వీలైతే "అమెరికన్ గేట్ కేక్", కుదిరితే "ఇటలీ బాల్ కేక్" - మెల్ట్ చేసేస్తాయి!
- రెగ్యులర్ కేక్స్‌కు భిన్నంగా.. ఎంతో టేస్టీగా - పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా లాగిస్తారు

Published : January 6, 2026 at 3:15 PM IST
Foreign Cake : స్వీట్ లవర్స్‌లో కేక్ అంటే ఇష్టం లేని వారుండరు. ఇక పిల్లల గురించి చెప్పాల్సిన పనే లేదు. అయితే కేక్ అనగానే ఎప్పుడూ బేకరీలో దొరికే వాటిని మాత్రమే తింటే ఏం బాగుంటుంది? అందుకే ఈ సారి వెరైటీగా యూరప్ రెసిపీ తయారు చేయండి. వీలైతే అమెరికన్ గేట్ కేక్, కుదిరితే ఇటలీ బాల్ కేక్ ప్రిపేర్ చేసేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు "వన్ మోర్ పీస్ ప్లీజ్" అంటారు. మరి, వీటిని ఎలా తయారు చేయాలి? ఇందుకోసం ఏమేం పదార్థాలను ఉపయోగించాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
అమెరికన్ గేట్ కేక్ కోసం కావలసిన పదార్థాలు :
- ఒకటిన్నర కప్పు మైదా పిండి
- 3 టేబుల్ స్పూన్ల పిస్తా పౌడర్
- 2 టేబుల్ స్పూన్ల పిస్తా పలుకులు
- 3 కోడి గుడ్లు
- 1/2 కప్పు నూనె
- 1 కప్పు పాలు
- 1 స్పూన్ బేకింగ్ పౌడర్
- ఒకటిన్నర కప్పు మలై
- 3 టేబుల్ స్పూన్ల చక్కెర పొడి
- 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్
తయారీ విధానం :
- ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో మైదా పిండి, పిస్తా పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి
- తర్వాత ఆయిల్, పాలు, కోడిగుడ్లు కొట్టి వేయాలి. వీటిని ఉండలు కట్టకుండా మెత్తటి పిండిలా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి
- ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని అడుగున నూనె రాయాలి. ఆ తర్వాత పై మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా సర్దుకోవాలి
- అనంతరం 180 డిగ్రీల వద్ద అవెన్‌ను ప్రీ హీట్ చేసి, కేక్ టిన్ అందులో పెట్టి సుమారు 35 నిమిషాలపాటు బేక్ చేసుకోవాలి
- ఆ తర్వాత టూత్ పిక్‌తో గుచ్చి టెస్టు చేయాలి. దానికి అంటుకుంటే ఇంకా కేక్ పూర్తిగా బేక్ కాలేదని అర్థం. ఏమీ అంటుకోకపోతే కేక్ రెడీ అయిందని అర్థం.
- ఆ కేక్ చల్లారిపోయే లోగా క్రీమ్ తయారు చేయాలి. మలైలో చక్కెర, వెనీలా ఎసెన్స్ వేసి మిక్స్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన క్రీమ్‌ను కేక్ పై భాగంలో సమంగా పరచాలి.
- చివరగా దానిపైన పిస్తాపలుకులు చల్లుకుంటే సరి. అద్దిరిపోయే "అమెరికన్ వాటర్ గేట్ కేక్" సిద్ధమైపోతుంది. దీని రుచి ఎంతో బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు.
అర్ధ గంటలోనే అద్దిరిపోయే "రవ్వ కేక్" - ఓవెన్ అవసరం లేదు! - టేస్ట్ అదుర్స్!
ఇటలీ బాల్ కేక్ కోసం కావలసిన పదార్థాలు :
- 1/2 కప్పు వెన్న
- 1 కప్పు మైదాపిండి
- ఒకటిన్నర కప్పు మలై
- 4 గుడ్లు
- చిటికెడు ఉప్పు
- 3 టేబుల్ స్పూన్లు చక్కెర పౌడర్
- 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్
- 175 గ్రాముల డార్క్‌చాక్లెట్
- 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్
తయారీ విధానం :
- ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కోడి గుడ్లను కొట్టి, స్పూన్‌తో గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి
- తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, అందులో కప్పు నీళ్లు, ఉప్పు, వెన్న వేసి మరిగించుకోవాలి
- ఆ తర్వాత అందులో మైదా వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమం దగ్గరకు వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి
- ఇప్పుడు అందులో గిలకొట్టిన గుడ్డు సొన వేసి కలుపుకోవాలి
- అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బంతులు మాదిరిగా తయారు చేసి, ట్రేలో పెట్టుకోవాలి
- తర్వాత అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి. అందులో ట్రేను ఉంచి, దాదాపు 30 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. బాల్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఉంచుకోవాలి
- ఆ బేకింగ్ ప్రాసెస్ కొనసాగుతుండగా షుగర్, మలై, వెనీలా ఎసెన్స్ కలుపుకొని ఫిల్లింగ్ ప్రిపేర్ చేసుకోవాలి
- ఇప్పుడు బేక్ చేసిన బాల్స్ ను బయటకు తీసి, వాటికి కాస్త రంధ్రం చేసి, దాంట్లో క్రీమ్ నింపుకోవాలి
- ఇలా బాల్స్ మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ప్లేటులో పిరమిడ్ ఆకారంలో ఒకదాని మీద మరొకటి పేర్చాలి
- అనంతరం డార్క్‌చాక్లెట్‌ను వేడిచేసి ఆ బాల్స్ పైన పోయాలి. తర్వాత వాటిని సుమారు 30 నిమిషాల సేపు ఫ్రిజ్‌లో ఉంచితే సరి. అద్దిరిపోయే "ఇటలీ కేక్" సిద్ధమైపోతుంది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది.
- పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.
అరటిపండ్లతో అద్దిరిపోయే "చాక్లెట్ కేక్"! - బేకరీకి వెళ్లాల్సిన పనిలేదు

