ఒంటరిగా ఉన్నారని ఫీల్ అవుతున్నారా? - అందుకు మీ అలవాట్లే కారణమట!
-మీ ఒంటరితనానికి అలవాట్లు, ఆలోచనా తీరు, మనస్తత్వమే కారణమంటున్న నిపుణులు -బయటపడటానికి ఇలా చేయాలని సూచన!

Published : January 10, 2026 at 4:53 PM IST
Main Cause of Loneliness is Our Own Habits: కొందరు ఒంటరిగా మిగిలిపోయామని బాధపడుతుంటారు. తమకంటూ ఎవరూ లేరని, చుట్టూ ఉన్నవారు దూరం చేస్తున్నారని అనుకుంటారు. కానీ, వాస్తవానికి మన అలవాట్లు, ఆలోచనా తీరు, మనస్తత్వమే మనుషుల్ని మనకు దూరం చేస్తాయంటున్నారు మానసిక నిపుణులు. ఒంటరినని భావించే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
ఎవరితోనూ చెప్పరు : చాలా మంది తమ భావోద్వేగాలను ఎవరితోనూ పంచుకోకుండా లోలోపలే దాచేసుకుంటారు. తమను ప్రేమగా చూసుకునే కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌తోనూ వారి భావాలను పంచుకోరు. ఇలా చేస్తే ఎదుటివారు ‘నాపై నమ్మకం లేదేమో, అందుకే ఏమీ చెప్పట్లేదు’ అనుకుంటారు. దీంతో వారు క్రమంగా దూరమవుతారని నిపుణులు చెబుతున్నారు.
చెప్పకుండానే అర్థం చేసుకోవాలంటారు : ‘నన్ను పట్టించుకుంటే, నా ఫీలింగ్స్ గురించి చెప్పకపోయినా అర్థం చేసుకుంటారు’ అని భావిస్తారు. అన్నివేళలా చెప్పకుండా ఎవరూ అర్థం చేసుకోలేకపోవడం, కోరుకున్నట్లు స్పందించలేకపోవచ్చు. దీంతో నిరాశ, నిస్పృహలే ఎదురవుతాయంటున్నారు నిపుణులు. తద్వారా అపార్థాలు మొదలవుతాయని చెబుతున్నారు. ఎవరూ నన్ను అర్థం చేసుకోలేదని, ఒంటరినైపోయానని ఫీలవుతారని పేర్కొంటున్నారు.
ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? - బెస్ట్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు
గొడవయితే మౌనం : బంధాల్లో కొన్నిసార్లు అసౌకర్యంగా ఉంటుంది. గొడవలు, మొహమాటాలు, భావోద్వేగాల్లో వైరుధ్యం సర్వసాధారణం. అయితే, ఒంటరిగా మిగిలిపోయే వారు వీటిని ఎదుర్కోవడానికి భయపడతారని నిపుణులు అంటున్నారు. మాట్లాడి పరిష్కరించుకునే అవకాశం ఉన్నా మౌనంగా ఉండిపోతారని చెబుతున్నారు. దీంతో బంధాలు బీటలువారడం, క్రమంగా దూరం పెరగడం లాంటివి జరుగుతాయని తెలియజేస్తున్నారు.
అన్నీ తమ గురించే : ఎవరైనా ముఖ్యమైన విషయం చెప్పినప్పుడు 'నాకూ అలాగే జరిగింది' అంటూ గతంలోకి వెళ్లి తన గురించే చెప్పుకొంటారు. ఇలా చేయడం వల్ల ఎదుటివాళ్లు తాము చెప్పింది వినిపించుకోలేదని భావిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. తమ మాటలకు గౌరవం ఇవ్వట్లేదని అనుకుంటారని చెబుతున్నారు. దీంతో మాట్లాడటం మానేస్తారట.
స్పందనపై అతి ఆలోచన : ఎవరైనా ఏదైనా మాట అన్నా, మెసేజ్ ద్వారా స్పందించినా వాటి గురించే అతిగా ఆలోచించడం, అన్న మాటల్ని పలు విధాలుగా విశ్లేషించడం, ప్రతికూల ఫలితాలనే ఊహించుకోవడం లాంటివి చేస్తుంటారు. దీని వల్ల అనుమానాలు పెరిగి, బంధాలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయిందన్నట్లుగా భావించి ఎదుటివారిని దూరం చేసుకుంటారని వివరిస్తున్నారు.
