ఈ నెంబర్ ప్లేట్ ఉంటే దేశంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చు! - ఎలా పొందాలో తెలుసా?
- 2021లో భారత్ సిరీస్ నెంబర్ ప్లేట్‌ను తీసుకొచ్చిన రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వశాఖ - ఈ నెంబర్ ప్లేట్ ఉంటే వేర్వేరు రాష్ట్రాల్లో నివసించినా ఇబ్బంది ఉండదు!

Published : March 4, 2026 at 1:56 PM IST
Bharat Series Number Plate: ఉద్యోగరీత్యా కొందరు వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ నివసిస్తుంటారు. లేదంటే కొద్ది వ్యవధిలోనే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. కాగా ఇలా రాష్ట్రం మారిన ప్రతిసారీ తమ పర్సనల్ బండిని రీ-రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. దీనికి అదనపు ఖర్చుతోపాటు సమయం కూడా వృథా అవుతుంది. అయితే, భారత్ సిరిస్ నెంబర్ ప్లేట్ తీసుకుంటే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. స్టేట్ మారినా కూడా వాహనం రీ-రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంతకీ బీహెచ్ సిరీస్ అంటే ఏంటి? దీనివల్ల లాభాలేంటి? అర్హులెవరు? బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్‌ను ఎలా పొందాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
బీహెచ్ సిరీస్ అంటే ఏమిటి?: భారత్ సిరీస్ నెంబర్ ప్లేట్ సేవను రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వశాఖ 2021లో ప్రారంభించింది. వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేసే ఉద్యోగుల వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈజీ చేసేందుకు దీనిని ప్రవేశపెట్టింది. రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ అయిన నెంబర్ ప్లేట్లతో పోలిస్తే బీహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్ కాస్త భిన్నంగా ఉంటుంది. దీనిలోని అంకెల అమరిక కూడా వేరుగా ఉంటుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసిన సంవత్సరం, బీహెచ్ సిరీస్, రిజిస్ట్రేషన్ నంబర్, సెగ్మెంట్ ఆధారంగా 2 ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఉదాహరణకు 23 BH 3282 AB అనేది ఒక కారు నంబర్ అనుకుంటే.. ఈ వాహనం 2023లో భారత్ సిరీస్‌లో రిజిస్టర్ అయినట్లు అర్థం. 3282 అంకెలు రిజిస్ట్రేషన్ నంబర్. చివరి ఆంగ్ల అక్షరాలను ర్యాండమ్‌గా కేటాయిస్తారు.
బీహెచ్ సిరీస్ వల్ల లాభాలు:
- ఒక స్టేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఉన్న వాహనంతో మీరు వేరే రాష్ట్రంలో నివసించడానికి వెళ్లినట్లయితే సంవత్సరం లోపు మీ వాహన రిజిస్ట్రేషన్‌ను మార్చుకోవాలి. అదే బీహెచ్ సిరీస్ తీసుకుంటే దేశమంతటా చెల్లుబాటవుతుంది. మళ్లీ విడిగా రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. స్టేట్ మారినా ఇబ్బంది ఉండదు.
- ఒకవేళ మీరు వాహనాన్ని వేరే రాష్ట్రాల వ్యక్తులకు అమ్మాలని అనుకున్నా ఇబ్బంది ఉండదు.
- ఈ సిరీస్ నెంబర్ ప్లేట్ ఉంటే ప్రమాదాలు, దొంగతనం జరిగినప్పుడు యజమానిని ఈజీగా గుర్తించవచ్చు.
- స్టేట్ నెంబర్ ప్లేట్‌తో కొత్త కారు కొన్నప్పుడు 15 సంవత్సరాల రోడ్డు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే బీహెచ్ సిరీస్ తీసుకున్నట్లయితే రెండేళ్లకోసారి రోడ్డు పన్ను చెల్లించాలి.
ఈ నెంబర్ ప్లేట్ పొందడానికి ఎవరు అర్హులు?
- కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు
- ప్రభుత్వం లేదా ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులు
- రక్షణ సిబ్బంది, పరిపాలనా సేవల ఉద్యోగులు
- ప్రైవేటు ఎంప్లాయీస్ కూడా ఈ నెంబర్ ప్లేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు పనిచేసే సంస్థ కనీసం నాలుగు రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రర్ అయి ఉండాలి.
కావాల్సిన పత్రాలు:
- అఫీషియల్ ఐడీ కార్డ్
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- వాహన పత్రాలు
- వాహన కాలుష్య ధ్రువీకరణ పత్రం (పీయూసీ)
- ప్రైవేట్ ఉద్యోగులైతే ఫారం 60
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- వెహికల్ ఓనర్ Vahan పోర్టల్లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆథరైజ్డ్ ఆటోమొబైల్ డీలర్ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.
- రవాణాశాఖ అధికారులు వివరాలు పరిశీలించి బీహెచ్ ప్లేట్‌ను మంజూరు చేస్తారు.
- ఆర్టీవో నుంచి ఆమోదం పొందిన తర్వాత మోటారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
లక్షలు పలికే "ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్" అసలు ధర ఎంత? - ఎలా కొనుగోలు చేయాలి?

