ప్రెగ్నెన్సీలో "ప్రయాణాలు" చేయడం మంచిదేనా? - నిపుణుల సమాధానమిదే!
-ప్రెగ్నెంట్ అయ్యారని తెలియగానే పలు విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న మహిళలు - అయితే ముఖ్యంగా ప్రయాణాల విషయంలో ఇవి తెలుసుకోవాలని సూచన!

Published : October 13, 2026 at 5:17 PM IST
Travel Tips for Pregnant Women: మాతృత్వం ఓ వరం. అందుకే ప్రతి మహిళ అమ్మ అని పిలిపించుకోవాలని ఆరాటపడుతుంది. ఇక ప్రెగ్నెంట్ అయ్యారని తెలియగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఈ క్రమంలోనే తమ పనులు తాము చేసుకోవడానికి కూడా వెనకాడుతుంటారు. ఇక కొద్దిమంది అయితే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్ప డెలివరీ అయ్యే దాకా ప్రయాణాలు కూడా మానుకుంటారు. ఎందుకంటే తెలిసి తెలియక చేసే పనుల వల్ల కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమో అని భయపడుతుంటారు. ఈ క్రమంలోనే అసలు గర్భంతో ఉన్న ప్రయాణాలు చేయవచ్చా? చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ప్రయాణాలు చేయవచ్చా?: గర్భం దాల్చడం అనేది ఆరోగ్య సమస్య కాదని, ఆ సమయంలో శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఎవరికి వారు అన్ని పనులూ చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. పైగా ఇలా చేయడం వల్ల మరింత చురుగ్గా ఉండగలుగుతారని వివరిస్తున్నారు. పనులే కాకుండా.. గర్భంతో ఉన్నప్పుడు జర్నీలు కూడా చేయొచ్చని, అయితే అందుకు ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక దీంతో పాటు జర్నీ చేయాలనుకునే గర్భిణులు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరమంటున్నారు. ఇదే విషయాన్ని "సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్" కూడా చెబుతోంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే:
- గర్భం ధరించిన మహిళల్లో వికారం, వాంతులు వంటివి కామన్. కొద్దిమంది ఈ లక్షణాలు మొదటి మూడు నెలలు ఉంటే, మరికొద్దిమందికి కొన్ని నెలల పాటు కొనసాగుతాయి. అయితే ప్రయాణాల్లో ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే సులభంగా జీర్ణమయ్యే పోషక ఆహారాన్ని తక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. ఇక జర్నీ సమయంలోనూ లైట్ ఫుడ్ తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు.
- ప్రయాణాల సమయంలో ప్రెగ్నెన్సీ రిపోర్టులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్, మందులు వంటివన్నీ ఎప్పుడూ వెంటే ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. తద్వారా ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే వెంటనే అక్కడికి దగ్గర్లోని ఆస్పత్రిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవచ్చని వివరిస్తున్నారు.
- జర్నీ చేసేటప్పుడు వాటర్ బాటిల్‌ను తమ వెంటే తీసుకోవాలని వివరిస్తున్నారు. వీలు కుదిరినప్పుడు మధ్యమధ్యలో కొబ్బరి నీళ్లు తాగడం కూడా మంచిదంటున్నారు. దీని వల్ల శరీరంలో వాటర్ లెవల్స్ పడిపోకుండా ఉంటాయని, శరీరానికి తక్షణ శక్తి కూడా వస్తుందంటున్నారు.
- ప్రయాణాల్లో బిగుతైన వస్త్రాలు కాకుండా లూజుగా , కంఫర్ట్‌గా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. తద్వారా కూర్చున్నా ఇబ్బందిగా అనిపించదని వివరిస్తున్నారు. అలాగే చెప్పుల విషయంలోనూ ఫ్లాట్స్‌ని ఎంచుకుంటే కంఫర్టబుల్‌గా నడవడానికి వీలవుతుందని సలహా ఇస్తున్నారు.
- జర్నీ సమయంలో మధ్యమధ్యలో టాయిలెట్స్‌కి వెళ్లే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా వాష్‌రూమ్స్ డోర్స్, నాబ్స్‌ని తాకినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి వీలుగా మీ వెంటే ఓ మినీ హ్యాండ్‌వాష్ బాటిల్‌ను ఉంచుకోవడం మంచిదంటున్నారు. అలాగే మధ్యమధ్యలో చేతులు శానిటైజ్ చేసుకోవడమూ ముఖ్యమే అని వివరిస్తున్నారు.
- ఇక కారులో ప్రయాణాలు చేసే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మధ్యమధ్యలో ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రదేశంలో వాహనాన్ని ఆపి కాసేపు రిలాక్స్ అవ్వడం, 5 నిమిషాలు తిరగడం వల్ల ప్రయాణ అలసటను దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
ఈ సమస్యలుంటే ప్రయాణాలు వద్దట!: కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న గర్భిణులు మాత్రం జర్నీలు చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఈ క్రమంలో గతంలో గర్భస్రావం లేదా ప్రి-మెచ్యూర్ డెలివరీ అయిన వారు, గర్భాశయంలో ఏదైనా సమస్యలున్న వారు, గర్భం దాల్చిన తొలి నెలల్లో రక్తస్రావం లేదా ఇతర సమస్యలెదురైన వారు, లేటు వయసులో గర్భం ధరించడం, కవలలు లేదా ట్రిప్లెట్స్‌ను మోస్తున్న వారు ప్రయాణాలు చేయకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.
ప్రెగ్నెన్సీ సమయంలో "పొట్ట దురద" పెడుతుందా? - ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్ సాల్వ్!
భార్యాభర్తల మధ్య "బంధం" దృఢంగా ఉండాలా?! - ఈ సలహాలు పాటించాలని సూచన!

