టీనేజర్ల ఆలోచనలను పేరెంట్స్ - తల్లిదండ్రుల ప్రేమను పిల్లలు అర్థం చేసుకుంటే అన్నీ హ్యాపీడేసే!
- వయసు పెరుగుదలతో శారీరక, మానసిక మార్పులు - తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలంటున్న నిపుణులు!

Published : June 26, 2026 at 1:19 PM IST
Good Relationship with Parents and Childrens : టీనేజీలో ఉన్న పిల్లలు .. రెక్కలు తొడుకున్న పక్షుల్లా, రంగు రంగుల సీతాకోక చిలుకల్లా స్వేచ్ఛగా తమ లోకంలో విహరించాలనుకుంటున్నారు. దీంతో నిన్నటి వరకూ తమ చాటున పెరిగిన వాళ్ల వ్యవహారశైలి తల్లిదండ్రులకు ఓ పట్టాన మింగుడుపడదు. అలాగని తప్పంతా ఒకరిదే అనుకోవద్దంటున్నారు నిపుణులు. మరి, ఈ సమస్యకు పరిష్కారం తెలియాలంటే ఇరువర్గాలూ అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
పేరెంట్స్ గమనించండి :
వాదించకండి : పిల్లల్ని దారికి తెచ్చుకోవడానికి మొండితనం వద్దంటున్నారు నిపుణులు. వాదనలకు అసలే దిగొద్దట. వాళ్లేం చెబుతున్నారో వినడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. ఏదైనా విషయాన్ని ముక్కు సూటిగా కుదరదంటే కుదరదని చెప్పవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కొన్నాళ్లు వాయిదా వేయామని చెప్పాలట. అవసరమైతే కొన్ని షరతులతో ఒప్పుకోమని సలహా ఇస్తున్నారు. ఒప్పుకొంటే అందుకు వారిపై ఉన్న ప్రేమే కారణమని వారికి అర్థమయ్యే విధంగా వ్యవహరించాలట.
బలవంతంగా వద్దు : పిల్లలతో ఏదైనా పనిని బలవంతంగా చేయించాలనుకునే కొద్దీ మరింతగా ప్రతిఘటిస్తారట. అలాగని వదిలేయమని కాదు. నెమ్మదిగా నచ్చజెప్పామంటున్నారు నిపుణులు. ఎందుకు ఇష్టపడటం లేదో తెలుసుకోమని చెబుతున్నారు. ఆ పనిలో అలవాటు పడే వరకూ మీరు తోడుగా ఉండమని సలహా ఇస్తున్నారు. ఎక్కడైనా తగ్గాల్సి వస్తే మీరే ముందుకు రావాలని పేర్కొంటున్నారు. అలాగైనా మీకు వారిపై ఉన్న ప్రేమని అర్ధం చేసుకుంటారట.
వయస్సు పెరిగే కొద్ది వేధించే చర్మ సమస్యలు - ఇలా చేస్తే సహజంగా తగ్గించుకోవచ్చట!
ప్రత్యామ్నాయాలు ఇవ్వండి : ఎదిగే పిల్లలు, అభిప్రాయాలు, ఆలోచనలూ తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. అలా కాకుండా ప్రతి పనిలోనూ ఇలా చేయి, అలా చేయి అని చెబుతుంటే అయిష్టత పెంచుకుంటారని హెచ్చరిస్తున్నారు. ఆ పనులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించడం లేదా వాళ్లకి నచ్చినట్లు చేయడం లాంటివి చేస్తారని తెలియజేస్తున్నారు. అందుకే, ప్రతి పనికీ కొన్ని ప్రత్యామ్నాయాలు ఇస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. వారికి ఆప్షన్ ఇచ్చినట్లూ ఉంటుందని సలహా ఇస్తున్నారు. దీంతో మీరు కోరుకున్నదీ జరుగుతుందట.
అజమాయిషీ వద్దు : అజమాయిషీ చేయడం వల్ల తమ ఆలోచనలకి, ఇష్టాయిష్టాలకు మీరు అడ్డుపడుతున్నారని పిల్లలు భ్రమపడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అలా కాకుండా, ఓ ఫ్రెండ్‌గా వారితో గడపాలని సూచిస్తున్నారు. అప్పుడే, మనసు విప్పి మాట్లాడతారని తెలియజేస్తున్నారు. ఏదైనా వారికి అదే పనిగా ఉపన్యాసంలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తున్నట్లే ఏ విషయమైనా చెప్పాలని సలహా ఇస్తున్నారు. ఇంట్లో పనులు లేదా ఉద్యోగం రీత్యా మీరు టైం లేకున్నా.. రోజులో కొంత సమయం వాళ్లకు కేటాయించామంటున్నారు. ఇది మీ మధ్య బంధాన్ని బలపరుస్తుందని వివరిస్తున్నారు.
పిల్లలూ ఆలోచించండి :
ఆ ఉద్దేశం తెలుసుకోండి : పేరెంట్స్ అనుభవంతో చెబుతారు. సలహాలు ఇవ్వడం, ఆంక్షలు పెట్టడం వెనుక ఉద్దేశం మీ సంక్షేమమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే, వాళ్లేం చెబుతున్నారో ఓ సారి వినాలంటున్నారు. వారి బాధ, ఆందోళనల్ని అర్థం చేసుకోమని పేర్కొంటున్నారు. ఆ తర్వాత వాళ్లకు ఏం చెప్పాలి? ఎలాంటి భరోసా ఇవ్వాలనేది మీకే తెలుస్తుందని వివరిస్తున్నారు.