నిజాయితీగా లేకపోవడం : కొందరు ఎదుటివారు బాధపడకూడదని, గొడవలు జరగకూడదని నిజాలు దాచేసి, మౌనంగా ఉండిపోతారు. అయితే, చెప్పనంత మాత్రాన అవి తెలియకుండా ఉండదు కదా! ఈ అలవాటు మనిషిలో అసహనాన్ని పెంచుతాయని, ప్రశాంతతనివ్వవని నిపుణులు చెబుతున్నారు. మాట్లాడితే వచ్చే గొడవల కన్నా ఈ మౌనం బంధాల మధ్య మరింత దూరాన్ని సృష్టిస్తుందని సూచిస్తున్నారు.
ఒంటరితనం నా తలరాత అనుకోవడం : కొన్ని నమ్మకాలు మనిషి ప్రవర్తనను మార్చేస్తాయి. ‘నేను ఎప్పుడూ ఒంటరిగా మిగిలిపోతాను’ అనే నమ్మకం కూడా ఈ కోవలోకే వస్తుందంటున్నారు నిపుణులు. కొందరు తమ తలరాత ఇంతే అనుకుంటూ ఎవరితోనూ కలవరని చెబుతున్నారు. ఎదుటివాళ్లు దూరం పెడతారమోనని, ముందుగానే వీరే దూరంగా ఉండిపోతారట.
ఏం చేయాలి?: ఎదుటి వ్యక్తుల వల్ల వచ్చిన ఒంటరితనం కాదంటున్నారు నిపుణులు. తప్పుడు భావనలు, అలవాట్లతో చేజేతులా తెచ్చుకునే పరిస్థితి అని చెబుతున్నారు. దీనిపై అవగాహన పెంచుకొని, జీవనశైలి, అలవాట్లలో మార్పులు చేసుకుంటే పరిస్థితులు మారే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
- ఫస్ట్ తమ గురించి ఎదుటివాళ్లు ఏం అనుకుంటారనే ఆలోచనను పక్కన పెట్టాలి. లోపలి భావాలను సన్నిహితులు లేదా నమ్మకమైన వ్యక్తులకు తెలియజేయాలి. ఫ్రెండ్స్, కుటుంబసభ్యుల్ని పలకరించి మాట్లాడాలి. వారితో మాట్లాడితే ఒంటరిననే భావన రాదు.
- పౌష్టికాహారం, వ్యాయామం, సరిపడా నిద్రను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఫ్రెండ్స్‌తో కలిసి వాకింగ్, జిమ్‌కు వెళ్తే బంధం మరింత పెరుగుతుందని అంటున్నారు.
- ఖాళీగా కూర్చుని ఉంటే ఒంటరిననే భావనే వస్తుంది. అలాంటి సమయంలో నచ్చిన పనులు చేయడం, పుస్తకం చదవడం, సంగీతం వినడం, గార్డెనింగ్ ఇలా ఏదో ఒక పని చేస్తే సరిపోతుందని చెబుతున్నారు.
- నలుగురితో మాట్లాడటం, నలుగురి మధ్య ఉండటం అలవాటు చేసుకోవాలి. క్లాస్, క్లబ్, వాలంటీర్‌గా వర్క్‌చేయడం, ఆన్‌లైన్ కమ్యూనిటీ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనాలి. మీ అభిప్రాయాలను ఎలాంటి భయం లేకుండా చెప్పాలి.
- కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి భోజనం చేయడం, షాపింగ్, షికారుకు వెళ్లడం వంటివి చేస్తుండాలి. అప్పుడు, వీళ్లంతా మీ కోసం ఉన్నారని అనిపిస్తుంది. దీంతో ఒంటరిననే ఆలోచన దూరమవుతుందట.
చలికాలంలో మొక్కలు ఆరోగ్యంగా ఉండి ఏపుగా పెరగాలా? - ఈ టిప్స్ మేలు చేస్తాయట!
"డెస్టినేషన్ వెడ్డింగ్" ప్లాన్ చేస్తున్నారా? - మనకు దగ్గర్లోనే అద్భుతమైన ప్రదేశాలు!

