'నైట్ టైమ్ స్కిన్ కేర్' రొటీన్ - ముఖం అందంగా మెరిసిపోవాలంటే!
చర్మ సంరక్షణ విషయంలో పొరపాట్లు - రాత్రి ఇలా చేస్తే సరిపోతుంది!

Published : September 1, 2026 at 7:11 PM IST
Simple Skincare Steps Before Bed : ప్రతి ఒక్కరూ మేకప్ లేకుండా కూడా తమ ముఖం స్పష్టంగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే, బిజీగా ఉండే రోజువారీ జీవితం, ధూళి, కాలుష్యం, మానసిక ఒత్తిడి మన చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చాలా మంది ఖరీదైన ప్రొడక్ట్స్ కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నారు. నిజానికి, అందమైన, మెరిసే చర్మం రహస్యం కేవలం ఖరీదైన ప్రొడక్ట్స్‌లోనే లేదు. అది రోజువారీ అలవాట్లలో, ముఖ్యంగా నైట్‌టైమ్ స్కిన్‌కేర్ రొటీన్లో ఉందంటున్నారు నిపుణులు.
రాత్రి సమయం అనేది చర్మానికి చాలా కీలకం. ఎందుకంటే, ఈ సమయంలోనే చర్మం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. అందుకే, రాత్రి పడుకునే ముందు చర్మాన్ని సరిగ్గా సంరక్షించుకుంటే, ఉదయం నిద్ర లేవగానే ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా చేస్తే ముఖం మరింత తాజాగా, మృదువుగా, సహజమైన గ్లోతో మెరిసిపోతుంది.
మేకప్, మలినాలను శుభ్రం చేసుకోవడం : రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మేకప్ లేదా మలినాలు ముఖంపై అలాగే ఉండిపోతే, అవి చర్మ రంధ్రాలను మూసివేసి, మొటిమల వంటి సమస్యలను మరింత ఎక్కువ చేస్తాయి. కాబట్టి, మొదట మేకప్ రిమూవర్ ఉపయోగించి మేకప్‌ను పూర్తిగా తొలగించుకోవాలి. ఆ తర్వాత, చర్మానికి సరిపోయే ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రంగా చేసుకోవాలి. ఈ డబుల్ క్లెన్సింగ్ పద్ధతి మీ చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
బంధంలో ఇవి కూడా "మానసిక వేధింపులే"! - అవేంటో తెలుసా?
సీరమ్ లేదా ఫేస్ ఆయిల్ అప్లై చేసుకోవడం : ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత చర్మం కొద్దిగా పొడిబారినట్లు అనిపిస్తుంది. అందుకే దానికి తగిన పోషణ అందించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో మీ చర్మ తత్వానికి సరిపోయే సీరమ్ లేదా ఫేస్ ఆయిల్‌ను ఉపయోగించాలి. ఇది చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేసి, రాత్రంతా చర్మం తనను తాను రిపేర్ చేసుకోవడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల, రోజులు గడిచేకొద్దీ చర్మం సహజమైన, ఆరోగ్యకరమైన మెరుపును సంతరించుకుంటుంది.
మాయిశ్చరైజర్‌తో తేమను లాక్ చేయడం : సీరమ్ అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం చాలా ముఖ్యం. ఇది చర్మంలోని తేమను బయటకు పోకుండా లాక్ చేస్తుంది. చర్మాన్ని మృదువుగా, కోమలంగా ఉంచుతుంది. ఒకవేళ మాయిశ్చరైజర్ రాయడం మానేస్తే, చర్మం పొడిబారిపోయి కాంతివిహీనంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అండర్-ఐ క్రీమ్ వాడకం : ఈ రోజుల్లో చాలామంది మొబైల్స్, లాప్‌టాప్‌ల వంటి స్క్రీన్‌ల ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనివల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, వాపు వంటి సమస్యలు వస్తున్నాయి. రాత్రి పడుకునే ముందు అండర్-ఐ క్రీమ్ అప్లై చేయడం వల్ల ఈ సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కళ్ల చుట్టూ ఉండే సున్నితమైన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, ముఖం తాజాగా కనిపించడానికి సహాయపడుతుంది.
పెదవుల సంరక్షణ : చర్మ సంరక్షణ విషయానికి వస్తే చాలా మంది పెదవులను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, పొడిబారిన, పగిలిన పెదవులు ముఖ అందాన్ని తగ్గిస్తాయి. రాత్రి పడుకునే ముందు మంచి లిప్ బామ్, అలోవెరా జెల్ లేదా బాదం నూనె అప్లై చేయండి. ఇది పెదవులను లోతుగా హైడ్రేట్ చేసి, మృదువుగా, సహజమైన గులాబీ రంగులోకి మార్చడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పిల్లలను బలవంతం చేస్తున్నారా? - జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు!

