మీ పిల్లలు స్కూల్‌కు, ట్యూషన్‌కు ఒంటరిగా వెళ్తున్నారా? - ఈ జాగ్రత్తలు తప్పనిసరట!
-పిల్లలకు చదువు మాత్రమే కాదు - అపరిచితులతో ఎలా మెలగాలి, అన్యుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో నేర్పించాలంటున్న నిపుణులు!

Published : October 17, 2025 at 3:08 PM IST
Child safety and Teaching Kids to be Vigilant: పిల్లలు ఎవరినైనా ఇట్టే నమ్మేస్తారు. అందరూ మంచివాళ్లే అనే భావనతో ఉంటారు. దీన్నే ఆసరా చేసుకుంటారు అపరిచితులు. చాక్లెట్లు, బొమ్మలు ఆశచూపి పిల్లలను మచ్చిక చేసుకుంటారు. కిడ్నాప్, ట్రాఫికింగ్ చేయడం, హాని చేయడం వంటివి అపరిచితుల లక్ష్యాలుగా ఉంటాయి. వీటిని పిల్లలు గుర్తించలేరు. ప్రమాదం ముంచుకొస్తుందని కూడా ఊహించలేరు. అందుకే అపరిచితులను ఎలా గుర్తించాలి? వారి విషయంలో ఎలా వ్యవహరించాలనేది తల్లిదండ్రులు, పిల్లలకు తప్పకుండా నేర్పించాలి. ఒంటరిగా స్కూల్, ట్యూషన్‌కు వెళ్లి వచ్చే సమయంలోనో, ఇంటికి దగ్గరలో ఉండే స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తున్నప్పుడో మాటలు కలుపుతూ ఆకర్షించే వారి విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలో అవగాహన కల్పించడం అవసరమంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!
మనవాళ్లెవరో చెప్పి : కుటుంబ సభ్యులతో పాటు, దగ్గరలో ఉండే బంధువులు, బాగా కావాల్సిన వాళ్లు ఎవరు అనేది అర్థమయ్యేలా చెప్పాలి. వీళ్లు నమ్మకమైన వారని, వారు మినహా మరెవరు పిలిచినా, ఒత్తిడి చేసినా వెంట వెళ్లకూడదని సూచించాలి.
లిఫ్ట్ వద్దనేలా : అపరిచితులు ఎవరైనా వచ్చి, లిఫ్ట్ కావాలా అని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో వారితో వెళ్లొద్దని చెప్పాలి. ఆ కాలనీలో ఓ చిరునామా దొరకడం లేదనో, పెంపుడు కుక్క ఇటువైపే వచ్చిందనో చెబుతూ సహాయం చేసేందుకు తన వాహనంలో రావాలని అడిగితే నిరాకరించాలి. అపరిచితుల వెంట వెళ్లడం, వారి వాహనం ఎక్కడం వంటివి చేయొద్దని వివరించాలి.
"ఉల్లాసోదయానికి సాయం సంధ్యారాగం" - ఇలా అలవాటు చేసుకోవాలంటున్న నిపుణులు!
చాక్లెట్లు, బొమ్మల ఆశచూపి : పిల్లలు నిత్యం ఏ సమయంలో ఒంటరిగా వస్తుంటారనేది అపరిచితులు గుర్తించి, రోజూ అదే సమయంలో వారితో కలిసి నడుస్తూ, మాట కలిపే ప్రయత్నం చేస్తారు. బొమ్మలు, చాక్లెట్లు వంటివి ఇచ్చి మచ్చిక చేసుకుంటారని, తర్వాత వాళ్లు హాని తలపెడతారనేది పిల్లలకు విడమరిచి చెప్పాలి.
