ETV Bharat / lifestyle

పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? - ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

పిల్లలు ఇంట్లో ఉంటే - నిరంతరం పర్యవేక్షణ అవసరమంటున్న నిపుణులు

Children Alone at Home
Children Alone at Home (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : November 11, 2025 at 2:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

Precautions Children Alone at Home : పిల్లల్ని ఇంట్లో వదిలి వచ్చేశాం, ఎలా ఉన్నారో ఏంటో? ఉద్యోగాలు చేసే ప్రతి తల్లిదండ్రుల ఆలోచన ఇది. ఒక గది నుంచి ఇంకో గదికి రెప్పపాటులో మాయమవుతుంటారు చిచ్చర పిడుగులు. కంటికిరెప్పలా కాపాడుతున్నా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. వారికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

మండే వస్తువులకు దూరంగా :

  • బయటకు వెళ్లేటప్పుడు గ్యాస్ రెగ్యులేటర్ తప్పనిసరిగా ఆపాలి.
  • వండిన ఆహార పదార్థాలు వేడిగా ఉంటే, వాటిని పిల్లలకు అందేలా ఉంచకూడదు. వేడి పదార్థాలు మీద పడినా, పిల్లలు వాటిలో చేతులు పెట్టినా కాలి గాయాలవుతాయి.
  • పిల్లలు తినేందుకు సిద్ధం చేసిన పదార్థాలను కిచెన్ గట్టుపై కాకుండా హాల్, వాళ్లు ఆడుకునే గదికి దగ్గరగా అందుబాటులో ఉంచితే వారు తీసుకొని తినేందుకు వీలుంటుంది. లేకపోతే వంటగదిలోకి వెళ్లి ఆ పదార్థాలు తీసుకునే క్రమంలో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
  • బాత్రూమ్​లో వాటర్ హీటర్ ప్లగ్​ను తొలగించాలి.
Children Alone at Home
పిల్లలు ఇంట్లో ఉంటే (Getty Images)

విద్యుత్ ఉపకరణాలు :

  • పిల్లలు విద్యుత్తు ప్రమాదాల బారినపడకుండా సురక్షితమైన చర్యలు తీసుకోవాలి.
  • ఇంట్లో సరిగాలేని వైరింగ్​ను అలాగే వదిలేయకుండా సరిచేయాలి. వైర్లు వేలాడకుండా టేపుతో చుట్టి పిల్లలకు అందకుండా చూడాలి.
  • స్విచ్​బోర్డులు కింద ఉంటే పిల్లలు వాటిలో చేతులు పెట్టే అవకాశం ఉంది. ప్లగ్​లోకి ఏవైనా ఆట వస్తువులు పెడుతుంటారు. వీలుంటే స్విచ్​బోర్డులను పైకి మార్పించాలి. కుదరకపోతే కింద ఉన్న స్విచ్​బోర్డు వారికి అందకుండా జాగ్రత్తపడాలి.
  • హైవోల్టేజ్ విద్యుత్తు ఉపకరణాలకు సంబంధించిన స్విచ్​లు తప్పనిసరిగా ఆఫ్ చేయాలి.
  • కొందరు ఐరన్ బాక్స్ ప్లగ్​ను, స్విచ్​బోర్డుకు అలాగే వదిలేస్తారు. పిల్లలున్న ఇంట్లో ఇది ప్రమాదకరం. బట్టల ఐరన్ పూర్తయిన వెంటనే ప్లగ్​ తొలగించాలి. విద్యుత్తు పరికరాల విషయంలో జాగ్రత్తగా ఎలా ఉండాలనేది పిల్లలకు నేర్పాలి.

స్మోక్ అలారం ఉందా? : ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు లేకుండా పిల్లలు మాత్రమే ఉన్నప్పుడు అగ్నిప్రమాదాలు జరిగితే నష్టం తీవ్రంగా ఉంటుంది. పిల్లలు ప్రమాదాలను వెంటనే గుర్తించలేరు. తీరా గుర్తించాక తప్పించుకోవడం తెలియక ఆందోళన చెందుతారు. అందుకే ఇంటిలో స్మోక్ అలారాన్ని ఏర్పాటుచేసి, దానిని తరచూ పరీక్షిస్తుండాలి.

Children Alone at Home
పిల్లలు ఇంట్లో ఉంటే (Getty Images)

రసాయనాలు, టానిక్​లు : సాధారణంగా ఏ వస్తువునైనా నోటిలో పెట్టుకోవడం ఎక్కువ మంది పిల్లలకు అలవాటుగా ఉంటుంది. అందుకే డిటర్జంట్లు, రసాయన ద్రావణాలు పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. మందులు, సిరప్​లు కూడా పిల్లలకు అందుబాటులో ఉంచొద్దు. పొరపాటున ఆ మందులు వేసుకున్నా, సిరప్​లు తాగేసినా అనారోగ్యానికి గురవుతారు.

చిన్న వస్తువులే కదా అని :

  • పిల్లలు తిరిగే ప్రదేశంలో పదునైనవి ఏమీ లేకుండా చూడాలి. వాళ్లు పరుగులు పెట్టి ఆడుకునే సమయంలో పదునైన వస్తువులుంటే అవి తగిలి ప్రమాదం బారినపడే అవకాశం ఉంటుంది.
  • కిటికీల తలుపులు ఇంటి లోపలివైపు ఉంటే, వాటిని మూసేయాలి. పిల్లలు ఆడుకొని పైకి లేచినప్పుడు కిటికీ తలుపు తగిలి తలకు దెబ్బతగులుతుంది.
  • పిల్లలు ఆడుకునే బొమ్మల్లో అతి చిన్నవి, నాణేలు అందుబాటులో ఉంచకూడదు. వాటిని మింగితే ప్రమాదం కోరితెచ్చుకున్నట్లు అవుతుంది.

పెంపుడు జంతువులతో జాగ్రత్తలు : ఇంట్లో పెంపుడు జంతువులను, పిల్లలు తమ తోటి స్నేహితుల్లా భావించి వాటితో సరదాగా ఉంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో వాటితో అప్రమత్తంగా ఉండాలని పిల్లలకు నేర్పించాలి. పెంపుడు జంతువులు తినే సమయంలో, అవి నిద్రిస్తున్న వేళ, వాటి పిల్లలతో ఉన్నప్పుడు చిన్నారులు, వాటి వద్దకు వెళితే దాడిచేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాల్లో పిల్లలకు ముందే జాగ్రత్తలు తెలియజేయాలి.

నిరంతరం పర్యవేక్షణ : ఇంటిలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా తల్లిదండ్రులు నిశ్చితంగా ఉండొచ్చు. హాల్, పిల్లలు ఆడుకునే గది, కిచెన్, ఇంటి ముందు, తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని సెల్​ఫోన్​కు అనుసంధానం చేసుకుంటే పిల్లలు ఏం చేస్తున్నారనేది ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు.

ఇంట్లో కూడా కాలుష్యంతో ఇబ్బందిపడుతున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే బెటర్​ అంటున్న నిపుణులు!

'వెళ్లే వాళ్లని వెళ్లనివ్వకపోతే, ఉన్నా వెలితిగానే ఉంటుంది' - ఇలా చేస్తే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'!