మీ ఫ్రెండ్ మాట్లాడట్లేదా? - ఇలా చేయాలంటున్న నిపుణులు!
ఫ్రెండ్షిప్లో 'గుడ్ బాండింగ్' కోసం - ఈ టిప్స్ పాటిస్తే మంచిదంటున్న నిపుణులు!

Published : January 11, 2026 at 1:06 PM IST
Tips to Deal with your Friends: జీవితంలో తీయని అనుబంధం స్నేహం. అయితే, కొన్ని సందర్భాల్లో ప్రాణ స్నేహితుల మధ్యా గొడవలు జరగచ్చు. ఆ తర్వాత అవతలి వారి ప్రవర్తన, ప్రాధాన్యాల్లోనూ మార్పులు రావచ్చు. ఇలాంటప్పుడు వారిపై మనకు కోపం రావడం, దీంతో వారిని దూరం పెట్టడం వంటివి చేస్తుంటాం. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో సంయమనంతో వ్యవహరిస్తే ఇద్దరి మధ్య దూరం పెరగకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని చిట్కాలు పాటిస్తే తిరిగి వారితో అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
కారణమేంటో తెలుసుకోండి : ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావడం సహజం. అలాగే, మన బెస్ట్ ఫ్రెండ్ ప్రవర్తనలోనూ అప్పుడప్పుడూ పలు మార్పులు కనిపిస్తుంటాయి. అయితే, అవి ఎలాంటి మార్పులో ముందు గుర్తించాల్సి ఉంటుంది. ఎలాగంటే, కావాలని మిమ్మల్ని దూరం పెట్టడం, ఎప్పటిలా మాట్లాడకపోవడం, కాల్ చేసినా కట్ చేయడం, మెసేజ్ చేసినా రిప్లై లేకపోవడం.. వారి ప్రవర్తనలో ఇలాంటి మార్పులు గమనించినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వారితో మాట్లాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ కోపతాపాల్ని పక్కన పెట్టి, మీ పట్ల తను అలా ప్రవర్తించడానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలంటున్నారు. మీకు తెలియకుండా ఏదైనా పొరపాటు చేశారా? లేదంటే మీ స్నేహాన్ని జీర్ణించుకోలేని వారు మీపై చాడీలు చెప్పారా? అదీ కాదంటే తనే కావాలని అలా చేస్తోందా? ఇవన్నీ వారితో కూర్చొని మాట్లాడితేనే ఓ కొలిక్కి వస్తాయని చెబుతున్నారు. ఇక అసలు కారణం తెలిశాక, పొరపాటు ఎవరిదైతే వారు క్షమాపణ కోరితే సమస్య సద్దుమణుగుతుందని తెలియజేస్తున్నారు. దీంతో స్నేహబంధం తిరిగి పరిమళిస్తుందట.

విటమిన్ 'సి'తో అందంగా ఉంటారట! - సౌందర్య లేపనాల కన్నా ఇదే మేలంటున్న నిపుణులు!!
పంతాలకు పోవద్దు : కోపతాపాలు, పంతాలు, పట్టింపులు అనేవి అనుబంధాల్ని దెబ్బతీస్తాయంటారు. స్నేహబంధానికీ కూడా ఇదే వర్తిస్తుందంటున్నారు నిపుణులు. అయితే, కొందరు తమ ఫ్రెండ్స్ తమను దూరం పెడుతున్నారని, వారి ప్రవర్తన రోజురోజుకీ మారిపోతోందని వారిపై ద్వేషం పెంచుకుంటారని చెబుతున్నారు. ‘తను నాకు ప్రాధాన్యమివ్వనప్పుడు, నేను తనను పట్టించుకోను’ అంటూ పంతాలకు పోతుంటారని వివరిస్తున్నారు. ఇదే చినికి చినికి గాలివానలా మారి.. అనుబంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ఇలాంటప్పుడు ఓపికతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. అవతలి వారు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీరు వారితో ఎప్పటిలాగే మెలగడం, వారి కోపం తగ్గాక వారితో మాట్లాడడం, నిజానిజాలు తెలుసుకోవడం వంటివి చేస్తే మీ ఫ్రెండ్ ప్రవర్తనలో ఎందుకు మార్పులొస్తున్నాయో అర్థమవుతుందని సలహా ఇస్తున్నారు. ఆపై ఇద్దరి మధ్య తలెత్తిన పొరపచ్ఛాల్ని సరిదిద్దుకొని తిరిగి కలిసిపోవచ్చంటున్నారు.

అటు నుంచి ప్రయత్నించండి : ఎన్ని చేసినా, ఎంత చెప్పినా కూడా మీ స్నేహితుల్లో మార్పు రాకపోయినా, వారు మీ మాట వినకపోయినా చివరిసారిగా మరో మార్గంలో ప్రయత్నించవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లోని ఇతర స్నేహితుల సహాయం తీసుకోవడం లేదంటే మీ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వారి సహాయం కోరడం వంటివి చేయచ్చని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా, ముందుగా వాళ్ల సమస్యేంటో, మీకు ఎందుకు దూరమవుతున్నారో ఇతర స్నేహితుల్ని అడిగి తెలుసుకోమని చెప్పండి. మీ ఇద్దరి మధ్య స్నేహబంధం దృఢమవడానికి మీరెంతగా ప్రయత్నిస్తున్నారో వారికి తెలియజేయాలని పేర్కొంటున్నారు. ఆపై ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య స్నేహబంధం తిరిగి దృఢమవుతుందని చెబుతున్నారు.
ఒంటరిగా ఉన్నారని ఫీల్ అవుతున్నారా? - అందుకు మీ అలవాట్లే కారణమట!
సోషల్ మీడియాలో నయా ట్రెండ్ - "జీరో పోస్టింగ్"తో హీరోలుగా యువత!

