"డబ్బులు ఊరికే రావు" ఇలా చేశారంటే మీ టూర్ ప్లాన్ సక్సెస్ - నిపుణులు సూచిస్తున్న చిట్కాలివే!
టూర్ ప్లాన్ చేస్తున్నారా? - ముందుగానే ఇలాంటి సూత్రాలు పాటించండి!

Published : February 18, 2026 at 4:45 PM IST
Travel Budget : విహారయాత్రకు వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి. కొందరు విదేశాలను చుట్టిరావాలని అనుకుంటే, ఇంకొందరు దేశీయంగా పర్యటించాలని ఆశ పడుతుంటారు. మరికొందరు కనీసం కాస్త దగ్గరలో ఉన్న సందర్శక ప్రాంతాలనైనా చూసి రావాలని అనుకుంటారు. అయితే, ఇలా అనుకునే వరుకు బాగానే ఉంటుంది. మరి బడ్జెట్ మాటేంటి? నెలవారీ ఖర్చులు, కుటుంబ అవసరాలు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల మధ్య విహారయాత్రకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడం కష్టంగా ఉంటుంది. అయితే, నెలవారీ ఖర్చుల్లోనే పొదుపు చేస్తే టూర్‌కి బడ్జెట్ పెద్ద సమస్యే కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
ఫ్రెండ్స్ మాటే శాసనం - ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న "జెన్ జీ"!
మొదట విహారయాత్రకు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవాలి. వెళ్లే ప్రాంతాన్ని లేదా ప్రదేశాన్ని బట్టి బడ్జెట్ ఆధారపడి ఉంటుంది. విదేశాలకు అయితే భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. అదే, దేశీయంగా, స్థానికంగా ఓ మోస్తారు ఖర్చు ఉంటుంది. ట్రావెల్ ఛార్జీలు, స్టేయింగ్, ఫుడ్, ఇతర ఫీజులు ఇలా మొత్తం ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసుకొని, లక్ష్యాన్ని అందుకునేలా సేవింగ్స్ స్టార్ట్ చేయాలి. అందుకు రికరింగ్ అకౌంట్ తెరవడం లేదా ఒక పొదుపు డబ్బాను ఉపయోగించవచ్చు.
- ప్రతిరోజూ ఒక నిర్దిష్ట మొత్తాన్ని విహారయాత్ర కోసం జమ చేయండి. మీ ఆదాయాన్ని బట్టి రోజుకు రూ.100 నుంచి ఎంతయినా సరే, ఆ మొత్తాన్ని పక్కన పెట్టండి. ఇలా కొన్ని నెలలు చేశారంటే పెద్ద మొత్తంలో జమవుతుంది.
- ఉద్యోగం, వ్యాపారం చేసే వారయితే ప్రతినెలా కొంత మొత్తాన్ని ట్రావెల్ బడ్జెట్ కింద పొదుపు చేయొచ్చు. ఆ మొత్తాన్ని మరో అకౌంట్ లేదా పొదుపు స్కీమ్‌లోకి ఆటోమెటిక్‌గా ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేసుకోవాలి.
- రోజుకు నాలుగు సార్లు బయట టీ, కాఫీ లేదా కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉంటే, ఒక్కసారే తాగడం అలవాటు చేసుకోండి. మిగిలిన అమౌంట్ పొదుపు చేయండి. ఇది చూడడానికి చిన్న మొత్తం అయినా కొంతకాలానికి పెద్దగా కనిపిస్తుంది.
- వీకెండ్లో రెస్టారంట్లలో తినడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అయితే, నెలలో రెండు వారాలు బయట తినడం మానేస్తే, రెస్టరెంట్లో అయ్యే సగటు బిల్లు మొత్తాన్ని జమ చేయాలి.
- కొంతమంది తమకు అవసరమున్నా లేకపోయినా ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటారు. ఒకవేళ టూర్‌కు వెళ్లాలనుకుంటే అనవసరమైన ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ను తీసుకోవడం నిలిపివేయండి. వాటికయ్యే డబ్బును ట్రావెల్ బడ్జెట్‌కు మళ్లించండి.
- కొన్ని క్రెడిట్ కార్డ్స్ విహారయాత్రకు ఉపయోగపడేలా ఉంటాయి. వాటితో రివార్డ్స్ లేదా ట్రావెల్ పాయింట్లు పొంది విమాన/రైలు టికెట్లు, హోటల్స్‌లో బుకింగ్స్ వంటి వాటిలో డిస్కాంట్స్ పొందవచ్చు.
సరిగ్గా ప్లాన్ చేస్తే విహారయాత్రకు అయ్యే ఖర్చులోనూ డబ్బు పొదుపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
- విమాన లేదా రైలు టికెట్లను కొన్ని నెలల ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. బయలుదేరే ముందు అయితే, విమాన టికెట్ల ధర భారీగా పెరుగుతుంది. అదేవిధంగా, రైలు టికెట్‌ను ఎక్కువ ధర పెట్టి తత్కాల్లో బుక్ చేసుకోవాల్సి వస్తుంది.
- తరచూ టికెట్ బుకింగ్ సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. డిస్కౌంట్స్, బై వన్ గెట్ వన్, గ్రూప్ ప్యాకేజీలు వంటివి అందుబాటులోకి తెస్తాయి. అలాంటి టైంలో ఆ ఆఫర్లను వినియోగించుకుంటే ఖర్చు తగ్గుతుంది.
- అలాగే, వెళ్లినచోట సందర్శక ప్రాంతాలను చుట్టి రావడానికి ప్రత్యేకంగా క్యాబ్ బుక్ చేసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే, రైలు, బస్సు, ఆటోలు వంటి రవాణా సౌకర్యాలను ఉపయోగించుకొని డబ్బు ఆదా చేసుకోవచ్చు.
- టూరిస్ట్ గైడ్‌ను నియమించుకుంటే ఎక్కువ మొత్తంలో వారికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఇప్పుడు ఇదొక అనవసరపు ఖర్చు. వెళ్లే ముందే ఆ ప్రాంతాల విశేషాలను తెలుసుకొని వెళ్తే గైడ్ అవసరం ఉండదు.
- పర్యాటక ప్రాంతాల్లోని హోటల్స్‌లో బస చేయాలంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలంటే క్యాంపింగ్ ప్రయత్నించొచ్చు. లేదంటే హాస్టల్స్‌లో రూమ్ ధరలు తక్కువగా ఉంటాయి.
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా? - ఈ నేచురల్ టిప్స్ పాటిస్తే బెటర్!

