గోంగూర నిల్వ పచ్చడి ఇలా పెడితే ఏడాదంతా నిల్వ ఉంటుంది - ఆరబెట్టే అవసరమే లేదు!
కమ్మటి గోంగూర చట్నీ - అప్పటికప్పుడు ఇలా పక్కా కొలతల్లో ట్రై చేయండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 17, 2025 at 10:54 AM IST
Gongura Chutney : "గోంగూర చట్నీ" తెలుగువారికే కాదు ఇపుడు విదేశాలకూ ఎగుమతి అవుతున్న ప్రసిద్ధ వంటకం. ఇంట్లో కూరగాయల్లేనపుడు, టైం దొరకనపుడు వేడి వేడి అన్నంలోకి గోంగూర చట్నీతో కమ్మగా తినడం అలవాటే. కొంత మంది ప్రతి రోజూ గోంగూర చట్నీ టేస్ట్ చేస్తుంటారు. అయితే, గోంగూర శుభ్రం చేయడం, ఆరబెట్టడం పెద్ద పని. కానీ, అవేమీ లేకుండానే అప్పటికప్పుడు గోంగూర చట్నీ ఎలా పెట్టుకోవచ్చో ఇపుడు చూద్దాం.
టిఫిన్ ఏదైనా సరే టమోటా కారంతో కమ్మగా తినేయొచ్చు - చట్నీ, పల్లీలు అవసరమే లేదు!
కావల్సిన పదార్థాలు :
- గోంగూర - 350 - 400 గ్రాములు
- మెంతులు - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర- 1 టేబుల్ స్పూన్
- ధనియాలు- 1 టేబుల్ స్పూన్
- ఎండుమిర్చి- 100 గ్రాములు
- ఉప్పు - 50 గ్రాములు

పోపు లోకి కావల్సిన పదార్థాలు :
- నూనె - 250 గ్రాములు
- పచ్చిశనగపప్పు - 1 టేబుల్ స్పూన్
- ఆవాలు - అర టేబుల్ స్పూన్
- మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్
- వెల్లుల్లి పాయలు - 22
- జీలకర్ర - పావు టేబుల్ స్పూన్
- ఎండుమిర్చి - 6
- కరివేపాకు - 3 రెమ్మలు

తయారీ విధానం :
- నిల్వ పచ్చడి కోసం కాడల్లేకుండా గోంగూర ఆకులు తీసుకోవాలి. ఇలా తెంచుకున్న గోంగూరను నీళ్లలో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇసుక, పండు ఆకులు లేకుండా బాగా నాలుగైదు సార్లు శుభ్రం చేసుకుని జల్లెడలో వేసుకోవాలి. నీళ్లు వదిలే వరకు పక్కన పెట్టుకుని చట్నీ ప్రాసెస్ మొదలు పెడితే సరిపోతుంది.

- ముందుగా చట్నీలోకి అవసరమయ్యే మసాలా కారం రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనె వేయకుండానే మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసుకుని దోరగా వేయించాలి. ఆ తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టుకుని అదే కడాయిలో 100 గ్రాముల ఎండు మిర్చి వేసుకుని వేయించాలి.
- వేయించిన ఎండు మిర్చి కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుని వేయించిన ధనియాలు, జీలకర్ర, మెంతులతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

- ఇపుడు అదే కడాయిలో పోపు కోసం పావు కేజీ నూనె పోసుకుని వేడెక్కగానే టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండు మిర్చి కరివేపాకు వేసుకుని వేయించి ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలి.
- ఇపుడు మరో కడాయి స్టవ్ పై పెట్టుకుని 4టేబుల్ స్పూన్ల నూనెలో గోంగూర వేసుకోవాలి. సన్నటి మంటపై గోంగూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. దాదాపు 10 నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తే దగ్గరపడుతుంది. ఇపుడు గ్రైండ్ చేసుకున్న మసాలా కారం వేసి కలుపుకోవాలి.

- బాగా కలుపుతూ కారం, గోంగూర కలిసే వరకు మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పోపు కూడా వేసుకుని కలుపుకోవాలి. అంతే! పోపు చట్నీలో బాగా కలిసే వరకు కలుపుతూ మరో 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే చాలు! ఇలా రెడీ చేసుకున్న గోంగూర చట్నీని పరిశుభ్రమైన గాజు సీసాలో నిల్వ ఉంచితే సంవత్సరం మొత్తం కమ్మగా తినేయొచ్చు.
గోంగూరతో పప్పు, పచ్చడే కాదు ఇలా "గారెలు" చేసుకోండి - నూనె తక్కువ, రుచి ఎక్కువ!
పర్ఫెక్ట్ రుచితో "కంది పొడి" - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!

