ETV Bharat / offbeat

చిన్న సారీ చెబితే రూ.5 వేలు! - పెద్ద సారీ చెబితే రూ.15 వేలు!!

- జపాన్​లో జోరుగా "క్షమాపణ" బిజినెస్ - సారీ చెప్పడానికి కన్సల్టెన్సీలను ఎంచుకుంటున్న జనాలు!

Apology Business
Apology Business (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : May 29, 2026 at 11:31 AM IST

2 Min Read
Choose ETV Bharat

Apology Business : తామే తప్పు చేసి ఎదుటివారిని దబాయించే రకం కొందరు. ఇలాంటి వాళ్లు తప్పును ఎన్నటికీ ఒప్పుకోరు. ఇంకొందరు తప్పు చేస్తారు, తమవల్ల తప్పు జరిగినందుకు ఫీలవుతారు. కానీ అది ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. అందుకే సారీ చెప్పడానికి ముందుకు రారు. మనసులో మాత్రం మదనపడుతుంటారు. ఇలాంటప్పుడు వారి తరపున వేరే వ్యక్తి సారీ చెబితే ఎలా ఉంటుంది?

ఇలాంటివి సాధారణంగా జరిగేవే.. ఫ్రెండ్స్ మధ్య గొడవ జరిగినప్పుడో, ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు వచ్చినప్పుడో.. "అలా జరిగినందుకు వాడు చాలా ఫీలవుతున్నాడు. ఈసారికి వదిలేసెయ్. మళ్లీ మునుపటిలా ఉండండి" అంటూ.. మన దేశంలో మీడియేటర్స్​ సర్ది చెబుతుంటారు. కానీ, జపాన్​లో మాత్రం ఇదో పెద్ద బిజెనెస్! ఎవరికైతే క్షమాపణ చెప్పాలో.. వారి వద్దకు, తప్పు చేసిన వ్యక్తి తరపున మరో వ్యక్తి వెళ్తారు. హృదయపూర్వకంగా సారీ చెప్పి వస్తారు. ఇందుకుగానూ.. ఫీజు వసూలు చేస్తారు. ఇదే అక్కడ వ్యాపారం. ఇందుకోసం ప్రత్యేకంగా 'అపాలజీ ఏజెన్సీలు' కూడా ఉంటాయి!

రూ.5వేల నుంచి మొదలు :

  • తన తరపున సారీ చెప్పించాలని భావించిన వ్యక్తి.. ఒక కన్సల్టెన్సీని సంప్రదిస్తారు. ఎవరికి క్షమాపణ చెప్పాలో, ఏ ప్రాంతంలో సారీ చెప్పాలో, ఏ పద్ధతిలో చెప్పాలో వివరిస్తారు. ఆ క్షమాపణ "బరువును బట్టి" ఫీజు ఆధారపడి ఉంటుంది.
  • ఫోన్​ చేసి సారీ చెప్తే 5 వేల రూపాయలు ఫీజుగా కన్సల్టెన్సీలు వసూలు చేస్తాయి. తమ ఏజెంట్​ ద్వారా అవతలి వ్యక్తికి ఫోన్​ చేయించి, సంజాయిషీ చెప్పిస్తారు. గొడవ జరగడానికి కారణమేంటో, అలా జరిగినందుకు ఇవతలి వ్యక్తి ఎంతగా ఫీలవుతున్నారో చెబుతారు.
  • ఫోన్లో చెప్పే సారీ సరిపోదని క్లైంట్ భావిస్తే.. ఏజెంట్ అవతలి వ్యక్తిని స్వయంగా కలుస్తారు. గొడవ జరిగినందుకు క్లైంట్ ఎంతగా ఫీలవుతున్నాడో చెబుతారు. పెద్ద మనసుతో క్షమించాలని కోరుతారు. ఇది కాస్త పెద్ద పని కాబట్టి, ఛార్జ్​ కూడా ఎక్కువే. దీనికోసం 15 వేల రూపాయల వరకు వసూలు చేస్తారు.
  • ఇలా కూడా కాదు.. ఇంతకు మించి క్షమాపణ చెప్పాలంటే ఆ ప్యాకేజీ కూడా ఉంది. కాళ్లు, చేతులు కూడా పట్టుకుంటారు. బోరుమని కన్నీళ్లు పెట్టుకుంటారు. జరిగిపోయిన తప్పునకు తెగ బాధపడిపోతున్నారని, క్షమించేయాలని వేడుకుంటారు. ఇంత పెద్ద సారీ చెప్పాలంటే ఫీజు డబుల్​ అవుతుంది! ఇలా వివిధ కేటగిరీల్లో క్షమాపణలు విక్రయిస్తున్నాయి జపాన్​ సంస్థలు!

నిజాయితీ ఎక్కడుంది ? :

  • ఇదంతా చదివిన తర్వాత.. "అపరాధ భావం ఉంటే స్వయంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే వదిలేయాలి. అంతేగానీ, డబ్బులిచ్చి ఈ రాయభారాలేంటి? ఇందులో నిజాయితీ ఎక్కడుంది??" అనిపిస్తోంది కదూ!
  • జపాన్​ సంస్కృతిలో వివాదం ఏదైనా త్వరగా పరిష్కారం కావడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలోనే క్షమాపణ ఎవరు చెప్పారనేదానికన్నా, తప్పు చేసిన వ్యక్తి నుంచి అది వచ్చిందా? లేదా? అనే విషయాన్ని చూస్తారట. అలా అక్కడితో ప్రాబ్లమ్​ క్లోజ్ చేస్తారట.
  • అక్కడి సమాజంలో 'అపకీర్తి'ని చావుతో సమానంగా భావిస్తారు. తప్పు చేసిన వారు ఆ నిందను జీవితాంతం మోయాల్సి వస్తుంది. అందుకే, త్వరగా సారీ చెప్పడానికి చూస్తారు. నేరుగా ఆ పనిచేయలేని వారు ఇలా మధ్యవర్తులను ఎంచుకుంటారట.
  • అంతేకాకుండా.. హర్ట్​ అయిన వ్యక్తి తీవ్రమైన కోపంలో లేదా బాధలో ఉండి తప్పు చేసిన వ్యక్తి ముఖం చూడడానికి ఇష్టపడకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో మధ్యవర్తి క్షమాపణ ఉపయోకరంగా ఉంటుందని కూడా చెబుతారు. మొత్తానికి ఇద్దరి మధ్య జరిగిన వివాదం తాలూకు నష్ట నివారణ కోసం దీన్నొక 'షార్ట్‌కట్' మార్గంగా ఎంచుకుంటున్నారక్కడ!