సాంబ్రాణి ధూపం - జుట్టుకు కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!
జుట్టు ఆరోగ్యానికి - అమ్మమ్మల కాలం నాటి సాంబ్రాణి ధూపం మంచిదేనా?

Published : July 6, 2026 at 4:58 PM IST
Benefits of Using Sambrani for the Hair : ఇప్పుడు తలస్నానం చేయగానే జుట్టు ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రయర్లు, హిట్ స్టైలింగ్ టూల్స్ ఉన్నాయి. వాటివల్ల జుట్టు దెబ్బతిని హెయిర్‌ఫాల్, చుండ్రు లాంటి సమస్యలు వస్తాయి. కానీ, ఒకప్పుడు ఇవేమీ లేకుండానే మన నానమ్మలు, అమ్మమ్మలు తమ జుట్టు ఎంతో ఆరోగ్యంగా, నల్లగా, ఒత్తుగా ఉండేది. ఆ రోజుల్లో ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ లేకుండానే వాళ్లు పాటించిన అద్భుతమైన సహజపద్ధతి ఏంటంటే, తలస్నానం చేశాక జుట్టుకు సాంబ్రాణి ధూపం వేసుకోవడం. ఇలా చేయడం వల్ల తడి జుట్టును ఆరబెట్టడానికి మాత్రమే కాదు, శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. ఈ క్రమంలో తలస్నానం చేశాక సాంబ్రాణి ధూపం వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం!
పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారాల్లో సాంబ్రాణి ధూపం ఒకటి. ఇంట్లో ధూపం వేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నమ్మేవారు. చిన్న పిల్లల ఆరోగ్యం నుంచి ఇల్లు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా, సువాసన భరితంగా మార్చుకునేందుకు ఈ సాంబ్రాణి ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో వర్షాకాలంలో వాతావరణం తేమగా, చల్లగా ఉంటుంది. ఇలాంటప్పుడు జుట్టుకు సాంబ్రాణి ధూపం వేస్తే ఆరోగ్య సమస్యలు దరికి చేరవని పెద్దలు చెబుతుంటారు.
కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయా? - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న ఎక్స్పర్ట్స్!
తేమను తొలగించడానికి : వర్షాకాలంలో గాలిలో తేమవల్ల తలస్నానం చేసిన తర్వాత జుట్టు త్వరగా ఆరదు. దీంతో మాడు మీద ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో సాంబ్రాణి ధూపం వేసుకోవడం వల్ల జుట్టులోని తేమను పీల్చుకుని, తలను పొడిగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు, ఈ ధూపంలో వేప, తులసి లాంటి మూలికలను వాడటం వల్ల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు మాడుకు పుష్కలంగా అందుతాయి. ఈ పొగ తలకు తగలగానే మురికి, చెమట, బ్యాక్టీరియా పూర్తిగా నశించిపోతాయి. అంతేకాదు, సాంబ్రాణి పొగలోని మృదువైన వేడి వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది కుదుళ్లకు బలాన్ని ఇచ్చి, జుట్టు రాలడానికి తగ్గిస్తుంది.
దుర్వాసన దూరం : వానలో తడవడం లేదా తల సరిగ్గా ఆరకపోవడం వల్ల వచ్చే దుర్వాసనను సాంబ్రాణి పొగ పొగొడుతుంది. ఇది సహజ పర్ఫ్యూమ్లా పనిచేసి, కురులకు మంచి సువాసనను ఇస్తుంది. అంతేకాదు, మెదడును శాంతపరుస్తుంది. వానాకాలం చికాకుగా అనిపించే మూడ్‌ను మార్చి, రిలాక్సేషన్‌ను ఇస్తుంది. పైగా, సాంబ్రాణికి యాంటీ సెప్టిక్ గుణాలు ఎక్కువ. ఇవి తల మీద దురదను తగ్గించి, కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
అతిగా వాడితే అనర్థమే : సాంబ్రాణి ధూపం వేసుకునే పద్ధతి జుట్టుకు ఎంతో మంచిదే అయినా, దీన్ని రోజూ అదే పనిలా చేయకూడదు. ఎందుకంటే, దీని నుంచి వచ్చే పొగను మరీ ఎక్కువగా పీల్చడం ఊపిరితిత్తులకు అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. అందుకే, దీన్ని వారానికి ఒకసారి లేదా నెలకు రెండుసార్లు మాత్రమే వేసుకోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"డిజిటల్ డీటాక్స్" - ఈ టిప్స్ పాటించాలంటున్న నిపుణులు!
ఆముదం Vs కొబ్బరి నూనె - పిల్లల్లో జుట్టు పెరగటానికి ఏది మంచిది?

