స్టీల్ సింక్‌ని ఎలా క్లీన్ చేస్తున్నారు? - ఇలా చేస్తే జిడ్డు పోయి కొత్తదానిలా మెరుస్తుంది!
ప్రస్తుత రోజుల్లో కిచెన్‌లో కామన్‌గా సింక్ - ఇలా క్లీన్ చేస్తేనే ఎక్కువ కాలం మన్నిక అంటున్న నిపుణులు!

Published : November 19, 2025 at 7:21 PM IST
Stainless Steel Sink Cleaning Tips : ఇంట్లో గిన్నెలు శుభ్రం చేయడానికి, కూరగాయలు కడగడానికి, చేతులు శుభ్రం చేసుకోవడానికి ఇలా ప్రతి చిన్న పనికి మనం ఉపయోగించేది సింక్‌నే. కొంతమంది స్టెయిన్‌లెస్ స్టీల్ సింక్‌లను ఎంపిక చేసుకుంటారు. కానీ వీటిని సరైన విధానంలో వాడకపోయినా, శుభ్రం చేయకపోయినా మొత్తం వంటగదినే అపరిశుభ్రంగా మార్చేస్తాయి. ఈ క్రమంలో సింక్ ఎప్పుడూ కొత్తదానిలా తళతళలాడుతూ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?
స్టెయిన్‌లెస్ స్టీల్ సింక్లు శుభ్రం చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. అయితే దీన్ని శుభ్రం చేయడం అనగానే చాలామంది రసాయనాలున్న లిక్విడ్స్‌తో పాటు గరుకుగా ఉన్న స్క్రబ్స్‌ని ఉపయోగిస్తారు. కానీ అలా చేయడం వల్ల స్టీల్ సింక్ కొద్ది రోజుల్లోనే పాతబడిపోతుంది. ఈ నేపథ్యంలో సింక్‌ని వాడేటప్పుడు, శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.
కెరీర్లో ఉన్నతంగా రాణించాలంటే? - ఈ నిజాలు అంగీకరించాలట!
వాడకాన్ని బట్టి : మనం రోజూ గిన్నెలు శుభ్రం చేసినప్పుడు, కాయగూరలు కడిగినప్పుడు ఎంతో కొంత చెత్త సింక్‌లో కూడా ఉండిపోతుంది. అందుకే సింక్‌ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సింక్ వాడకాన్ని బట్టి ఎన్ని రోజులకోసారి శుభ్రం చేసుకోవాలనేది నిర్ణయించాలని చెబుతున్నారు.
శుభ్రం చేద్దామిలా! : రసాయనాలతో కూడిన లిక్విడ్‌వాష్‌లు, డిటర్జెంట్‌లు ఉపయోగించి సింక్‌ని శుభ్రం చేయడం వల్ల దాని నాణ్యత దెబ్బతింటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే సహజసిద్ధంగా తయారుచేసిన పదార్థాలతో శుభ్రం చేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇంట్లోనే ఉండే బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మ లేదా నారింజ తొక్కలు, ఆలివ్ నూనె మొదలైనవి ఉపయోగించి సింక్‌ని సులభంగా క్లీన్ చేయోచ్చని సలహా ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ముందుగా సింక్‌లో ఎలాంటి చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఒక మెత్తటి స్పాంజ్ సాయంతో సింక్ అంతా వ్యాపించేలా బాగా రుద్ది, తర్వాత వెనిగర్‌తో కడగాలని పేర్కొంటున్నారు. అనంతరం నీటితో శుభ్రం చేసి నిమ్మ లేదా నారింజ తొక్కలతో మెల్లగా సింక్ మొత్తం రుద్దాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల సింక్ నుంచి దుర్వాసన రాకుండా ఉంటుందని చెబుతున్నారు. దీంతో సింక్ తాజాగా ఉండడంతో పాటు ఎప్పటికీ కొత్తదానిలా మెరిసిపోతూ ఉంటుందని వివరిస్తున్నారు. మళ్లీ నీళ్లతో శుభ్రం చేసి, తడి పూర్తిగా ఆరిన తర్వాత మెత్తని వస్త్రంపై ఆలివ్‌నూనె వేసి సింక్ మొత్తం తుడవాలని సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు కూడా :
- సింక్‌లో బ్లీచ్, క్లోరిన్ వంటి పదార్థాలను ఎక్కువ సమయం ఉంచకూడదంటున్నారు నిపుణులు. అలా ఉంచడం వల్ల మెరుపు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
- స్టీల్ లేదా ఐరన్ స్క్రబ్స్ ఉపయోగించడం వల్ల గీతలు పడతాయి కాబట్టి వాటిని వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
- గిన్నెలు వేసేటప్పుడు, వాష్ చేసేటప్పుడు నెమ్మదిగా పని చేసుకోవాలని, లేదంటే వాటి వల్ల గీతలు పడచ్చని తెలియజేస్తున్నారు.
- అలాగే సింక్ ఉపయోగించిన ప్రతిసారీ నీళ్లు నిల్వ ఉండిపోకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు వేడినీళ్లలో మైల్డ్ సోప్ కలిపి వాటితో సింక్‌ని శుభ్రం చేయాలని వివరిస్తున్నారు.
- సింక్‌ని తరచూ ఉపయోగించడం వల్ల మచ్చలు ఎక్కువగా పడతాయని చెబుతున్నారు. కాబట్టి మెత్తని వస్త్రంపై వైట్ వెనిగర్ వేసి తుడవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సలహా ఇస్తున్నారు.
చలికాలంలో బాల్కనీలో మొక్కలు జాగ్రత్త! - ఆరోగ్యంగా ఉండాలంటే టిప్స్ సూచిస్తున్న నిపుణులు!

