కాస్త ఆలస్యం అయినా సరే - అన్నీ తెలుసుకున్నాకే పెళ్లికి 'ఓకే' చెప్పాలట!
-స్లో డేటింగ్ అంటే ఏమిటి? - ఇలా చేస్తే రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉంటుందట!

Published : October 16, 2025 at 3:48 PM IST
Slow Dating is Best Way to know your partner : ఈ తరం జంటల్లో విడాకులకు.. ప్రేమ, పెళ్లికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు కూడా ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రేమైనా, పెద్దలు కుదిర్చిన సంబంధమైనా భాగస్వామిని నెమ్మదిగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. 'స్లో డేటింగ్'గా పిలిచే ఈ రిలేషన్షిప్ ట్రెండ్ జంటల మధ్య అనుబంధాన్ని శాశ్వతం చేసేందుకు తోడ్పడుతుందని పేర్కొంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!
ప్రస్తుతం యువత ఆన్లైన్లో భాగస్వామిని వెతుక్కొని, వాట్సప్‌లో ప్రేమించుకుంటున్నారు. ఇందుకు వృత్తి ఉద్యోగాలు, ఇతర పనుల రీత్యా క్షణం తీరిక లేకుండా గడపడమే ప్రధాన కారణం. ఇక కొందరు వయసు మీరిపోతుందనో, ఇంట్లో వాళ్లు తొందర పెడుతున్నారనో, తాము వెతుక్కున్నా, పెద్దలు కుదిర్చిన సంబంధమైనా, భాగస్వామిని పూర్తిగా చదవకముందే ఓకే చెప్పేస్తున్నారు. అనుబంధం అనేది శాశ్వతమైనది కాబట్టి ఎంత బిజీగా ఉన్నా, ఎవరు తొందర పెడుతున్నా, అన్నీ పక్కన పెట్టి, కాస్త సమయం వెచ్చించి భాగస్వామి గురించి సునిశితంగా తెలుసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు.
రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలి? - మోతాదుకు మించి తాగితే ఏమవుతుంది? - నిపుణుల ఆన్సర్ ఇదే!
ప్రవర్తన ఎలా ఉంది?: ప్రేమ లేదాపెళ్లయిన కొత్తలో భాగస్వామిని ఇంప్రెస్ చేయాలని వాళ్లతో ప్రేమగానే ఉంటారు. కానీ, రోజులు గడిచే కొద్దీ కొందరి ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి. మీరంటే ఇష్టం లేనట్లుగా, లెక్కలేనట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇష్టపడిన వ్యక్తి ఇలా ప్రవర్తిస్తే మనసు బాధపడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే 'స్లో డేటింగ్' చక్కటి మార్గమని నిపుణులు చెబుతున్నారు. అవతలి వ్యక్తి తొలి చూపులోనే నచ్చినా, మీ ఫీలింగ్స్‌ని బయటపెట్టకూడదంటున్నారు. వాళ్లు ఎలాంటి వారో, వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటాయో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఇందుకు కనీసం రెండు లేదా మూడు నెలలైనా సమయం పడుతుందని పేర్కొంటున్నారు. అయినా, ఓపికతో వాళ్లను తరచూ కలవడం, వాళ్ల అభిప్రాయాలు, అభిరుచులు తెలుసుకోవడం, మీ గురించి దాచుకోకుండా వాళ్లతో పంచుకోవడం, ఈ సమయంలో వాళ్ల స్పందన ఎలా ఉంటుందో గ్రహించాలని సూచిస్తున్నారు. ఇవన్నీ తెలిస్తే కానీ, అవతలి వ్యక్తి మన జీవిత భాగస్వామిగా సరిపోతాడా? లేదా? అనేది అర్థం కాదంటున్నారు. తద్వారా ప్రేమ, పెళ్లి విషయాల్లో చక్కటి నిర్ణయం తీసుకోగలుగుతారని చెబుతున్నారు.
నమ్మాకం కుదిరాకే!: ఏ అనుబంధమైన శాశ్వతమవ్వాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం కలగడం ముఖ్యం. అయితే, ఇది అంత త్వరగా పూర్తయ్యే పని కాదని, ఒకరితో ఒకరు మాట్లాడుకొని, ఒకరి గురించి మరొకరు లోతుగా తెలుసుకున్నప్పుడే అవతలి వారిని నమ్మచ్చా? నమ్మకూడదా? అన్న విషయం అర్థమవుతుందని నిపుణులు చెబుతున్నారు. జీవిత భాగస్వామి అంటే, ఎన్నో విషయాల్లో వారి గురించి సృష్టత రావాల్సి ఉంటుందంటున్నారు. ఎలాగంటే, ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతున్నామా? అవతలి వారిలో అధిపత్యం చెలాయించే గుణాలున్నాయా? గౌరవం ఇచ్చి పుచ్చుకోగలుగుతున్నామా? అవసరమైతే ఎదుటివారు తమ కోసం రాజీ పడగలుగుతారా? ఇవన్నీ ఇద్దరి మధ్య నమ్మకాన్ని పెంచే విషయాలేనని వివరిస్తున్నారు. కాబట్టి, కొన్ని నెలలు ఆలస్యమైనా పర్లేదు, ఇద్దరూ కలిసి, మాట్లాడుకొని, ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగాకే అడుగు ముందుకేయడం మంచిదంటున్నారు.
వాళ్లను ఒప్పించండి : ప్రేమ, పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఇంట్లో వాళ్లు తొందరపెట్టడం. అయితే, నూరేళ్ల జీవితానికి సంబంధించిన ఈ విషయాన్ని అంత త్వరగా తేల్చుకోవడం కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకే మీరు ప్రేమించినా, పెద్దలు చూసిన సంబంధమైనా, భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకునే దాకా, కాస్తా గడువు ఇవ్వమని ఇంట్లో వాళ్లను ఒప్పించడానికి ప్రయత్నించాలని తెలియజేస్తున్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాల్నీ వారికి వివరించాలని అంటున్నారు. వాళ్లు తప్పకుండా అర్థం చేసుకుంటారని, మీరు తీసుకున్న నిర్ణయానికీ ఒప్పుకొంటారని సూచిస్తున్నారు.
కాస్త ఆలస్యమైనా అన్ని రకాలుగా ఆలోచించాకే నిర్ణయం తీసుకోవడం వల్ల మనకు నచ్చిన, మన ఆలోచనలకు దగ్గరగా ఉండే వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో అనుబంధమూ శాశ్వతమవుతుందని అంటున్నారు.
సోషల్ మీడియాలో చూసి బ్యూటీ ప్రొడక్ట్స్ కొంటున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

