'నా కారు నా ఇష్టం' అంటే కుదరదు! - అదనపు హంగులుంటే 'ఫైన్' కట్టాల్సిందే!
కారు అద్దాలపై పేర్ల నుంచి బంపర్స్ ఏర్పాటు వరకు మార్పులు చేశారా? - అయితే, ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే!

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 1, 2026 at 1:12 PM IST
Effects of Vehicle Modifications : మనం ఏదైనా వాహనం కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి, తెలిసిన వారందరినీ సంప్రదించి మరీ తీసుకుంటాం. కొన్ని రోజుల తర్వాత వాహనం మరింత స్టైలిష్‌గా, గ్రాండ్‌గా కనిపించాలని ఏవేవో అదనపు హంగులు అమర్చుతుంటాం. అయితే, చాలా మంది చిన్నచిన్న మార్పులే కదా, ఏమవుతుందిలే అనుకుంటారు. తీరా బండి రోడ్డెక్కాక తెలుస్తుంది. ఒక్కో నిబంధన. ఎప్పుడైనా అత్యవసర పని మీద ఊరెళ్తుంటే పోలీసులు ఆపి 'అదెందుకు పెట్టావ్, ఇదెందుకు బిగించావ్' అని అడుగుతుంటే, ఏం చేయాలో అర్థం కాదు. కొన్ని సార్లు ప్రమాదం జరిగే వరకూ తెలియదు. అందుకే వాహన ఉపకరణాలు, వాటి ప్రభావాలపై ముందే అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు ఆటో మొబైల్ నిపుణులు. మరి, వెహికల్‌కు అదనంగా ఏ ఉపకరణాలు అమర్చితే ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అదనపు బంపర్స్ :
వాహనం బాహుబలిలా కనిపించాలని కొందరు, ట్రాఫిక్ వాహనాలు తగిలి కారుకు డెంట్లు పడతాయేమోనని మరికొందరు వెహికల్ ముందు, వెనుక అదనంగా స్టీల్ బంపర్ రాడ్లు అమర్చుకుంటుంటారు. కానీ, చాలా మందికి తెలియని విషయమేమిటంటే, మోటారు వెహికల్ చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం బండికి అలాంటివి అమర్చుకోవడం నిషేధం.
ఇవి ఉంటే ఎదురయ్యే సమస్య :
- మీ వెహికల్‌కు మెటల్ బంపర్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ త్వరగా తెరుచుకోవంటున్నారు ఆటో మొబైల్ నిపుణులు.
- ఆ బంపర్ రాడ్స్ ద్విచక్రవాహన చక్రాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రమాదం చోటుచేసుకుంటే వీటి వల్ల వాహనంపై ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యే ప్రమాదం లేకపోలేదంటున్నారు.
ఈ ఫ్యాన్లతో విద్యుత్తు బిల్లు 65శాతం ఆదా! - కరెంట్ లేకున్నా 10 గంటలు తిరుగుతాయి!
అద్దంపై రాతలు :
కొంతమంది వాహనం అద్దంపై 'DAD'S GIFT, GOD'S GIFT' అంటూ రేడియంతో పేర్లు రాయిస్తుంటారు. అలాంటివి చట్టప్రకారం నిషేధం. ఒకవేళ మీరు రాయించుకోవాలనుకుంటే వెహికల్ ముందు అద్దం మూలల్లో పీయూసీ, స్టిక్కర్లు రేర్ వ్యూ మిర్రర్‌కు సరిగ్గా వెనుక అతికించుకోవచ్చంటున్నారు. అంతకు మించి డ్రైవర్ దృష్టి మరల్చే మరేవీ అతికించొద్దని చెబుతున్నారు.
- ముఖ్యంగా వాహనం వెనుక, ముందు ఏ అద్దంపైనైనా రేడియంతో ఎలాంటివి అతికించకూడదంటున్నారు. అద్దాలు 70శాతం కాంతి ప్రసరింపజేసేలా ఉండాలి.
- డ్రైవర్‌కు మిర్రర్లో వెనుక దృశ్యాలు కనపడకుండా వెనుక గ్లాస్‌పై 'డాడీ గిఫ్ట్', గాడ్స్ గిఫ్ట్ వంటి రేడియం స్టిక్కర్లు వేయించొద్దంటున్నారు.
- ఇలా చేస్తే మోటారువాహన చట్టంలోని సెక్షన్ 177 ప్రకారం జరిమానా విధిస్తారంటున్నారు నిపుణులు.
