ETV Bharat / lifestyle

పని మీద నుంచి దృష్టి మళ్లుతోందా? - ఈ మార్గాలు ట్రై చేస్తే "ఏకాగ్రత" పెరుగుతుందట!

ఏ పని మీద ఏకాగ్రత కుదరటం లేదా? - ఏకాగ్రతను తిరిగి పొందడానికి మార్గాలున్నాయట - వాటిని ట్రై చేస్తే మేలు జరుగుతుందని నిపుణుల సూచన!

Representational image
Representational image (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : July 3, 2026 at 4:23 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ways to Improve Concentration and Focus : ఎక్కడో ఉండి ఏదో ఆలోచిస్తాం. రకరకాల వ్యాపకాల్లో మునిగిపోయి అన్యమనస్కంగా ఉంటాం. ఫోన్​కు వచ్చే నోటిషికేషన్లపై శ్రద్ధ పెట్టి చేస్తున్న పనిపై ఏకాగ్రత నిలపలేకపోతున్నాం. దృష్టిని ఆకర్షించే ఈ ఫీచర్లు మనలో ఒత్తిడిని పెంచి, ఉత్పాదకతను తగ్గిస్తాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో మన ఏకాగ్రతను తిరిగి పొందడానికి మార్గాలున్నాయంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

మనిషి మెదడులోని కొన్ని ప్రాంతాల నెట్​వర్క్ మన శ్రద్ధను నియంత్రిస్తుందట. దీనివల్ల మనం సంబంధిత సమాచారంపై దృష్టి పెట్టి, మిగతా వాటిని నియంత్రిస్తామని నిపుణులు చెబుతున్నారు. మన లక్ష్యాలు ఏంటి? చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతోంది? అనే వాటి మధ్య సమతుల్యతే మన దృష్టిని మళ్లిస్తుందని చెబుతున్నారు. దీని అర్ధం.. ఆకస్మిక లేదా అత్యవసర సంఘటనలు మన దృష్టిని ఆకర్షించి అప్పటికే చేయాలనుకుంటున్న పని నుంచి దూరం చేస్తాయని పేర్కొంటున్నారు. పరిణామ దృక్కోణం(Evolutionary Perspective) నుంచి చూస్తే.. ఇది మనల్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుందని తెలియజేస్తున్నారు.

సాంకేతికతతో ఏం చేటు?: సోషల్ మీడియాలో పోస్టులు, లైక్​లు లాంటివి పని సమయంలో ఏకాగ్రతకు అంతరాయం కలిగిస్తుంటాయంటున్నారు నిపుణులు. ఇవి మన ప్రాథమిక దృష్టిని నేరుగా దెబ్బతీయవట. కానీ, పనుల మధ్య తరచుగా మారేలా చేస్తూ ఏకాగ్రతను చెడగొడతాయని చెబుతున్నారు. అయితే, మల్టీ టాస్కింగ్​పై అపోహ ఏమిటంటే.. మనం ఒకేసారి రెండు కష్టమైన పనులను చేయగలమని అర్థం. అయితే, మన శ్రద్ధకు పరిమితమైన సామర్థ్యం ఉంటుందట. అంటే, మన చుట్టూ జరుగుతున్న ప్రతిదాన్నీ మనం ఏక కాలంలో గ్రహించలేమని వివరిస్తున్నారు. మల్టీటాస్కింగ్ అంటే వాస్తవానికి ఒకేసారి చేయడం కాదు, రెండు పనుల మధ్య వేగంగా మారడం (టాస్క్ స్విచింగ్) మాత్రమే. ఈ క్రమంలో ఓ పని ఎంత సుపరిచితమైనా టాస్క్ స్విచింగ్​ అనేది మనం ఒకటి లేదా రెండు పనులను చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని పరిశోధనలు చెబుతున్నారు. కొన్ని చిన్న జీవన శైలి మార్పులు చేసుకోవడం ద్వారా మన ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

టీనేజర్ల ఆలోచనలను పేరెంట్స్ - తల్లిదండ్రుల ప్రేమను పిల్లలు అర్థం చేసుకుంటే అన్నీ హ్యాపీడేసే!

ఆ పరధ్యానాల్ని పరిమితం చేయండి : ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే పరధ్యానాల్ని ఫోన్​లో 'ఫోకస్' మోడ్​లను సెటప్ చేయడం ద్వారా పరిమితం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, పని లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. మనకు వచ్చే నోటిఫికేషన్​ల సంఖ్యను పరిమితం చేస్తే పరధ్యానాలు వాటంతట అవే ఫిల్టర్ అవుతాయంటున్నారు.

  • యాప్​ల నుంచి వచ్చే అన్ని నోటిఫికేషన్​లను ఆఫ్ చేసి, వాటిని తనిఖీ చేయడానికి నిర్దిష్ట సమయాలను షెడ్యూల్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
  • భోజనానికి 10 నిమిషాల ముందు మిమ్మల్ని మీరు జవాబుదారీగా ఉంచుకోవడానికి టైమర్​లను సెట్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
  • మీ స్క్రీన్ సమయాన్ని ట్రాక్ చేసే యాప్​లు సహాయపడొచ్చని తెలియజేస్తున్నారు. మొబైల్ గేమ్​లకు దూరంగా ఉండటం మేలట.

కార్యకలాపాల్ని ఎంచుకోండి :

  • పనుల మధ్య నిరంతరం మారడం మన ఏకాగ్రతను బలహీనపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అధిగమించడానికి నిరంతర శ్రద్ధ అవసరమయ్యే కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
  • సంగీతం వాయించడం, ఆటల పోటీలు వంటి లీనమయ్యే కార్యకలాపాలను వారానికి కొన్ని సార్లు చేస్తే శ్రద్ధ పెట్టే సామర్థ్యం మెరుగుపడుతుందంటున్నారు
  • ఆరోగ్యకరమైన జీవనశైలిలోని అనేక అంశాలు, నిద్ర, వ్యాయామంతో మొదలుపెట్టి, ఏకాగ్రతకు సహాయపడతాయని Harvard Health Publishing పేర్కొంది.

డిజిటల్​కు దూరంగా :

  • నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా, వాటిని బెడ్​రూమ్​కి దూరంగా ఉంచే వ్యక్తులు బాగా నిద్రపోతారని, ఏకాగ్రతను మెరుగుపరచుకుంటారని sleepfoundation పేర్కొంది. ఖాళీ సమయం దొరికింది కదా అని వెంటనే డిజిటల్ పరికరాన్ని తీసుకోవద్దంటున్నారు నిపుణులు.
  • మనస్సును స్వేచ్ఛగా సంచరించనివ్వడానికి క్రమం తప్పకుండా విరామం తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి, విభిన్న భావనలు, అనుభవాల మధ్య కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంటున్నారు. తద్వారా సృజనాత్మకత పెరుగుతుందంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ అందం తగ్గకుండా ఉండాలా? - ఈ పొరపాట్లు చేయకూడదట!

"నేచురల్ బ్యూటీ" కావాలనుకుంటున్నారా? - ఇంట్లోనే దొరికే సహజ లేపనాలు ఇవి!