ETV Bharat / offbeat

పోగొట్టుకున్న డబ్బుకూ "ఇన్సూరెన్స్" - కొత్తగా పాలసీలు ప్రకటించిన సంస్థలు!

డిజిటల్‌ పేమెంట్‌ ప్రొటెక్షన్‌ పాలసీతో ధీమా! - మీ డబ్బుకు భరోసా!

digital_payments
digital_payments (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 29, 2026 at 10:25 AM IST

2 Min Read
Choose ETV Bharat

DIGITAL PAYMENTS INSURANCE : కూరగాయలు కొన్నా, కిరాణా సరుకులైనా! కరెంటు బిల్లు, కారులో పెట్రోల్! ఇలా ఏది కొనుగోలు చేసినా, బిల్లు చెల్లింపులైనా ఫోన్​ ద్వారా పని సులువుగా పూర్తయిపోతోంది. చిల్లర సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు నగదు రహిత చెల్లింపులు వేగంగా జరిగిపోతున్నాయి. "నాణేనికి మరోవైపు" ఉన్నట్టు ఈ ఆన్​లైన్ చెల్లింపుల్లో మోసాలూ పెరుగుతున్నాయి. మన ప్రమేయం లేకుండానే మన బ్యాంకు ఖాతాలో సొమ్మును ఆన్​లైన్ సాంకేతికత ఉపయోగించి అడ్డంగా దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ నేపథ్యంలో మీ సొమ్ము భద్రతకు హామీ ఇస్తూ బ్యాంకులు, బీమా, ఆర్థిక సంస్థలు డిజిటల్‌ పేమెంట్‌ ప్రొటెక్షన్‌ పాలసీలను అమలు చేస్తున్నాయి. వ్యక్తికి జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా మాదిరిగానే ఇవి కూడా వర్తిస్తాయి.

"ఎవరెస్ట్​"పై గురి పెట్టిన 'సిరి' - ఉమ్లింగ్ లా పాస్‌'ను అధిరోహించిన మూడో తరగతి చిన్నారి!

వినియోగదారుల ఆర్థిక భద్రతను ఉద్దేశించి అమలవుతోన్న డిజిటల్‌ పేమెంట్‌ ప్రొటెక్షన్‌ పాలసీలతో పరిహారం అందుతుంది. ఈ పాలసీలు సంవత్సరానికి కనిష్ఠంగా 499 రూపాయల్లో లభిస్తున్నాయి. పాలసీ ఎంపిక ఆధారంగా రూ.25 వేల నుంచి రూ.కోటి వరకు వరకు రక్షణ లభిస్తుంది. వ్యక్తిగతంగా, గ్రూపు (ఫ్యామిలీ) వారీగా లావాదేవీలపై బీమా చేయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

రక్షణ ఎలా వర్తిస్తుందంటే!

యూపీఐ, డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిగిన అనధికార లావాదేవీలకు బీమా వర్తిస్తుంది. ఫిషింగ్‌ లింకులు, నకిలీ కాల్స్‌ ద్వారా జరిగిన మోసాలు, మొబైల్‌ ఫోన్‌ లేదా కార్డు చోరీ అయిన తర్వాత జరిగిన లావాదేవీలు, హ్యాకింగ్‌ లేదా మాల్‌వేర్‌ కారణంగా జరిగిన ఆర్థిక నష్టాలకు, ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే సమయంలో జరిగిన దాడి, దోపిడీలకు బీమా ఉంటుంది.

ఎలా క్లైమ్ చేసుకోవాలి?

డిజిటల్ లావాదేవీల ద్వారా మోసపోయిన వెంటనే సంబంధిత బ్యాంకు లేదా యూపీఐ యాప్‌నకు సమాచారం ఇవ్వాలి. ఆ తర్వాత సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. చివరగా పాలసీ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పిస్తే విచారణ జరిపించి మీ ప్రమేయం లేకుండా చోరీ జరిగితే పరిహారం అందిస్తారు.

ఎందుకు అవసరం?

డిజిటల్‌ చెల్లింపులు పెరిగిపోయిన తరుణంలో వినియోగదారులకు ఆర్థిక భద్రత లభిస్తుంది. సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా డిజిటల్ చెల్లింపులనే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

సైబర్‌ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును వెనువెంటనే పదుల సంఖ్యలో వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసి డ్రా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి ఖాతాను బ్లాక్‌ చేయించేలోపు డబ్బు మొత్తం మాయమైపోతోంది.

వేటికి వర్తించదంటే!

ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌ను మీకు మీరే ఇతరులతో పంచుకున్నపుడు బీమా వర్తించదు. అదే విధంగా మోసం జరిగిన తర్వాత ఆలస్యంగా ఫిర్యాదు చేసినా, మీ నిర్లక్ష్యం కారణంగా లావాదేవీ జరిగినా బీమా ఉండదు. ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించిన మోసాలను పూర్తిగా అడ్డుకోవడం కష్టసాధ్యమే అయినా ఇలాంటి బీమా పాలసీల ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

మీ పిల్లలు ఫోన్​కు అలవాటు పడ్డారా? - ఈ యాప్స్ ఇన్​స్టాల్ చేస్తే మార్పు రావొచ్చు!

19ఏళ్లకే నెలకు కోటి! - కొవిడ్ నేర్పిన జీవిత పాఠంతో పైపైకి!