
- అన్నం ఉడికిన తర్వాత బెల్లం వేసిన వెంటనే కదపకూడదు. వెంటనే మిక్స్ చేస్తే పాలు విరిగే అవకాశం ఉంటుంది. వేసిన ఓ రెండు నిమిషాల తర్వాత మిక్స్ చేసుకుంటే పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు.
భోగి స్పెషల్ : నోరూరించే "స్వీట్ పొంగల్" - చల్లారినా గట్టి పడదు, టేస్ట్ అద్దిరిపోతుంది!
కందిపప్పుతో పప్పు, సాంబార్ రొటీన్ - ఇలా "పచ్చడి" చేయండి! - టేస్ట్ సూపర్!