ఫుట్ రెస్ట్ :
కారుతో సహా వచ్చేవి ఉంటే ఏమీ కాదు. ఎందుకంటే అవి కారు పొడవు, ఎత్తు తదితర ప్రమాణాల ఆధారంగా ఏర్పాటు చేస్తారు. అలాకాకుండా కొంతమంది అదనంగా కారుకు ఫుట్‌రెస్ట్‌లు అమర్చుతుంటారు. అలాంటివి ఉండడం వల్ల ఈ సమస్యలు ఎదురుకావొచ్చు.
వాహనానికి అదనంగా బిగించుకునే ఫుట్‌రెస్టులు, క్రాష్గార్డులు వెహికల్ బరువును అసమతౌల్యం చేస్తాయి. ఒక్కోసారి వేగంగా వెళ్తున్నప్పుడు ఇవి ప్రభావం చూపుతాయి. ఇవి బిగించుకున్న వాటికే కాదు, పక్కనుంచి వెళ్లే వాహనాలకూ ప్రమాదకరమే అంటున్నారు.
మాగ్నెటిక్ కర్టెన్లు :
- కొంతమంది వాహన డోర్లకు సన్షేడ్లు, మాగ్నటిక్ కర్టెన్లు అమర్చుతుంటారు. కానీ, ఇవి అమర్చుకోవడం కూడా చట్టవిరుద్ధమే అంటున్నారు నిపుణులు. కారు డోర్లకు ఇలాంటి తెరలు ఏర్పాటుచేసుకోవడం వల్ల మలుపులను గుర్తించలేం.
- బయటి పరిసరాలు కనిపించకుండా వాడే బ్లాక్ కర్టెన్ల వల్ల లైన్ మార్చేటప్పుడు, మలుపు తీసుకునేటప్పుడు, సైడ్ మిర్రర్ సరి చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందంటున్నారు నిపుణులు.
నానా రకాల నంబర్ ప్లేట్లు :
- ప్రభుత్వం నంబరు ప్లేట్లలో ఏకరీతి కోసం హైసెక్యూరిటీ ప్లేట్లు తీసుకొచ్చింది. అవి ఉంటే పోలీసులు వాహనాన్ని సులువు గుర్తించడానికి వీలవుతుందనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. అయితే, కొంతమంది నంబర్ ప్లేట్లను వంచడం, కావాల్సిన నంబరును పెద్దగా చేయడం వల్ల ఎమర్జెన్సీ టైమ్‌లో కారును సులువుగా గుర్తించలేరు.
- కొందరు నంబరు ప్లేటుపై పేర్లు, గుర్తులు, ఇతర అలంకరణలు జోడిస్తుంటారు. కానీ, నంబర్ ప్లేటుపై అలాంటివి ఉన్నా చట్టవిరుద్ధమే. పోలీసులకు వాహనంపై అనుమానాలు తలెత్తుతాయని సూచిస్తున్నారు నిపుణులు.
అదనపు మార్పులు వాహనాన్ని ప్రభావితం చేయొద్దు :
'వాహనానికి ఎలాంటి అదనపు ఉపకరణాలు అమర్చుకున్నా, అవి వెహికల్ అసలు ఫ్రేంను, దాని స్పీడ్‌పై ప్రభావం చూపొద్దు. డోర్ తీయగానే కాలు పెట్టుకునేలా కొందరు బండికి ఫుట్ రెస్టులు బిగిస్తారు. అవి పక్కన వెళ్లే బండ్లకు తగిలేలా ఉంటాయి. ఇలా ఉపకరణాల వల్ల చాలా వరకు బీమా వర్తించదు. ఈ విషయం వాహనంలో ఉపకరణాలు బిగించే సంస్థలేవి కూడా తెలియజేయవు. యాక్ససరీస్ అంటే వాహనానికి, అందులో కూర్చున్నవారికి, ఇతర వాహనదారులకు సౌకర్యంగా ఉండాలే తప్ప ఇబ్బంది కాకూడదని గుర్తించాలి.' - వెంకటరమణ, జేటీసీ
'పవర్ బ్యాంక్' వాడుతున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే పేలే అవకాశం!
ఫోన్ కింద పడేసే వారిలో మహిళలే ఎక్కువ! - సర్వేలో మొబైల్ వాడకంపై కీలక విషయాలు!