కుటుంబ సమాచారం గోప్యంగా : కొందరు వ్యక్తులు పిల్లలకు హాని తలపెట్టడమే కాకుండా, కుటుంబ సభ్యులను బెదిరించేందుకు పిల్లలను అస్త్రంగా ఉపయోగిస్తారు. నమ్మకమైన వారిగా దగ్గరచేరి, కుటుంబ వివరాలు, ఇంట్లో వారి వ్యక్తిగత సమాచారం, ఇంకా వీలుంటే ఏటీఎం, క్రెడిట్‌కార్డ్, ఆన్లైన్ బ్యాంక్ ఖాతాల వివరాలు, వాటి పాస్వర్డ్స్ వంటివి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అటువంటి సమాచారం ఎవరికీ చెప్పకూడదని పిల్లలకు తెలియజేయాలి.
మనసు విప్పేలా : పిల్లలు, తమకు కలిగిన భయాలు, ఆందోళనలు, ఇబ్బందులు వంటివి తల్లిదండ్రుల వద్ద పంచుకునేలా వారిని ప్రోత్సహించాలి. వారికి కొంత సమయం కేటాయించి, ఆ రోజు స్కూల్, ట్యూషన్లో జరిగిన విషయాలను తెలుసుకోవాలి. తప్పులు ఏమైనా ఉంటే, వాటివల్ల కలిగే అనర్థాలు వివరించి, మరోసారి అలా చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించాలి.
డిజిటల్ అపరిచితులతో : ఈ తరం పిల్లలంతా సెల్ఫోన్లను విరివిగా ఉపయోగించడంతో పాటు, ఆన్లైన్ గేమ్స్ ఎక్కువగా ఆడుతుంటారు. అపరిచితులు, డిజిటల్‌గానూ పిల్లలను సంప్రదించి, నమ్మకమైన వ్యక్తులుగా నటించే ప్రయత్నం చేస్తుంటారు. ఇవే సైబర్ మోసాలు, నేరాలకు అవకాశం కల్పిస్తాయి. ప్రైవేట్ బ్రౌజింగ్, ఐడీలు ఎవరికీ చెప్పకూడదని వివరించాలి.
నిరంతరం జాగ్రత్త :
- పిల్లలు ఇల్లు, పాఠశాల పరిసరాల నుంచి దూరంగా ఎక్కడికి వెళ్లకుండా పర్యవేక్షించాలి. ఇలా దూరం వెళితే ప్రమాదమని హెచ్చరించాలి.
- ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి వెళితే ప్రమాదం పొంచి ఉంటుందని, ఎవరైనా, ఏమైనా చేసేందుకు వీలుంటుందని పిల్లలకు తెలియజేయాలి.
- ఎవరైనా అపరిచితులు వచ్చి వెంటపడితే, గట్టిగా కేకలు వేసి, అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాలి. ముఖ్యంగా ఒంటరిగా ఉండకుండా, స్నేహితుల సమూహంతో కలిసి ఉండాలని తెలియజేయాలి.
ఫోన్ నంబర్లు గుర్తుండేలా : పిల్లలు ఒక్కోసారి పొరపాటున ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినా, బయటకెళ్లినప్పుడు తప్పిపోయినా, ఆందోళన చెందకుండా, వారికి తల్లిదండ్రుల పేర్లు, ఇంటి చిరునామా, ఫోన్ నంబర్లు గుర్తుండేలా కంఠస్తం పట్టించాలి. ఇంటి చిరునామా ల్యాండ్ మార్క్ ఎక్కడో కూడా వివరించేలా నేర్పాలి. పిల్లల బ్యాగ్ లేదా పెన్సిల్ బాక్స్‌లో ఇంటి చిరునామా, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నంబర్లతో కూడిన పేపరు ఉంచాలని నిపుణులు అంటున్నారు.
కాస్త ఆలస్యం అయినా సరే - అన్నీ తెలుసుకున్నాకే పెళ్లికి 'ఓకే' చెప్పాలట!
ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వాడొచ్చా? - వాస్తవాలు ఎలా ఉన్నాయంటే!

