బంధంలో ఇవి కూడా "మానసిక వేధింపులే"! - అవేంటో తెలుసా?
-మానసిక వేధింపుల్లోనూ రకాలు ఉన్నాయంట! - ఇవి పాటించాలని నిపుణుల సూచనలు!

Published : August 30, 2026 at 3:51 PM IST
Types of Emotional Abuse in Relationships: భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం సహజం. అయితే, కొందరు తమ కోపాన్ని చేతల్లో చూపిస్తే, ఇంకొందరు మానసికంగా వేధిస్తుంటారు. శరీరంపై గాయమైతే రేపో, మాపో మానిపోతుంది. కానీ, మనసుకు గాయమైతే మానడం కష్టం అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ఇలాంటి మానసిక వేధింపుల్లోనూ పలు రకాలు ఉన్నాయంటున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
నమ్మక ద్రోహం : మానసిక వేధింపుల్లో 'గ్యాస్‌లైటింగ్' అనేది చాలా ప్రమాదకరమైనది. ఇలాంటి వారు పైకి ఎంతో మంచిగా నటిస్తూ, లోపల మాత్రం కోవర్టుల్లా ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. వారు ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటారో, వారితో స్నేహంగా ఉంటూనే సైలెంట్‌గా తప్పుదోవ పట్టిస్తుంటారట. ఈ క్రమంలో తమపై తమకే నమ్మకం పోయేలా, సొంత నిర్ణయాలపైనే అనుమానం వచ్చేలా మానసికంగా దెబ్బతీస్తారని పేర్కొంటున్నారు. అయితే, వీరు ఈ విధానాన్ని అందరిపైనా ప్రయోగించలేరంటున్నారు. సాధారణంగా మానసికంగా కొంత బలహీనంగా ఉండే వారినే వీరు టార్గెట్ చేస్తుంటారని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ, వైవాహిక బంధాల్లో ఈ తరహా వేధింపులు ఎక్కువగా జరుగుతుంటాయని వివరిస్తున్నారు. ఎదుటివారిని క్రమంగా బలహీనులుగా మార్చి, పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడమే వీరి ముఖ్య లక్ష్యమని వివరిస్తున్నారు.
ముఖంపై మొటిమలకు మీరే కారణం? - మీ పక్కనే ఎంతో మంది శత్రువులు!
ఒంటరిని చేస్తూ : మానసికంగా వేధించే వారి శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. కొంతమంది తమ లైఫ్ పార్టనర్‌ని.. వారి ఫ్రెండ్స్, బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి క్రమంగా దూరం చేస్తుంటారు. కొంత కాలానికి వారికి తాను తప్ప ఇంకెవరూ లేరన్నంతగా తమపై ఆధారపడేలా చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలా పూర్తిగా తమ అధీనంలోకి వెళ్లాక మాటలతో వేధిస్తూ రాక్షసానందం పొందుతుంటారట. ప్రతిదానికీ తమ పర్మిషన్ తీసుకోవాలంటున్నారు. ఇలాంటి వారి చేతుల్లో పడితే జీవితం నరకప్రాయంగా మారుతుందని చెబుతున్నారు.
నేను మోనార్క్‌ని : కొన్ని రకాల మానసిక సమస్యలు ఉన్నవారు బయటకు సాధారణంగానే కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించడం చాలా కష్టమంటున్నారు. అయితే, వీళ్లలో కొందరు ఇతరులను మానసికంగా వేధిస్తుంటారట. ఈ నేపథ్యంలో తమను తామే గొప్పగా ఊహించుకుంటారని తెలియజేస్తున్నారు. 'నేను తీసుకున్న నిర్ణయమే సరైంది. నాకే చాలా విషయాలు తెలుసు' అన్న భావనలో ఉంటారని వివరిస్తున్నారు. వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకుని.. వారి మీద పట్టు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటారట. ఒకవేళ లైఫ్ పార్టనర్‌కి తనపై ఆసక్తి తగ్గిందని భావిస్తే తన కంటే మంచి వ్యక్తి ఇంకొకరు లేరన్న భావనను వారి మనసుల్లో సృష్టిస్తుంటారని పేర్కొంటున్నారు. పరిస్థితి చేయి దాటితే భాగస్వామిని భయపెట్టడానికీ వెనకాడరట!
సైలెంట్ కిల్లర్స్ : సాధారణంగా మాటలతోనే ఇతరులను వేధించడం చూస్తుంటాం. కానీ, కొంతమంది మాట్లాడకుండా కూడా వేస్తుంటారట! దీనినే 'స్టోన్ వాలింగ్' అని పిలుస్తారని చెబుతున్నారు. ఇటువంటి వారు ఇతరులతో ఎక్కువగా మాట్లాడరట. వీరు తీవ్రమైన విషయాల గురించి చర్చిస్తున్నప్పుడు కూడా సమాధానం ఇవ్వకుండా ముభావంగా ఉంటారు లేదా మధ్యలోనే వెళ్లిపోతుంటారని చెబుతున్నారు. మరికొందరు మాత్రం సంభాషణకు సంబంధం లేని అనవసర విషయాల గురించి మాట్లాడుతుంటారని తెలియజేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అసలు విషయం చెప్పకుండా ఆరోపణలు చేస్తుంటారని తెలియజేస్తున్నారు. ఇలాంటి వారు తమ చేష్టలతో జీవిత భాగస్వామికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా :
- కొంతమంది ఒత్తిడి, చికాకులో ఉన్నప్పుడు జీవిత భాగస్వామిని తిడుతుంటారు. అయితే, ఇది ఎప్పుడో ఒకసారి కాకుండా, తరచుగా జరుగుతుంటే దానిని కూడా మానసిక వేధింపుల కిందికే పరిగణించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
- కొందరు తాము ఏ పనీ చేయకపోయినా, జీవిత భాగస్వామి చేసే పనుల్లో మాత్రం నిరంతరం తప్పులు వెతకడం కూడా ఒక రకమైన మానసిక వేధింపు అని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి పదే పదే ప్రస్తావిస్తూ వారిని చులకన చేస్తుంటారని తెలియజేస్తున్నారు. ఇదీ మానసిక వేధింపుల్లో భాగమే అని పేర్కొంటున్నారు.
న్యూ బ్యూటీ ట్రెండ్ - ఇదే జెన్‌జీ 'సౌందర్య మంత్రం'!
మీరు భోజనానికి ఏ 'పాత్రలు' వాడుతున్నారు? - వీటిల్లో తినడం మంచిదికాదట!