ఉక్రోషం వద్దు : అనుకున్నది సాధించాలనే పంతం ఉండటం మంచిదే. కానీ, ఈ ఉక్రోషం కాస్తా కోపంగా మారితే.. మాటలే తూటాలవుతాయంటున్నారు నిపుణులు. ఆ ఒత్తిడిలో ఎదుటివారు నొచ్చుకునేలా దూసుకెళ్తాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎదిరించడం, వాదించడం వల్ల సమస్య మరింత పెద్దది అవుతుందని పేర్కొంటున్నారు. మీరు చెప్పాలనుకున్న విషయం ఏదైనా శాంతంగా చెప్పామని సూచిస్తున్నారు. మీరు కోరింది ఏదైనా ఇప్పడే కావాలని తెలియజేస్తున్నారు. ఈ రోజే చేయాలని అనొద్దట. వారికి ఆలోచించుకునే అవకాశం ఇవ్వలని చెబుతున్నారు. మీరు టైం తీసుకోమంటున్నారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పితే.. కచ్చితంగా మిమ్మల్ని అర్ధం చేసుకుంటారట.
స్పష్టంగా చెప్పండి : మీ మనసులో వంద కోరికలు, ఆలోచనలు ఉండొచ్చు. వాటిని లోపలే ఉంచుకుని బయటికి మాత్రం వేరే విషయాలపై గొడవపడటం వల్ల ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. మీరేం అనుకుంటున్నారో వారితో ధైర్యంగా చెప్పామని చెబుతున్నారు. అంతేకాదు, ఆ పని చేయడం వల్ల మీ హద్దుల్ని మరిచిపోననే విషయంలో వారికి భరోసా ఇవ్వమంటున్నారు. అప్పుడు వాళ్లూ మిమ్మల్ని నమ్ముతారని వివరిస్తున్నారు.
రాజీ పడాల్సిందే : పేరెంట్స్, టీనేజర్లు ఇద్దరూ కొన్నిసార్లు రాజీ పడాలంటున్నారు నిపుణులు. ఎలాగంటే, ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం గడపాలనుకుంటే.. పేరెంట్స్ పెట్టిన సమయ పరిమితిని అంగీంచాలని సలహా ఇస్తున్నారు. ఎలాంటి బంధంలోనైనా సర్దుకుపోయినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొంటున్నారు.
సలహా తీసుకోండి : ప్రతి సమస్యనూ మేమే పరిష్కరించుకోగలమని అనుకోవద్దంటున్నారు నిపుణులు. కొన్నింటికి అనుభవం అవసరమని చెబుతున్నారు. అందుకే, కష్టాన్ని, ఇబ్బందుల్ని మనసులో పెట్టుకోవద్దని తెలియజేస్తున్నారు. అమ్మానాన్నలతో మనసు విప్పి మాట్లాడటం, సలహా తీసుకోవడం మంచిదట.
టీనేజీ పిల్లలు స్వతంత్రంగా ఉండాలనుకోవడం, ఫ్రెండ్స్‌తో గడపాలనుకోవడం సర్వసాధారణం. ఆ మార్పుని పేరెంట్స్ గుర్తించడమే కాదు, అంగీకరించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ పిల్లలు చేసే పనులు మీకు నచ్చకపోవచ్చట. కానీ, అవి హానికరం కానంత వరకూ చూసి చూడనట్లు వదిలేయడమే మేలని చెబుతున్నారు. అదే సమయంలో పొరపాటు జరిగినా సరే, పిల్లలు వచ్చి చెప్పుకొనే కమ్యూనికేషన్ మీ మధ్య ఉండాలని సూచిస్తున్నారు. అలాగే, పిల్లలు కూడా ఓ విషయాన్ని అర్థం చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఈ వయసులో ఉత్సాహం, ఉద్రేకం అన్నీ ఎక్కువగానే ఉంటాయట. మీరు చేసే పని ఏదైనా సరే.. మీ కల్చర్, విలువలు, కుటుంబ పరిస్థితులకి సరిపడుతుందా? మీ ఫ్యామిలీ అంగీకరిస్తుందా అన్నది ఆలోచించుకోవాలని పేర్కొంటున్నారు. అలా కాకుండా ఇతరుల్లా మీరు ఉండాలనుకోవడం, పీర్ ప్రెజర్లో పడి ఎదుటి వారిలా మీరూ ఉండాలని ప్రయత్నించడం మంచిది కాదని తెలియజేస్తున్నారు. ఏ సమస్య ఉన్న పేరెంట్స్‌తో చెబితే సరిపోతుందని సూచిస్తున్నారు. వాళ్లు అర్థం చేసుకోవడం లేదనిపిస్తే అవసరాన్ని బట్టి మానసిక నిపుణుల సాయం తీసుకోవడం మంచిదట.
జుట్టు సమస్యలకు "మునగాకు"! - ఎలా ఉపయోగించాలో తెలుసా?
ఉద్యోగంపై ఆసక్తి తగ్గుతోందా? - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న ఎక్స్పర్ట్స్!

