ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వాడొచ్చా? - వాస్తవాలు ఎలా ఉన్నాయంటే!
ల్యాప్‌టాప్ నిర్వహణ - పలు సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు

Published : October 15, 2025 at 3:06 PM IST
Laptop Safety Precautions : కాలేజీ విద్యార్థుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు ల్యాప్‌టాప్ తప్పనిసరి వస్తువుగా మారింది. నిత్యావసరంగా మారిన పరిస్థితుల్లో దాని భద్రతా కీలకమే. డివైజ్ ఏ కంపెనీదైనా సరైన నిర్వహణ అవసరం, వాడడంలో మెలకువలు పాటిస్తే ల్యాప్‌టాప్ దీర్ఘకాలం సురక్షితంగా ఉంటుంది. ఈ క్రమంలో ల్యాప్‌టాప్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో ఇప్పుడు తెలుసుకుందాం!
దుమ్ము లోపలికి పోకుండా : చాలామంది ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేసిన తర్వాత మూసివేయకుండా అలాగే వదిలేస్తారు. దీనివల్ల దుమ్ము, ధూళి, ఇతర చిన్న అణువులు కీబోర్డు, స్పీకర్ల ద్వారా లోపలికి వెళ్తాయి. హార్డ్‌వేర్ కాంపోనెంట్లలోకి చేరతాయి. దీంతో పనిచేయడంలో అంతరాయం ఏర్పడుతుంది. అందుకే ల్యాప్‌టాప్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. ఎక్కువగా కీబోర్డుల్లో ఉన్న దుమ్ముని క్లీన్ చేయడానికి టూత్‌బ్రష్ లాంటివి వాడుతుంటారని, మార్కెట్లో అందుబాటులో ఉన్న 'ల్యాప్‌టాప్ క్లీనింగ్ కిట్'ను ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. కీబోర్డు పాడవకుండా, డస్ట్ లోపలికి వెళ్లకుండా తెరలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు.
సిజేరియన్ తర్వాత ఆందోళన అవసరం లేదు! - ఈ జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!
వెంటిలేషన్ అవసరం : ల్యాప్‌టాప్‌లకూ వెంటిలేషన్ అవసరం. బయటి గాలి లోపలికి వెళ్లడం, లోపలి గాలి బయటకు రావడం తప్పనిసరి. ల్యాప్‌టాప్‌లలో ఫ్యాన్లు కింది వైపు ఉంటాయి. తొడలు, సోఫా, బెడ్, దిండుపై పెట్టుకుని వాడుతుంటే వెంటిలేషన్ సరిగ్గా ఉండదు. దీనివల్ల త్వరగా హీట్ అవుతాయి. ఆ తర్వాత పనితీరు మందగించి 'హ్యాంగ్' అవుతుంది.
ఇలా ఓపెన్ చేస్తున్నారా? : సులభంగా ఉంటుందని ల్యాప్‌టాప్‌లను ఒక మూల నుంచి ఓపెన్ చేస్తుంటారు. ఇలా పదే పదే చేస్తుంటే పైభాగంలోని డిస్ప్లే ఒకవైపు వంగిపోతుంది. ఇటీవల కొన్ని ప్రీమియం ల్యాప్‌టాప్‌లను ఓపెన్ చేయడానికి ప్రత్యేకంగా 'బంప్' ఇస్తున్నారు. సిస్టమ్‌ను ఎప్పుడూ మధ్యలోనుంచే ఓపెన్ చేయాలి. దీంతోపాటు ల్యాప్‌టాప్‌లను ఒకవైపు నుంచే, ఒకచేత్తో ఇవ్వడం, పట్టుకెళ్లడం సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. మెటల్‌తో చేసిన ల్యాప్‌టాప్‌లకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా ప్లాస్టిక్ బాడీ ఉన్న ల్యాప్‌టాప్‌లు కొన్ని సార్లు బ్రేక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
బ్యాటరీ పనితీరు దెబ్బతీయకుండా : ల్యాప్‌టాప్‌లను 100 శాతం ఛార్జింగ్ చేస్తుంటారు. సున్నా అయ్యే వరకూ వాడుతుంటారు. ఇది బ్యాటరీ పనితీరును దెబ్బతీస్తుందని, 20-80 శాతం ఛార్జింగ్ సురక్షితమని చెబుతున్నారు. ల్యాప్‌టాప్ కొన్నప్పుడు వచ్చిన ఛార్జరనే వినియోగించాలని సూచిస్తున్నారు.
ఛార్జింగ్ పెట్టి ల్యాప్‌టాప్ వాడడంపై చాలా మందికి అనేక సందేహాలు అపోహలున్నాయి. నిరభ్యంతరంగా ఛార్జింగ్ చేస్తూ వాడుకోవచ్చు. ఛార్జింగ్ తీసినప్పటి కంటే కనెక్ట్ చేస్తూ వాడుతున్నప్పుడే మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. వీటి సీపీయూ హార్డ్‌వేర్ అలా తయారుచేసి ఉంటుంది. అలాగని ఎల్లప్పుడూ ఛార్జింగ్ పెడుతూనే వాడుకోవద్దు. ఎడిటింగ్, గేమింగ్ లాంటి హెవీ యూసేజీ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకుని వాడకోవడమే ఉత్తమం - సాయికిరణ్, టెక్నికల్ హెడ్, డెల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్
ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ల వద్దే!! : ల్యాప్‌టాప్‌లలో సమస్యలు తలెత్తినప్పుడు దగ్గరలోని సర్వీస్ సెంటర్లకు వెళుతుంటారు. ఇలా చేయకుండా సంబంధిత కంపెనీ అథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలోనే ఇవ్వాలి. ముందు బయట రిపేర్ చేయించి ఆ తర్వాత ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌కు వెళ్తే ఏడాది వరకు ఉండే వారంటీని సైతం నిరాకరిస్తారని నిపుణులు చెబుతున్నారు.
థర్డ్‌పార్టీ సాఫ్ట్వేర్లు వద్దు : ఇంటర్నెట్లో కనిపించే థర్డ్‌పార్టీ యాప్‌లను సైతం ల్యాప్‌టాప్‌లో చాలామంది ఇన్స్టాల్ చేస్తుంటారు. ఇది వ్యక్తిగత గోప్యతతో పాటు సిస్టమ్ పనితీరును దెబ్బతీస్తుంది. సంబంధిత మైక్రోసాఫ్ట్ స్టోర్, యాప్‌స్టోర్, ప్లేస్టోర్ల ద్వారానే యాప్‌లను ఇన్స్టాల్ చేయాలి. సాఫ్ట్వేర్ల ఇన్‌స్టాలింగ్ విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలే పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ల్యాప్‌టాప్ స్క్రీన్లను శుభ్రం చేయడానికి వాటర్ స్ప్రేలను వాడుతుంటారు. అలా చేయవద్దు. నీరు ల్యాప్‌టాప్ లోపలికి వెళ్లి హార్డ్‌వేర్ కాంపోనెంట్ల ద్వారా షార్ట్‌సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
'వాటర్ హీటర్' వాడుతున్నారా? - ఎలాంటిది తీసుకోవాలి? - ఈ జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!
"ఉల్లాసోదయానికి సాయం సంధ్యారాగం" - ఇలా అలవాటు చేసుకోవాలంటున్న నిపుణులు!

