ETV Bharat / lifestyle

స్మైల్ ప్లీజ్..!

- ఇవాళ "ప్రపంచ నవ్వుల దినోత్సవం" - నవ్వకపోవడంతో ఏం కోల్పోతున్నారో తెలుసా?

World Laughter day 2026
World Laughter day 2026 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 3, 2026 at 8:47 AM IST

4 Min Read
Choose ETV Bharat

World Laughter day 2026 : "నవ్వడం యోగమో కాదో తెలియదుగానీ.. నవ్వకపోవడం మాత్రం ఖచ్చితంగా రోగమే"! అవును మరి, మనస్ఫూర్తిగా నవ్వితే మెదడులో మన మనసుకు నచ్చిన దోస్తులాంటి బీటా-ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. బ్రెయిన్​ను ప్రెషర్​లోకి నెట్టే కార్టిసాల్, ఎపినెఫ్రిన్ వంటి ఎనిమీ హార్మోన్స్ తగ్గిపోతాయి. ఫస్ట్ ఇవి రెండూ జరిగితే చాలు, రోజంతా మనస్సు హాయిగా ఉంటుంది. ఇక ఆ తర్వాత అన్నీ లాభాలే అంటే నమ్మాల్సిందే.

మరి, ఇంతకీ మీలోని ఆ మనిషి "మర మనిషి"లా ఎందుకు మారిపోతున్నాడట? కేవలం టాస్క్​ యాక్సెప్టెడ్​, టాస్క్​ కంప్లీటెడ్ అని పలకడానికి మాత్రమే పెదాలను వాడుతూ.. ఎలాంటి ఫీలింగ్సూ లేని రోబో వెర్షన్​లా ఎందుకు బిహేవ్​ చేసున్నాడట? ఈ పరిస్థితి లాంగ్​ టైమ్​లో ఎలాంటి సమస్యలను.. కాదు కాదు, ఎంతటి ముప్పును తెచ్చి పెడుతుందో ఆ మనిషి కాస్తైనా ఐడియా ఉందా?? మనసులోకి బందిపోట్ల తీరుగా చొరబడే నెగెటివ్ థాట్స్​ను.. ఒక్క పైసా దుడ్డు కూడా ఖర్చులేకుండా.. చిన్న చిరునవ్వు అనే దుడ్డు కర్రతో తరిమి తరిమి కొట్టొచ్చన్న సంగతి ఆ మనిషికి తెలుసంటనా..? లేదంటనా?? సరే, ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది. ఇవాళ "ప్రపంచ నవ్వుల దినోత్సవం". ప్రతి ఏటా మే ఫస్ట్ సండేను ఇలా సెలబ్రేట్ చేస్తుంటారు. రండి మరి, కనీసం ఈరోజునుంచైనా ఎలా నవ్వాలో ఒక డెమో చూద్దాం.

"లైట్"​ బ్రో..

నువ్వు జాబ్​లో ఉన్నంత వరకూ టాస్క్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే జీవించి ఉన్నంత వరకూ ఏదో ఒక టాస్క్​ రన్​ అవుతూనే ఉంటుంది. దానికి నవ్వడాన్ని ఆపడం ఎందుకు? ఇవి రెండూ వేర్వేరు విషయాలు కదా! మీకు తెలుసా? సీరియస్​గా, మానసిక ఒత్తిడితో పనిచేయడం కన్నా, ఆహ్లాదకర వాతావరణంలో పనిచేస్తే ఔట్​ పుట్​ క్వాలిటీగా వస్తుందని రీసెర్చ్​లు చెబుతున్నాయి. సంతోషంగా పనిచేసే ఉద్యోగులు ఇతరులకన్నా 13% ఎక్కువ రిజల్ట్​ తెస్తున్నారని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన "సైద్ బిజినెస్ స్కూల్" రీసెర్చ్ వెల్లడించింది. సో.. నీ టాస్క్​ పర్ఫెక్ట్​గా కంప్లీట్​ కావడానికి కూడా నువ్వు నవ్వాలంట గురూ!

చైన్ లింక్..

ఇక నీ పర్సనల్​, ఫ్యామిలీ, రిలేషన్స్.. వీటన్నింటినీ బలంగా లింక్​ చేసే అత్యంత బలమైన గొలుసు ఏదైనా ఉందంటే, చెబితే నమ్మవుగానీ అది నీ నవ్వేనట! ముఖంలో చిరునవ్వుతో కనిపించే వారిని చూస్తే ఎదుటివారికి ఒక రిలాక్సేషన్​ ఫీల్​ కలుగుతుందట. అప్రయత్నంగా వారి పెదాలపైనా ఒక స్పార్క్​ జనరేట్​ అవుతుందట. కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు దాదాపు 30 ఏళ్ల పాటు నిర్వహించిన లాంగిట్యూడినల్ అధ్యయనం ప్రకారం.. మనస్ఫూర్తిగా నవ్వుతూ కనిపించే వారు ఇతరులతో పోలిస్తే మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని తేల్చింది. నవ్వేవారు అందరికీ నచ్చేస్తారు. అందరికీ లవబుల్​ అయిపోతారట. అంతే మరి.. ఎక్కడ చూసినా రాళ్లు కుప్పలు తెప్పలు. రత్నాలు మాత్రమే అక్కడక్కడా! పక్కవాళ్లు కూడా పట్టుకుంటారు.. కాస్త జారనివ్వు బాసూ!

