'మనసుంటే మార్గం ఉంటుంది బ్రో' - సక్సెస్ఫుల్ కెరీర్ షార్ట్ కట్స్ ఇవే!
జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలా? - పలు సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు!

Published : May 25, 2026 at 5:03 PM IST
Career Growth Tips : కెరీర్లో త్వరగా ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, చేసే పనికి తగిన గుర్తింపు లభించకపోవడం, టెక్నాలజీలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విషయ పరిజ్ఞానం పెంపొందించుకోలేకపోవడం ఇలా కారణమేదైనా కొంతమంది కెరీర్ 'ఎక్కడ వేసిన గొంగళి' అక్కడే అన్నట్లుగా ఉంటుంది. తద్వారా చేస్తున్న జాబ్‌లో సంతృప్తి దక్కకపోగా, పనిపై క్రమంగా ఆసక్తి తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అలా జరగకూడదంటే కొన్ని విషయాల్లో మనల్ని మనం మెరుగుపరచుకోవాలని సూచిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
వాటిని మర్చిపోయారా? : జాబ్ అంటే రోజూ చేసే పనులే కాదు. నిర్ణీత వ్యవధిలో వర్క్‌కు సంబంధించిన కొన్ని లక్ష్యాలనూ నిర్దేశించుకోవడం. ఎలాగంటే, మీరు చేసే పనిలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, సాంకేతిక విషయాల్లో పరిజ్ఞానం సంపాదించడం ఇలా మీరు భవిష్యత్తులో ఏ అంశాలపై పట్టు సాధించాలనుకున్నారో వాటి కోసం కాస్త టైం కేటాయించాలంటున్నారు నిపుణులు. ఇది ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా మీ జాబ్‌కి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఫలితంగా, కెరీర్లో వేగంగా ఉన్నతి సాధించవచ్చట. అయితే, ఈ విషయంలో 'మాకు రోజువారీ పనులకే టైం సరిపోదు, ఇక మిగతా విషయాలపై ఎలా దృష్టి పెట్టాలి?' అంటూ చాలామంది తమ లక్ష్యాలను పూర్తిగా పక్కన పెట్టేస్తుంటారు. కానీ, మనసుంటే మార్గం ఉంటుందన్నట్లు, ఓ ప్లానింగ్ ప్రకారం పనుల్ని సమన్వయం చేసుకోగలిగితే నిర్దేశించుకున్న లక్ష్యాలపై శ్రద్ధ పెట్టడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు నిపుణులు.
'అమ్మమ్మ'లా కనిపిస్తున్నారా? - "మీ వయస్సును దాచేసే ఫుడ్"పై నిపుణుల సూచనలు
నిత్య విద్యార్థిగా : కెరీర్లో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాలని అందరికీ తెలిసిందే! కానీ, చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కెరీర్లో త్వరితగతిన అభివృద్ధి సాధించలేకపోవడానికి ఇదీ ఓ కారణమట. అందుకే, చేస్తున్న పనికి సంబంధించిన అంశాలపై పూర్తి పట్టు సాధించడం, అందులో వస్తోన్న సాంకేతికతపై పరిజ్ఞానం పెంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే పనిని మరింతగా ఆస్వాదించవచ్చని చెబుతున్నారు. ఈ చురుకుదనమే మనల్ని అనుకున్న స్థాయికి చేరుస్తుందట.
ఒకే సంస్థలో ఉన్నా : ఒకే సంస్థలో ఎక్కువ కాలం పాటు పనిచేయడం వల్ల ఉద్యోగంలో ఉన్నతిని సాధించలేమని చాలామంది అనుకుంటారు. అందుకే, జీతభత్యాలు, ప్రమోషన్లు వెంటవెంటనే వచ్చే సంస్థలను అన్వేషించి మరీ పదేపదే కంపెనీలు మారుతుంటారు. అయితే, ఈ ఆలోచన తప్పని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఒకే కంపెనీలో పనిచేసినా చురుగ్గా మనం ఎంచుకునే బాధ్యతలు, మనకున్న నైపుణ్యాలే మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాయని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త బాధ్యతల్ని స్వీకరించడానికి ఉత్సాహం చూపడం, ఓ సీనియర్‌గా కొత్తగా చేరిన ఉద్యోగుల్ని మీరు గైడ్ చేసే విధానం వంటివన్నీ కెరీర్‌కు దోహదపడతాయని సలహా ఇస్తున్నారు.
ఆ ధోరణి వీడితేనే : కెరీర్ అభివృద్ధిలో ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. అందుకే,'నా పనేదో టైంకి పూర్తి చేసుకుంటే చాలు' అన్న ధోరణి వీడి, బృందాన్ని కలుపుకొనిపోయే తత్వాన్ని అలవర్చుకోమని చెబుతున్నారు. అలాగే, ఉన్నత అధికారులతో వినయంగా ఉంటూ, మీ పని గురించి ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తున్నట్లయితే పని పట్ల మీరు చూపించే అంకితభావం, ఉత్సాహం వంటివన్నీ వారికి అర్థమవుతాయట. ఫలితంగా, కెరీర్లో ఉన్నతి సాధించే ఛాన్స్ ఉంటుంది.
జుట్టు కుదుళ్లలో దురదగా ఉందా? - రోజూ ఇలా చేస్తే బెటర్ అంటున్న నిపుణులు

