జిగురు లేకుండా "బెండకాయ పచ్చడి" - రోటి పచ్చడిలా అద్భుతంగా ఉంటంది!
బెండకాయ పచ్చడి - కమ్మగా, కారంగా వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!
bendakaya_pachadi (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 12, 2026 at 4:01 PM IST
BENDAKAYA PACHADI : బెండకాయ చాలా మందికి ఎంతో ఇష్టమైన కూరగాయ. బెండకాయ ఎంత జిగురు ఉన్నా చాలా మంది పులుసు, ఫ్రై, కర్రీ చేస్తుంటారు. పల్లీలు వేసి చేసే క్యాటరింగ్ స్టైల్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అయితే, ఎపుడైనా బెండకాయ రోటి పచ్చడి ట్రై చేశారా? చాలా అద్భుతంగా ఉంటుంది. మిక్సీలో చేసుకున్నా సరే రోటి పచ్చడిలా అనిపిస్తుంది. ఓ సారి సింపుల్‌గా ఇలా ట్రై చేసి చూడండి.
పల్లెటూరు "కాకా హోటల్ చట్నీ రెసిపీ" సీక్రెట్ ఇదే! - ఇడ్లీ, దోసెల్లోకి ఇది కమ్మగా ఉంటుంది!

కావల్సిన పదార్థాలు :
- మెంతులు - పావు స్పూన్
- ఆవాలు - అర స్పూన్
- జీలకర్ర - అర స్పూన్
- ధనియాలు - 1 స్పూన్
- ఎండు మిర్చి - కారానికి సరిపడా
- బెండకాయలు - పావు కేజీ
- వెల్లుల్లి - 6
- చింతపండు - కొద్దిగా
- కొత్తిమీర - కొద్దిగా
- కరివేపాకు - 1 రెమ్మ
- టమోటాలు - 2
- పసుపు - పావు స్పూన్
- పోపు కోసం :
- నూనె - 1 టేబుల్ స్పూన్
- ఆవాలు - అర స్పూన్
- ఎండు మిర్చి - 3
- వెల్లుల్లి - 4
- కరివేపాకు - 1 రెమ్మ

తయారీ విధానం :
- ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. ఆ తర్వాత కారాన్ని బట్టి ఎండు మిర్చి వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో మంచి రంగు వచ్చే వరకు ఎండు మిర్చి తుంచగానే తునిగిపోయే వరకు వేయించుకుని చల్లారాక మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పొడి చేసుకుని పెట్టుకోవాలి.

- ఇపుడు అదే ప్యాన్‌లోకి చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు తీసుకోవాలి. వీటిని ముందుగానే శుభ్రం చేసుకుని తడి లేకుండా క్లాత్‌తో తుడిచి తీసుకోవాలి. తడి ఉంటే జిగురు వస్తుందని గుర్తుంచుకోండి.నూనె వేయకుండానే హై ప్లేమ్‌లో వేయించాలి. జిగురు తగ్గిన తర్వాత వెల్లుల్లి, చింతపండు, కొత్తిమీర వేసుకుని వేయించాలి. ఆ తర్వాత ఓ కరివేపాకు రెమ్మ వేసుకుని మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి.

- బెండకాయ ముక్కలు రంగు మారిన తర్వాత 2 టమోటాలను సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇపుడు మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఐదారు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి పక్కకు తీసుకుని చల్లార్చుకోవాలి. ఇపుడు ఎండుమిర్చి, ధనియాలు గ్రైండ్ చేసిన మిక్సీలోకి తీసుకుని రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కాకుండా రెండు, మూడు పల్స్ ఇస్తే రోటి పచ్చడి టేస్ట్ ఇస్తుంది.

- ఇపుడు పోపు రెడీ చేసుకోవాలి. అదే ప్యాన్‌లో నూనె వేసుకుని ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండు మిర్చి, ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకుని చట్నీలో కలిపేస్తే సరిపోతుంది.
"కారం పొడులు" మీకు ఇష్టమా? - ఇలాంటి "పుదీనా కారం పొడి" సింపుల్‌గా చేసేయండి!