ప్రాక్టీస్..

మీరు నవ్వకపోవడానికి, నవ్వలేకపోవడానికి తప్పు మెజారిటీ మీది కాదు. మీరు ఎదుర్కొన్న పరిస్థితులది. మీరు పెరిగిన పరిసరాలదే అంటారు సైకాలజిస్టులు. అయితే, కాలం ఎంత పెద్ద గాయాన్నైనా హీల్ చేసి పారేస్తుంది. దానికి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అంటారు. అందుకే, మీకు నవ్వడం అలవాటు లేకపోతే నిరభ్యంతరంగా, నిక్కచ్చిగా సాధన చేయాల్సిందే. "మరీ, నవ్వు ప్రాక్టీస్ చేయడమేంటి నా ముఖం" అంటారా? ఈ ప్రశ్నకు సైకాలజీ ఏం చెబుతుందంటే.. కేవలం 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే, నీకు లేని అలవాటు తెచ్చుకోవచ్చు. ఉన్న అలవాటును పర్మనెంట్​గా వదులుకోవచ్చు అని! ప్రామిస్.. కావాలంటే మిర్రర్​లో కనిపిస్తున్న ముఖాన్ని కళ్లతోనే అడుగు యార్!

పొద్దున్నే పార్కులకుపోయి "లాఫ్టర్‌ యోగా"తో కితకితలు పెట్టించుకునే వారు కొందరు. సాయంత్రం "స్టాండప్​ కామెడీ"షోలకు హాజరై వెజ్, నాన్​ వెజ్​ జోక్స్ నంజుకుని.. ఫుల్ మీల్స్ లాంగిచేసి వస్తున్నవారు మరికొందరు. నువ్వు కూడా అలా రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని అటో ఇటో వెళ్లిపో! ఇవి రెండూ కాకపోతే మూడో డెస్టినేషన్ వెతుక్కో. అంతేగానీ.. నవ్వడం అలవాటయ్యేదాకా ఆగకు. సంతోషమే సగం బలం అని పెద్దోళ్లు వట్టిగనే అన్లేదు బ్రో!

ఆఫీసులో అచీవ్​ మెంట్స్ కొందరికే సాధ్యం కావచ్చు. అనితర సాధ్యమైన అద్భుతాలు అతి కొద్దిమందే సాధించొచ్చు. కానీ, నవ్వడం మాత్రం యూనివర్సల్​. ఎవ్వరైనా చేసేయొచ్చు. సమస్యలే వీటికి అడ్డు అనుకుంటే.. అవి జస్ట్ పాసింగ్​ క్లౌడ్స్​ అనే వాస్తవాన్ని కూడా విస్మరించకూడదు. అందుకే.. ఇన్నాళ్లూ నవ్వుకోసం మొహం వాచిపోయిన ముఖాన్ని, ఆ నవ్వుల్లోనే ముంచెత్తు. దీనికోసం పఠించాల్సిందీ, పాటించాల్సిందీ ఒకటే మంత్రం. నో రీజన్ ఫర్ బీ హ్యాపీ.. నో రీజన్ ఫర్ బీ హ్యాపీ.. నో రీజన్ ఫర్ బీ హ్యాపీ.. "స్మైల్ ప్లీజ్!"

నవ్వుతోనే ఆరోగ్యం

- లక్ష్మీకాంత్‌ పవార్, లాఫ్టర్‌ టీచర్‌

మనుషులను కలిపే శక్తి, కట్టిపడేసే శక్తి నవ్వుకు ఉంది. వ్యక్తిగతంగా హెల్దీగా ఉండడమే కాదు.. సమాజంలోని సంబంధ బాంధవ్యాలూ బలపడతాయి. పాజిటివ్ మైండ్​ సెట్​ అలవాటవుతుంది. ఇందుకోసం లాఫ్టర్‌ యోగా సాధన చేయండి. ఇది నవ్వు + ప్రాణాయామం కలయిక. మొదట కృత్రిమంగా నవ్వడం మొదలైనా, అక్కడి వాతావరణం దాన్ని సహజంగా మార్చేస్తుంది. మనస్ఫూర్తిగా నవ్వితే జీవితం ఆనందమయం అయిపోతుంది.